breaking news
-
రూ. 2.46 కోట్లు అపహరణ.. పోలీసులకు చిక్కిన సైబర్ కేటుగాళ్లు
నెల్లూరు : ఓ మహిళ బ్యాంకు అకౌంట్ నుంచి రూ. 2.46 కోట్లు అపహరించిన సైబర్ కేటుగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళకు మాయ మాటలు చెప్పి, బెదిరించి కోట్లలో కాజేశారు సైబర్ నేరగాళ్లు. అయితే తాను డబ్బులు పోగొట్టుకున్న విషయాన్ని గ్రహించిన మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు సైబర్ నేరగాళ్ల తీగ లాగారు. దీనిలో భాగంగా రాజస్తాన్ కు చెందిన ఐదుగురు, హైదరాబాద్ కు చెందిన ఇద్దరు సైబర్ నేరానికి పాల్పడి కోట్ల రూపాయిలను ఆ మహిళా ఖాతా నుంచి అపహరించినట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వారి వద్ద నుంచి నిందితుల నుంచి 2 లక్షల నగదు, 50 మొబైల్స్, 57 ఏటీఎం కార్డులు, ల్యాప్ టాప్, ప్రింటర్, తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వారి అకౌంట్లలో ఉన్న రూ. 39 లక్షలను ఫ్రీజ్ చేయాలని బ్యాంకు అధికారులకు సూచించారు పోలీసులు. -
విజయవాడలో దారుణం.. డేటింగ్ పేరుతో హోటల్ రూమ్ బుక్ చేసి..
సాక్షి, విజయవాడ: మాయమాటలతో అమ్మాయిలను దోచేస్తున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను సెంట్రల్ ఏసీపీ దామోదర్ మీడియాకు వెల్లడించారు. కోనసీమ జిల్లాకు చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం విజయవాడకు వచ్చింది. వెటర్నరీ కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటున్న ఆ యువతికి నెల రోజుల క్రితం కిలారి నాగతేజతో లవ్లీ డేటింగ్ యాప్‌లో పరిచయమైంది. కాగా, నెల రోజుల నుంచి కిలారి నాగతేజ, సదరు యువతి రోజూ ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. డేటింగ్లో భాగంగా ఈ నెల 22 తేదీన ఓ హోటల్లో నాగతేజను ఆ యువతి కలిసింది.ఇద్దరి కోసం హోటల్లో రూమ్ బుక్ చేసిన నాగతేజ.. యువతి నగ్నవీడియోలు తీశాడు. అనంతరం కత్తి చూపించి ఆ యువతి ఒంటిపై బంగారాన్ని తీసుకుని నాగతేజ పారిపోయాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో నాగతేజను పోలీసులు అరెస్ట్ చేశారు.వ్యసనాలకు బానిసైన నాగతేజ.. డబ్బుల కోసం అమ్మాయిలను మోసగిస్తున్నాడు. గతంలోనూ పలువురు యువతులను మోసం చేసిన నాగతేజ.. జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలేదు. నాగతేజ అరెస్ట్‌లో సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. డేటింగ్ యాప్, టెలిగ్రామ్, ఫేస్ బుక్, ఇన్‌స్టా గ్రామ్ ద్వారా జరిగే మోసాలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ దామోదర్ సూచించారు. -
కడపలో ట్రేడింగ్ పేరుతో భారీ మోసం.. రూ.12 కోట్లకు కుచ్చుటోపి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ట్రేడింగ్ పేరుతో యువతకు కుచ్చుటోపి పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. కడపకు చెందిన పాపిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి చేతిలో 35 కుటుంబాలు మోసపోయాయి. అధిక లాభాల పేరుతో సోమశేఖర్‌రెడ్డి, కుటుంబ సభ్యులు 12 కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇచిన డబ్బును తిరిగి అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు లబోదిబో అంటున్నారు.మంత్రి నారా లోకేష్, హోం మంత్రి అనిత తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. పెట్టుబడి పెట్టిన వారిలో ఒకరు ఆత్మహత్య చేసుకోగా, మరో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహ్యతే గతి అంటూ మిగతా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘నీవు వచ్చేంత వరకూ ఇక్కడే ఉంటా తల్లీ’
అనంతపురం: ఉదయం నిద్రలేవగానే ఏదో తెలియని అలజడి.. గుండెను ఎవరో మెలిక పెడుతున్నట్లుగా బాధ... అయినా మనువరాలి పరీక్ష కోసం అన్నీ ఓర్చుకున్నాడు. ఆటోలో పిలుచుకొచ్చి ‘నీవు వచ్చేంత వరకూ ఇక్కడే ఉంటా తల్లీ’ అంటూ పరీక్ష కేంద్రం వద్ద వదిలాడు. లోపల మనవరాలు పరీక్ష రాస్తుండగా బయట ఆటోలో గుండెపోటుతో మృతిచెందాడు. హృదయ విదారకమైన ఈ ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. వివరాలు... కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లికి చెందిన రైతు, మాజీ సర్పంచ్ బొజ్జన్న (65) శుక్రవారం ఉదయం తన మనవరాలు చంద్రకళను పిలుచుకుని ఏపీఆర్జేసీ పరీక్షలు రాయించేందుకు అద్దె ఆటోలో అనంతపురానికి చేరుకున్నారు. మధ్యాహ్నం పరీక్ష కేంద్రం వద్ద కాస్త నలతగా ఉండడం గమనించిన చంద్రకళ ‘తాతా ఏమైంది’ అంటూ అడగడంతో తనకేమీ కాలేదని నవ్వుతూ పరీక్ష రాసి వచ్చేంత వరకూ తాను అక్కడే ఉంటానని, బాగా రాయాలంటూ చెప్పి కేంద్రంలోకి పంపాడు. అనంతరం ఆటోలోనే సేదదీరుతూ గుండెపోటుకు గురై మృతి చెందాడు. పరీక్ష ముగిసిన తర్వాత బయటకు వచ్చిన చంద్రకళ నేరుగా ఆటో వద్దకు చేరుకుంది. తాత నిద్రిస్తున్నాడనుకుని లేపేందుకు ప్రయత్నించడంతో ఆయన సీటులోనే జారిపోయాడు. దీంతో మృతి చెందినట్లుగా నిర్ధారించుకుని బోరున విలపించింది. ‘నేను వచ్చేంత వరకూ ఇక్కడే ఉంటానని.. ఎక్కడికెళ్లావ్ తాతా..’ అంటూ ఆమె రోదించిన తీరు అందరినీ కంట తడి పెట్టించింది. స్థానికుడి ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన అనంతపురానికి చేరుకుని సాయంత్రానికి మృతదేహాన్ని తీసుకుని స్వగ్రామానికి చేరుకున్నారు. -
మళ్లీ పుట్టి... ఒక్కటవుతాం..!
నెల్లూరు (క్రైమ్): వారిద్దరూ ప్రేమించుకున్నారు. కారణాలు ఏవైనా వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. వారిని ఎదిరించి ఒక్కటయ్యే ధైర్యంలేక ఊరుకాని ఊరు వచ్చారు. లాడ్జిలో గదిని అద్దెకు తీసుకుని తల్లిదండ్రులకు సూసైడ్ లేఖ రాశారు. ‘‘అమ్మ, నాన్నలు క్షమించండి. మీరు మా ప్రేమను ఎలాగూ అంగీకరించడం లేదు. మళ్లీ పుట్టి అందరి అంగీకారంతో ఒక్కటవుతాం’’ అంటూ రాసి, పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. హృదయ విదారకమైన ఈ సంఘటన నెల్లూరులోని ఒక లాడ్జిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం ప్రకారం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన బాచ్చు జోసఫ్ రత్నకుమార్ (23), కృష్ణా జిల్లా కైకలూరు మండలం ఆటపాకకు చెందిన చిల్లుముంత శ్రావణి (21) మధ్య బీటెక్ చదివే సమయంలో చిగురించిన స్నేహం, అటుపై ప్రేమగా మారింది. వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 21వ తేదీన నెల్లూరు వచ్చారు. కళాశాలలో కౌన్సెలింగ్ ఉందని చెప్పి ఒక లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. కౌన్సెలింగ్ పూర్తికాలేదని మరో రోజు గదికి నగదు చెల్లించారు. 23వ తేదీన గదిని శుభ్రం చేసేందుకు లాడ్జి స్వీపర్ వెళ్లి తలుపుకొట్టగా లోపల నుంచి ఎలాంటి అలికిడి లేదు. బయటకు వెళ్లి ఉంటారని భావించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు అలానే జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం వారు అద్దెకు తీసుకున్న గది నుంచి దుర్వాసన వస్తుండటంతో లాడ్జి సిబ్బంది సంతపేట పోలీసులకు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ జి.దశరథరామయ్య, ఎస్ఐ బాలకృష్ణ తలుపులు పగులగొట్టి చూడగా, బెడ్‌పై జోసఫ్ రత్నకుమార్, నేలపై శ్రావణి మృతదేహాలు కుళ్లిపోతున్న స్థితిలో పడి ఉన్నాయి. సమీపంలో గడ్డిమందు సీసా పడి ఉంది.దీంతో వారు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. వారి బ్యాగ్‌లను పరిశీలించగా అందులో మృతుల ఆధార్ కార్డులు, కళాశాలలకు సంబంధించిన సరి్టఫికెట్లు ఉన్నాయి. ఇరువురు తమ తల్లిదండ్రులకు రాసిన సూసైడ్ లేఖలను పోలీసులు గుర్తించి స్వా«దీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి సంతపేట ఇన్స్పెక్టర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విశాఖలో దంపతుల దారుణహత్య
విశాఖపట్నం: విశాఖ నగరం గాజువాక సమీపంలోని రాజీవ్‌నగర్‌లో భార్యాభర్తలు దారుణహత్యకు గురయ్యారు. డాక్‌యార్డులో పనిచేసి రిటైరైన గంపాల యోగేంద్రబాబు (66), లక్ష్మి (58) దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. వారు 35 ఏళ్లుగా రాజీవ్‌నగర్‌లో ఉంటున్నారు. రెండు రోజుల కిందట హైదరాబాద్ వెళ్లిన వారు గురువారం ఉదయం ఇంటికి చేరుకున్నారు.శుక్రవారం రాత్రి వరకు వారి ఇంటి తలుపులు తెరవకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో స్థానికంగా ఉన్న బంధువుల అమ్మాయి ఇంటికి వచ్చి చూసింది. ఇంటికి రెండువైపులా తాళం వేసి ఉండటాన్ని గమనించింది. అనుమానం వచ్చిన.. స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం అందించింది. సౌత్ ఏసీపీ టి.త్రినాథ్, దువ్వాడ సీఐ మల్లేశ్వరరావు అక్కడికి చేరుకుని తాళాలు పగలుగొట్టించి తలుపులు తెరిచారు. లోపలికి వెళ్లి చూస్తే హాల్లో యోగేంద్రబాబు, బెడ్రూమ్లో లక్ష్మి రక్తపుమడుగులో పడి ఉన్నారు. వారు అప్పటికే మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. యోగేంద్రబాబుది మచిలీపట్నం కాగా లక్ష్మిది శ్రీహరిపురం. 40 ఏళ్ల కిందట కులాంతర ఆదర్శ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. వారికి వివాహాలు జరిగి, అమెరికాలో స్థిరపడ్డారు. క్లూస్ టీం రంగంలోకి దిగి వివరాలు సేకరించింది. -
నెల్లూరు లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, నెల్లూరు: నగరంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. నెల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలోని సింహపురి లాడ్జిలో పాయిజన్ తీసుకుని ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను రాజమండ్రి కొవ్వూరుకు చెందిన జోసెఫ్(25), కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలోని ఆటపాక గ్రామానికి చెందిన శ్రావణి (23)గా పోలీసులు గుర్తించారు.మూడు రోజుల క్రితం ఉద్యోగ నిమిత్తం కౌన్సిలింగ్‌కి వచ్చామన్న కారణం చూపి సింహపురి లాడ్జిలో జోసెఫ్, శ్రావణిలు రూమ్ తీసుకున్నారు. రెండు రోజుల నుంచి గదిలో నుంచి బయటకు రాకపోవడంతో పాటు వాసన వస్తుండడంతో లాడ్జి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
టాపర్ కాస్త హంతకుడిగా..
చదివిన ప్రతి తరగతిలోనూ అత్యధిక మార్కులతో పాసైన ఓ కుర్రాడు బెట్టింగ్ అలవాటు మానుకోలేక చదువుకు దూరమై హొటల్లో సర్వర్‌గా మారి ఆఖరుకు హంతకుడిగా మిగిలాడు. చెడు సాంగత్యాన్ని మొదటిలోనే తుంచలేక ఓ వివాహిత చేతులారా బంగారం లాంటి బతుకును బుగ్గిపాలు చేసుకుంది. పైడి భీమవరంనడిబొడ్డున జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసు వివరాలు తెలిసే కొద్దీ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రణస్థలం: పైడిభీమవరంలో ఊరి నడిబొడ్డున ఈ నెల 19న జరిగిన అవాల భవానీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని జేఆర్ పురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు జేఆర్ పురం పోలీస్ స్టేషన్లో సీఐ ఎం. అవతారం గురువారం వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. అవాల భవానీ పైడిభీమవరంలోని ఓ హొటల్లో పనిచేసేది. అక్కడే సర్వర్‌గా పనిచేస్తున్న కొండక వీర్రాజు అనే వ్యక్తితో నాలుగు నెలల కిందట ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం హోటల్ యజమానికి తెలియడంతో వీర్రాజు ను పనిలో నుంచి మానిపించేశారు. ఆ తర్వాత భవానీ ఈ విషయం తమ ఇంటిలో తెలిసిపోతుందని వీర్రాజును దూరం పెట్టింది. ఫోన్ చేసినా మాట్లాడకపోవడంతో వీర్రాజు ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. మరొకరితో అక్రమ సంబంధం ఉండడం వల్లనే తనను దూరం పెడుతోందని భావించి ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఈ నెల 19న పైడిభీమవరంలోని ఒక దుకాణంలో చాకు కొను క్కుని తన దగ్గర ఉంచుకున్నాడు. పైడిభీమవరం నడిబొడ్డున ఉన్న గుర్రమ్మ గుడి వెనుక ఉన్న కాజావారి కోనేరుగట్టు వద్ద అవాల భవాని రావడం గమనించి ఆమెను పిలిచి కొంత సమయం గొడవ పడ్డాడు. అయితే ఆమె అతడితో మాట్లాడేందుకు నిరాకరించింది. దీంతో తనతో తెచ్చుకున్న చాకుతో భవాని గొంతును రెండు సార్లు బలంగా కోసినట్లు పోలీసులు తెలిపారు.తర్వాత అక్కడ నుంచి పారిపోయిన వీర్రాజు విజయవాడలోని ఇంటికి చేరుకుని ఎవరూ గుర్తు పట్టకుండా గుండు గీసుకుని తిరుపతి వెళ్లిపోయాడు. తిరిగి వస్తుండగా పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారం మేరకు రణస్థలం మండలంలోని కమ్మసిగడాం వద్ద అదుపులోకి తీసుకున్నారు. కేసును త్వరగా ఛేదించి జేఆర్ పురం సీఐ అవతారం, ఎస్ఐ ఎస్.చిరంజీవి, సిబ్బంది పి.హేమంత్ కుమార్, కేకే సింగ్, సీహెచ్ సురేష్ ను జిల్లా ఉన్నతాధికారులు ప్రశంసించారు.అన్నింటింలోనూ టాపరే..ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు కొండక వీర్రాజు స్వగ్రామం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలో గల నడిపల్లి గ్రామం. కుటుంబ సభ్యులతో చిన్నతనం నుంచి విజయవాడ వలస వెళ్లి అక్కడే ఉండేవాడు. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నాడు. పదిలో పదికి పది, ఇంటర్లో 965 మార్కులు, డిగ్రీ రెండేళ్లలోనూ 90శాతం మార్కులు సాధించాడు. డిగ్రీ చివరి ఏడాదిలో బెట్టింగులకు అలవాటు పడి డబ్బులు అప్పు చేసి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. దీంతో అన్నదమ్ములు నాలుగు నెలలు క్రితం స్వగ్రా మం నడిపిల్లి పంపించేశారు. తదుపరి నడిపిల్లి వచ్చిన అతను పైడిభీమవరంలోని ఒక హోటల్లో సర్వర్‌గా పనిలో జాయినయ్యాడు. అంత తెలివైన విద్యార్థి బెట్టింగ్ మానుకోలేక ఆఖరుకు హంతకుడిగా మిగిలాడు.వివాహిత దారుణహత్య -
పక్కా కక్షే... అక్రమ కేసే
సాక్షి, అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై టీడీపీ కూటమి సర్కారు పక్కా పన్నాగంతో అక్రమ కేసు నమోదు చేసింది. సీఐడీ దాఖలు చేసిన రిమాండ్ నివేదికే ఆ కుట్రలను బహిర్గతం చేసింది. వలపు వల విసిరి బడాబాబులను బురిడీ కొట్టించే నేర చరిత్ర ఉన్న ముంబై నటి కాదంబరి జత్వానీతో అబద్ధపు ఫిర్యాదు ఇప్పించేందుకు ఎంతటి పన్నాగంతో వ్యవహరించారో బయటపడింది. ఆమెపై గతంలో నమోదైన క్రిమినల్ కేసులు దర్యాప్తు ఉండగానే వాటిని వక్రీకరిస్తూ... భారత సాక్ష్యాధారాల చట్టానికి విరుద్ధంగా కక్ష పూరితంగా అక్రమ కేసు నమోదు చేసినట్లు స్పష్టమైంది. తాను ఎలాంటి తప్పూ చేయలేదని... జత్వానీపై గతంలో విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసుతో నాడు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న తనకు ఎలాంటి సంబంధం లేదని పీఎస్ఆర్ ఆంజనేయులు తన వాదనలను న్యాయస్థానంలో స్వయంగా వినిపించారు. ఈ కేసులో ఆయనకు న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. మరోవైపు ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో చేసిన ఫిర్యాదుతో నమోదు చేసిన అక్రమ కేసులోనూ పీఎస్ఆర్ పేరును చేరుస్తూ సీఐడీ మెమో దాఖలు చేయడంతోపాటు మరిన్ని అక్రమ కేసులకు ప్రభుత్వం సిద్ధమైంది.జత్వానీ అబద్ధపు ఫిర్యాదు.. అక్రమ కేసుటీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీఎస్ఆర్ ఆంజనేయులుపై అక్రమ కేసు నమోదు చేసేందుకు ఉపక్రమించింది. అందుకోసం కాదంబరీ జత్వానీని సాధనంగా చేసుకుంది. విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌కు చెందిన భూములను ఫోర్జరీ పత్రాలతో విక్రయించేందుకు యత్నించిన కేసులో ఆమె నిందితురాలు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాదంబరి జత్వానీ ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ అతిథిగా మారిపోయారు. అక్రమ కేసు నమోదుకు రంగం సిద్ధం చేస్తూ ముందుగా 2024 ఆగస్టులో టీడీపీ అనుకూల చానల్‌తో ఆమెను మాట్లాడించారు. వెంటనే విజయవాడ పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆమెను 2024 సెప్టెంబరు 5న విజయవాడకు రప్పించడంతో ఏసీపీతోపాటు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబును కలిశారు. వారం రోజులు ఆమె విజయవాడలోనే ప్రభుత్వ అతిథి హోదాలో ఉన్నారు. ఈ కేసులో విచారణ అధికారిగా నియమించాలని అప్పటికే నిర్ణయించిన ఉమామహేశ్వరరావు ఆమెకు కుట్ర కేసు నమోదు కథను వివరించారు. అనంతరం 2024 సెప్టెంబరు 13 అర్ధరాత్రి కాదంబరీ జత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిరా>్యదు చేయడం... వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చకచకా జరిగిపోయాయి.జత్వానీ ఫోర్జరీ పత్రాలపై కేసు విచారణలో ఉండగానే పోలీసులపై ఫిర్యాదా..!పీఎస్ఆర్ ఆంజనేయులుపై అక్రమ కేసు నమోదు చేసేందుకే కాదంబరీ జత్వానీతో అబద్ధపు ఆరోపణలతో ఫిర్యాదు చేయించినట్లు సీఐడీ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. కుక్కల విద్యా సాగర్‌కు చెందిన భూములను విక్రయించేందుకు వాటిని 2018లో కొనుగోలు చేసినట్టు ఆమె 2023లో ఫోర్జరీ పత్రాలు సృష్టించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆ కేసు ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉంది. కానీ తనపై అక్రమ కేసు పెట్టారని జత్వానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఫిర్యాదు చేయడం గమనార్హం. అవి ఫోర్జరీ పత్రాలో.. కావో అన్నది పోలీసుల దర్యాప్తులో నిగ్గు తేలుతుంది. అంతిమంగా న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వాలి. అంతేగానీ ఇంకా దర్యాప్తులో ఉన్న కేసులోని అభియోగాలు తప్పని చెబుతూ నిందితులు పోలీసులపైనే ఫిర్యాదు చేస్తే వెంటనే కేసు నమోదు చేయడం నిబంధనలకు విరుద్ధం. అదే విధానంగా మారితే దేశంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్న అన్ని క్రిమినల్ కేసుల్లోనూ నిందితులు తిరిగి పోలీసులపై ఫిర్యాదు చేసి అక్రమ కేసులు పెట్టేందుకు అనుమతించినట్టే అవుతుంది. తప్పు చేయలేదు... జత్వానీ ఎవరో తెలియదుతనపై నమోదు చేసిన అక్రమ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు న్యాయస్థానంలో స్వయంగా వాదనలు వినిపించారు. కాదంబరి జత్వానీపై గతంలో విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని విస్పష్టంగా ప్రకటించారు. సివిల్ పోలీసులు పర్యవేక్షించే క్రిమినల్ కేసులు, ఇతర దర్యాప్తులతో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న తనకు ఎలాంటి సంబంధం ఉండదని పోలీసు సర్వీసు నియమావళిని ఉటంకిస్తూ వివరించారు. జత్వానీ తనపై చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలన్నారు. అందుకే తాను కనీసం ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. తనపై అబద్ధపు అభియోగాలతోనే పోలీసులు, సీఐడీ అధికారులు అక్రమ కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసులో మరో నిందితుడు ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇవ్వలేదనే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసుల ఒత్తిడితో ఆయన నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకోకూడదని కోరారు. తాను సదా అందుబాటులో ఉన్నానని... దర్యాప్తునకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధమని చెప్పినా సరే సీఐడీ అధికారులు తనను అక్రమంగా అరెస్టు చేశారన్నారు.అబద్ధపు వాంగ్మూలం కోసం పీఎస్ఆర్పై ఒత్తిడిఈ కేసులో అబద్ధపు వాంగ్మూలాల కోసం సీఐడీ అధికారులు సీనియర్ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులపై ఒత్తిడి తేవడం గమనార్హం. ఆయన్ను హైదరాబాద్‌లో అరెస్టు చేసే సమయంలో తన వద్ద ఉన్న ఒకే ఒక్క ఫోన్‌ను సీఐడీ అధికారులకు అప్పగించారు. అదే విషయాన్ని అధికారులకు చెప్పడంతో వారు సమ్మతించారు. కానీ పీఎస్ఆర్ను విజయవాడకు తీసుకువచ్చిన తరువాత సీఐడీ అధికారులు మధ్యవర్తుల నివేదిక పేరుతో ఓ పత్రాన్ని తెచ్చి సంతకం చేయాలని పేర్కొన్నారు. అందులో ఆయన వద్ద ల్యాప్‌టాప్, ఐప్యాడ్, మరో సెల్ ఫోన్ ఉన్నాయని అంగీకరించినట్లుగా పొందుపరిచారు. దీనిపై పీఎస్ఆర్ ఆంజనేయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తన వద్ద లేని ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నట్టుగా రాసేందుకు నిరాకరించారు. హైదరాబాద్‌లో తన ఇంటి వద్దే అన్ని విషయాలు చెప్పానని, ఇప్పుడు ఇలా అబద్ధపు వాంగ్మూలం రాయమని చెప్పడం ఏమిటని నిలదీశారు. తమపై ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి ఉందని సీఐడీ అధికారులు నిస్సహాయత వ్యక్తం చేయడం గమనార్హం. ఇదే విషయాన్ని పీఎస్ఆర్ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.సాక్ష్యాధారాల చట్టం వక్రీకరణ...పోలీసులే తన చేతిలో ఫోర్జరీ పత్రాలు పెట్టి వెంటనే స్వాధీనం చేసుకున్నారని కాదంబరి జత్వానీ తన ఫిర్యాదులో పేర్కొనడం మరో అబద్ధపు అభియోగం. విచారణ జరుగుతున్న కేసులో భారత సాక్ష్యాధారాల చట్టాన్ని వక్రీకరించేందకు తెగించడం గమనార్హం. డ్రగ్స్, గంజాయి, ఇతర స్మగ్లింగ్ నిరోధక కేసుల్లో దేశవ్యాప్తంగా పోలీసులు, కస్టమ్స్ అధికారులు అనుసరించే విధానాన్నే నాడు విజయవాడ పోలీసులు పాటించారు. ఆమె నివాసంలో సోదాలు నిర్వహించగా ఫోర్జరీ పత్రాలు లభించాయి. పోలీసులే తన చేతిలో ఫోర్జరీ పత్రాలు పెట్టారని ఆమె ప్రస్తుతం తప్పుడు అభియోగాలు మోపడం వెనుక కూటమి ప్రభుత్వ పెద్దల పన్నాగం ఉంది.టిఫిన్ కూడా పెట్టకుండా.. సీఐడీ అధికారులు సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు పట్ల మానవత్వం లేకుండా, అగౌరవంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఆయన్ని బుధవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన అనంతరం న్యాయస్థానానికి తరలించారు. ఆయనకు కనీసం టిఫిన్ కూడా పెట్టలేదు. అనంతరం మధ్యాహ్నం రిమాండ్ కోసం విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. పీఎస్ఆర్పై మరిన్ని అక్రమ కేసులు నమోదు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.⇒ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గతంలో ఇచ్చిన అబద్ధపు ఫిర్యాదులో పీఎస్ఆర్ ఆంజనేయులును ఇరికించేందుకు కుట్ర పన్నుతున్నారు. తనను సీఐడీ అధికారులు హింసించారని రఘురామ గతంలో ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు దీన్ని తోసిపుచ్చినప్పటికీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అప్పటి సీఐడీ డీజీ పీవీ సునీల్‌కుమార్‌తోపాటు ఇతర అధికారులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులును కూడా చేరుస్తూ న్యాయస్థానంలో సీడీఐ బుధవారం మెమో దాఖలు చేయడం గమనార్హం. అసలు ఆయనకు సీఐడీతో ఎలాంటి సంబంధం లేదు. ఆ సమయంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కూడా లేరు. ఏసీబీ డీజీగా ఉన్నారు. అయినా సరే పీఎస్ఆర్ను ఆ కేసులో నిందితుడుగా చేర్చడం విస్మయం కలిగిస్తోంది.⇒ పీఎస్ఆర్ ఆంజనేయులు గతంలో ఏపీపీఎస్పీ కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ సమయంలో కొన్ని ఫైళ్లు కనపడకుండా పోయాయంటూ దాదాపు నాలుగేళ్ల తరువాత ఏపీపీఎస్పీ కార్యదర్శితో తాజాగా ఫిర్యాదు ఇప్పించడం కూటమి సర్కారు కుట్రలకు నిదర్శనం.⇒ గతంలో పీఎస్ఆర్ ఆంజనేయులు తనను బెదిరించారంటూ ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణతో టీడీపీ ప్రభుత్వం ఇటీవల అబద్ధాలతో ఫిర్యాదు ఇప్పించింది. ఆ ఫిర్యాదును సీఐడీకి తాజాగా పంపించడం ప్రభుత్వ కుటిల పన్నాగానికి నిదర్శనం. -
అది పరువు హత్యే...!
చిత్తూరు అర్బన్: సంచలనం సృష్టించిన యాస్మిన్ భాను (26) అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ వీడింది. ఆమెది ఆత్మహత్య కాదని, పరువు హత్యేనని నిర్ధారణ అయ్యింది. కన్న కూతురు ఇతర మతస్తుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక కూతురిని హత్య చేసిన తండ్రి షౌకత్ అలీ (56), వరుసకు సోదరుడు అయిన మహ్మద్ బాషా అలియాస్ లాలా (29)ను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు అబ్దుల్ కలామ్ పరారీలో ఉన్నాడు. ఈ ఘటన వివరాలను చిత్తూరు టూటౌన్ సీఐ నెట్టికంటయ్య బుధవారం మీడియాకు వివరించారు. పోలీసులను ఆశ్రయించినా లేని ఫలితం! చిత్తూరులోని బాలాజీ కాలనీకి చెందిన షౌకత్ అలీ చిత్తూరు రూరల్ మండలంలోని తుమ్మింద గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. మూడో కూతురు యాస్మిన్ భాను బీటెక్ చదివే సమయంలో సాయితేజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. భాను తన ప్రేమ విషయం పెద్దలకు చెబితే వారు అంగీకరించలేదు. పైగా తమ సమీప బంధువుతో ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన పెళ్లి చేయాలని నిశ్చయించి, అందరికీ శుభ లేఖలు కూడా పంచేశారు. అయితే ఫిబ్రవరి 6వ తేదీన యాస్మిన్ భాను, సాయితేజ ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. పెద్దల నుంచి ముప్పు ఉందంటూ చంద్రగిరి డీఎస్పీని కూడా ఆశ్రయించారు. దీనితో షౌకత్ అలీని చంద్రగిరికి పిలిపించి, వీళ్ల జోలికి వెళ్లొద్దంటూ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. అటు తర్వాత సాయితేజ భార్యతో తన సొంత ఊరైన పూతలపట్టు మండలంలోని పోటుకనుమ గ్రామంలో కాపురం పెట్టాడు. కొద్ది రోజుల్లోనే తల్లి ముంతాజ్, ఇద్దరు అక్కలు యాస్మిన్ భానుతో ఫోన్లో మాట్లాడుకుంటూ దగ్గరయ్యారు.నమ్మించి గొంతు నులిమి..ఆగిపోయిన వ్యక్తితోనే పెళ్లి చేసి, కూతురిని దుబాయ్ పంపాలనుకున్న షౌకత్ అలీ.. ప్లాన్ బీ కూడా సిద్ధం చేసుకున్నాడు. అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూసి వెళ్లాలని తల్లి కోరడంతో, ఏప్రిల్ 13వ తేదీన భర్తతో కలిసి యాస్మిన్‌భాను చిత్తూరుకు కారులో వచి్చంది. అప్పటికే మరో కారులో వేచివున్న లాలా, వారి మరో సమీప బంధువు అబ్దుల్ కలాం.. భానును వారి కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి బయలు దేరారు. మధ్యలో తండ్రి షౌకత్ అలీ కూడా కారులో ఎక్కాడు. మాపాక్షి గ్రామ సమీపంలోకి వెళ్లిన తర్వాత, సాయితేజను వదిలేసి తాను చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని యాస్మిన్‌ను తండ్రి షౌకత్ కోరాడు. ఆమె ఎంతకూ ఒప్పుకోలేదు. దీనితో కూతురి కాళ్లను తొక్కిపెట్టి, అప్పటికే తెచ్చుకున్న తాడుతో ఆమె గొంతుకు బిగించి చంపేశాడు. ఆపై బాలాజీ కాలనీలోని తన ఇంటివద్దకు వెళ్లి మృతదేహాన్ని ఇంట్లో పడేసి వెళ్లిపోయాడు. తన కుమార్తె కొన ప్రాణాలతో ఉందేమోనని భావించిన తల్లి ముంతాజ్, స్థానికుల సాయంతో యాస్మిన్‌ను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తన భర్త తిట్టడంతోనే భాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ముంతాజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అనుమానాస్పద మృతిగా ఈ కేసును తొలుత పోలీసులు నమోదు చేశారు. తన భార్యను కుటుంబ సభ్యులే హత్య చేసినట్లు సాయితేజ పోలీసులకు చెప్పడం, యాస్మిన్ గొంతుకు రెండుసార్లు తాడు బిగించిన ఆనవాళ్లు ఉండటంతో కేసు దర్యాప్తు మరో దిశలో సాగింది.పరారీలో ఉన్న షౌకత్ అలీతో పాటు లాలాను పోలీసులు అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన కారు, తాడును స్వా«దీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. అవసరమైతే మరికొందరు అరెస్టు అయ్యే అవకాశం ఉంది. -
తిరుపతిలో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా..
తిరుపతి,సాక్షి: తిరుపతిలో దారుణం జరిగింది. ఇద్దరు యువకులు దళిత బాలికకు మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పోలీసులు నిందితుల్ని గుర్తించారు. ఎఫ్. ఐ.ఆర్.51/2025 పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
పరాకాష్టకు రెడ్‌బుక్ కుట్ర .. పీఎస్ఆర్ ఆంజనేయులు అక్రమ అరెస్ట్
సాక్షి, అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి, రాష్ట్ర నిఘా విభాగం పూర్వ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు అక్రమ అరెస్టుకు కూటమి ప్రభుత్వం తెగబడింది. టీడీపీ అధికారంలోకి రాగానే అక్రమ కేసులో ఆయన్ను సస్పెండ్ చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు బరితెగించింది. వలపు వల వేసి బడా బాబులను బురిడీ కొట్టించే నేర చరిత్ర ఉన్న ముంబయికి చెందిన మోడల్ కాదంబరి జత్వానీ ద్వారా తప్పుడు ఫిర్యాదు ఇప్పించి మరీ కుతంత్రాన్ని రచించింది. మేనిఫెస్టో అమలు చేయలేని దుస్థితిలో ప్రజల దృష్టి మళ్లించే డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా పీఎస్ఆర్ ఆంజనేయులును అక్రమంగా అరెస్టు చేసింది.మంగళవారం తెల్లవారుజామునే సీఐడీ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను హైదరాబాద్ నుంచి విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించి, మంగళవారం మధ్యాహ్నం 1 గంట నుంచి అర్ధరాత్రి వరకు విచారించారు. బుధవారం ఉదయం ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం న్యాయస్థానంలో హాజరు పరిచే అవకాశం ఉంది. జత్వానీని అడ్డుపెట్టుకుని కుట్ర కాదంబరి జత్వానీ విషయంలో చట్టబద్ధంగా సాగిన వ్యవహారాన్ని వక్రీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. ఆమెతో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, టి. కాంతిరాణా, విశాల్ గున్నీలపై కేసు నమోదు చేసి వారిని సస్పెండ్ చేసింది. వారిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. పారిశ్రామికవేత్త కుక్కల విద్యా సాగర్‌ను అరెస్టు చేసింది. అనంతరం ఈ కేసును సీఐడీకి అప్పగించింది.అయితే ఈ కేసులో టి.కాంతిరాణా, విశాల్ గున్నీలకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. వారిపై కేసు నమోదు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబట్టింది. కాగా, ఎలాంటి తప్పు చేయనందునే ముందస్తు బెయిల్‌కు వెళ్లాలన్న పలువురి సూచనను పీఎస్ఆర్ సున్నితంగా తిరస్కరించారు. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా ఆయన్ను అరెస్టు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు ఈ అక్రమ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులను సీఐడీ అధికారులు ఇప్పటి వరకు విచారించనే లేదు. నోటీసులు కూడా ఇవ్వలేదు. విచారణకు పిలవనూ లేదు. తాను ఎక్కడ ఉన్నదీ ఆయన ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తూనే ఉన్నారు. ఏనాడూ తన మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకోలేదు. అయినాసరే సీఐడీ అందుకు విరుద్ధంగా వ్యవహరించి, ఆయన్ను అరెస్ట్ చేయడం గమనార్హం. కాగా, పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు సందర్భంగా కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తీరు అత్యంత వివాదాస్పదంగా మారింది.ఈ కేసుతో కానీ, సీఐడీతో కానీ సంబంధంలేని కోయ ప్రవీణ్.. మరికొందరు పోలీసులతో కలిసి పీఎఎస్ఆర్ ఆంజనేయులు నివాసం సమీపంలో హడావుడి చేశారు. పీఎస్ఆర్ ఇంట్లో ఉన్నారా.. లేదా.. ఎక్కడికైనా వెళ్తున్నారా.. అంటూ ఆరా తీస్తూ అత్యుత్సాహం ప్రదర్శించారు. తనను అరెస్టు చేసేందుకు మంగళవారం తన నివాసానికి వచ్చిన సీఐడీ అధికారులకు పీఎస్ఆర్ ఆంజనేయులు పూర్తిగా సహకరించారు. పోలీసు వాహనంలో విజయవాడకు బయలుదేరారు. కానీ కోయ ప్రవీణ్ మాత్రం పీఎస్ఆర్ నివాసంలోకి వెళ్లి ల్యాప్‌టాప్ కావాలి.. ఏవేవో పత్రాలు కావాలి.. డివైజుసులు కావాలంటూ హడావుడి చేశారు. ఇరికించే కుట్రతోనే విచారణ పీఎస్ఆర్ ఆంజనేయులు విచారణ పేరిట సీఐడీ అధికారులు పచ్చ కుట్రను అమలు చేసేందుకే పెద్దపీట వేశారు. విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన్ని దాదాపు 6 గంటలపాటు విచారించారు. హనీట్రాప్ నిందితురాలు కాదంబరి జత్వానీని అరెస్టు చేయాలని అప్పటి విజయవాడ సీపీ కాంతికాణా, డీసీపీ విశాల్ గున్నీని ఆదేశించారా.. అందుకోసం వారిని పిలిపించి మాట్లాడారా.. అని ప్రశి్నంచారు. తనకు ఆ ఉదంతంలో ఎలాంటి సంబంధం లేదని.. ఇంటలిజెన్స్ అధికారులు కేసుల దర్యాప్తు వ్యవహరాలను పర్యవేక్షించారని పీఎస్ఆర్ జవాబు ఇచ్చినట్టు తెలిసింది.తనకు తెలిసినంత వరకు న్యాయస్థానం అనుమతితోనే అప్పటి విజయవాడ పోలీసులు వ్యవహరించారని, కాదంబరి జత్వానీని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారని.. న్యాయస్థానం ఆదేశాలతో ఆమెను రిమాండ్‌కు తరలించారని చెప్పినట్టు తెలుస్తోంది. తనపై కదాంబరి జత్వానీ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఆ వ్యవహారంలో తాను ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. అందుకే తాను ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని తేల్చి చెప్పారు. మరిన్ని అక్రమ కేసులకు కుట్ర కాగా పీఎస్ఆర్ ఆంజనేయులపై మరిన్ని అక్రమ కేసులు నమోదు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పన్నాగం పన్నుతున్నట్టు సమాచారం. కదాంబరి జత్వానీ తప్పుడు ఫిర్యాదుతో నమోదు చేసిన కేసు న్యాయస్థానంలో నిలవదని ప్రభుత్వానికి తెలుసు. అందుకే అవాస్తవ ఆరోపణలతో మరికొన్ని కేసులు నమోదు చేయాలని భావిస్తోంది. అందుకోసం ఏపీపీఎస్సీ కార్యదర్శితో ముందస్తు కుట్రతోనే తప్పుడు ఫిర్యాదు ఇప్పించడం గమనార్హం. కాగా రఘురామకృష్ణంరాజు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు, ఇతరత్రా అక్రమ కేసులతో ఆయన్ను వేధించేందుకు ప్రభుత్వం తన కుట్రకు పదును పెడుతున్నట్టు సమాచారం. -
మద్యం మసి పూసి.. సిట్ పోలీసుల ‘కసి’
సాక్షి, అమరావతి: అక్రమ కేసులు నమోదు చేయడం..లేని ఆధారాలు సృష్టించేందుకు బెదిరింపులు, వేధింపులకు పాల్పడడమే చంద్రబాబు ప్రభుత్వ ఏకైక విధానంగా మారింది. రెడ్ బుక్ కుట్రలను అమలు చేయడమే పనిగా పెట్టుకున్న సిట్ అధికారులు ప్రభుత్వ పెద్దల కోసం చట్టాన్ని ఉల్లంఘిస్తూ బరితెగిస్తున్నారు. ఇందులోభాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్ పన్నాగం పరాకాష్టకు చేరింది. ఈ అక్రమ కేసులో సాక్షిగా విచారణకు పిలిచిన రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు సోమవారం హైదరాబాద్‌లో అరెస్టు చేయడమే దీనికి తాజా నిదర్శనం. విజయవాడలో సిట్ అధికారుల ఎదుట మంగళవారం విచారణకు హాజరవుతానని చెప్పిన ఆయనను హడావుడిగా అరెస్టు చేయడం వెనుక పక్కా కుట్ర ఉందన్నది స్పష్టమవుతోంది. గోవా నుంచి సోమవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న రాజ్ కసిరెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలోనే సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం విచారణకు హాజరవుతానని చెప్పినా వినిపించుకోకుండా తమ వాహనంలోకి ఎక్కించి విజయవాడకు తరలించారు. ఓ వైపు న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశం అయినప్పటికీ సిట్ అధికారుల రాజ్ కసిరెడ్డిని హడావుడిగా అరెస్టు చేయడం వెనుక అసలు పన్నాగం ఇలా ఉంది. విచారణకు వస్తానంటే అరెస్టు ఏమిటో...? రెడ్‌బుక్ కక్ష సాధింపే తప్ప మరొకటి తమ ఉద్దేశం కాదని చంద్రబాబు ప్రభుత్వం మరోసారి తేల్చిచెప్పింది. ఈ కేసులో రాజ్ కసిరెడ్డిని సోమవారం హడావుడిగా అరెస్టు చేసిన తీరే అందుకు నిదర్శనం. మంగళవారం సిట్ విచారణకు హాజరవుతానని ఆయన సోమవారం మధ్యాహ్నం ఆడియో సందేశం విడుదల చేశారు. అయినా సోమవారం సాయంత్రం హడావుడిగా హైదరాబాద్‌లో అరెస్టు చేయల్సిన అవసరం ఏమిటి? అంటే ఆయనను విచారించడం.. వాస్తవాలు తెలుసుకోవడం తమ లక్ష్యం కాదని సిట్ తన చేతల ద్వారా వెల్లడించింది. అరెస్టు చేసి వేధించి.. ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రకు అనుకూలంగా ఆయన పేరిట అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించడమే తమ అసలు కుట్ర అని తేల్చిచెప్పింది. రాజ్ కసిరెడ్డి విషయంలో సిట్ మొదటి నుంచీ అదే కుతంత్రంతో వ్యవహరిస్తోంది. ఈ కేసులో సాక్షిగా విచారణకు రావాలని ఆయనకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో కుటంబ సభ్యులకు నోటీసులు అందించారు. తనను ఏ విషయంలో విచారించాలని భావిస్తున్నారో తెలియజేస్తే తగిన సమాచారంతో వస్తానని ఆయన సిట్ అధికారులకు ఈ–మెయిల్ ద్వారా తెలిపారు. కానీ, ఆయన అడిగిన సమాచారం ఇవ్వకుండా వెంటనే మరోసారి ఈ–మెయిల్ ద్వారా నోటీసులు పంపడం గమనార్హం. దాంతో రాజ్ కసిరెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు నిర్ణయం అనంతరం విచారణకు స్వయంగా వస్తానని.. దర్యాప్తునకు సహకరిస్తానని కూడా రెండు రోజుల క్రితం ఓ ఆడియో సందేశం పంపించారు. ఇంతలో న్యాయ ప్రక్రియకు కాస్త సమయం పడుతుండటంతో ఇక తానే మంగళవారం విచారణకు వచ్చి పూర్తిగా సహకరిస్తానని సోమవారం తెలిపారు. అంటే మంగళవారం ఆయన విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వస్తారని తెలుసు. మరి రాజ్ కసిరెడ్డిని హైదరాబాద్‌లో సోమవారమే అరెస్టు చేయల్సిన అవసరం ఏమొచ్చింది? న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశం ఈ అంశం ప్రసుతం న్యాయస్థానం పరిధిలో ఉంది కూడా. తనకు జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ రాజ్ కసిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ రెండు ప్రస్తుతం ఆయా న్యాయస్థానాల పరిధిలో ఉన్నాయి. మరోవైపు విచారణకు హాజరవుతాను.. దర్యాప్తునకు సహకరిస్తానని కూడా రాజ్ కసిరెడ్డి చెప్పారు. అయినా సరే అరెస్టు చేయడం గమనార్హం. దీని వెనుక పోలీసుల పక్కా కుట్ర ఉందన్నది సుస్పష్టం బెదిరించి లొంగదీసుకునేందకునా..! ఇప్పటికే కుటంబు సభ్యులను తీవ్రంగా వేధించిన సిట్ రెడ్‌బుక్ కుట్రకు అనుకూలంగా రాజ్ కసిరెడ్డితో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించడమే సిట్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఆయనను హడావుడిగా అరెస్టు చేసింది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో సోమవారం అర్ధరాత్రి విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి తీసుకువచ్చారు. సిట్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు ఆ సమయంలో కార్యాలయంలోనే ఉన్నారు. మంగళవారం తెల్లవారుజాము వరకు ఆయనను బెదిరించి పూర్తిగా తమకు అనుకూలంగా లొంగదీసుకోవడమే సిట్ ప్రస్తుత లక్ష్యం. ఇప్పటికే ఈ కేసులో రాజ్ కసిరెడ్డి కుటుంబ సభ్యులను సిట్ అధికారులు కొన్ని రోజులుగా తీవ్రంగా వేధించి బెంబేలెత్తించారు. హైదరాబాద్‌లోని రాజ్ కసిరెడ్డి నివాసానికి వెళ్లి తల్లిదండ్రులతో పాటు సమీప బంధువులను కూడా బెదిరించి వేధించారు. ఆయన సన్నిహితుడు, ఎరేట్ హాస్పిటల్స్ అధినేత విజేయంద్రరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను కూడా బెదిరించారు. ఈ విధంగా రాజ్ కసిరెడ్డి కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, స్నేహితులు అందరినీ లక్ష్యంగా చేసుకుని పోలీసులు తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి పైనే పూర్తి స్థాయిలో పోలీసు మార్క్ ప్రతాపం చూపించనున్నారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని ఆయనను బెదిరిస్తున్నట్టు సమచారం. మొదటినుంచీ సిట్ తీరు అంతే.. అక్రమ కేసులో లేని ఆధారాలు సృష్టించేందుకు సిట్ మొదటి నుంచి కూడా దండనీతినే నమ్ముకుంది. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను తీవ్రస్థాయిలో వేధించి సాధించింది. సిట్ అధికారుల బెదిరింపులపై ఆయన మూడు సార్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయినా సరే సిట్ తీరు మాత్రం మారలేదు. వాసుదేవరెడ్డిని మూడు రోజుల పాటు గుర్తు తెలియని ప్రదేశంలో అక్రమంగా నిర్బంధించి మరీ వేధించింది. తద్వారా తాము చెప్పినట్టుగా ఆయన అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేలా ఒప్పించింది. వాసుదేవరెడ్డి అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వెంటనే ప్రభుత్వం ఆయనను రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతించడం గమనార్హం. అదే రీతిలో బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ స్పెషల్ ఆఫీసర్ సత్యప్రసాద్, చిరుద్యోగి అనూషను కూడా సిట్ అధికారులు వేధించి బెదిరించి వారితో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించారు. ఇక విజయ సాయిరెడ్డి ఎంపీగా మరో మూడున్నరేళ్లు పదవీ కాలం ఉన్నా సరే కేవలం టీడీపీకి కూటమికి రాజ్యసభలో ప్రయోజనం కలిగించేందుకే రాజీనామా చేశారు. ఉప ఎన్నిక నిర్వహిస్తే ఆ సీటు గెలుచుకునేందుకు వైఎస్సార్సీపీకి తగినంత మంది ఎమ్మెల్యేల బలం లేదని తెలిసినా విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం కేవలం చంద్రబాబు కుట్రలో భాగమే. అసలు ఎలాంటి కుంభకోణం జరగనే లేదని విజయసాయిరెడ్డే సిట్ విచారణ అనంతరం చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయినా సరే అబద్ధపు వాంగ్మూలాల నమోదు, తప్పుడు సాక్ష్యాల సృష్టికి సిట్ అధికారులు బరితెగించి బెదిరింపులకు పాల్పడుతూ అధికారికంగా గూండాగిరీకి తెగిస్తున్నారు. కుట్రతోనే వక్రీకరణ ప్రైవేట్ కంపెనీల వ్యవహారంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఏం సంబంధం? ఎలాంటి అవినీతి లేని ఈ వ్యవహారంలో నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్ కొత్త కొత్త కట్టుకథలను తెరపైకి తెస్తోంది. అదాన్ డిస్టిలరీల ఏర్పాటుకు రూ.100 కోట్ల అప్పు ఇప్పించడం అంటూ వినిపించిన కథ తాజా వక్రీకరణ. తన అల్లుడు కుటుంబానికి చెందిన అరబిందో కంపెనీ అదాన్ డిస్టిలరీ ఏర్పాటునకు రూ.100 కోట్లు అప్పు ఇచ్చిందని విజయసాయిరెడ్డి చెప్పారు. అంటే అరబిందో కంపెనీ అప్పు ఇచ్చింది. అదాన్ డిస్టిలరీస్ తీసుకుంది. అది రెండు కంపెనీల మధ్య వ్యవహారం. దేశంలో ఎన్నో ప్రైవేటు కంపెనీల మధ్య అప్పులు ఇచ్చి పుచ్చుకోవడం సర్వసాధారణం. దానిపై ఆ రెండు కంపెనీల్లో ఎవరూ కూడా ఫిర్యాదు చేయనే లేదు. మరి ఆ వ్యవహారానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఏం సంబంధం ? ఆ వ్యవహారాన్ని వక్రీకరిస్తూ ఈ కేసుకు ముడిపెట్టాలని యత్నించడం హాస్యాస్పదంగా ఉంది. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రమే.. దర్యాప్తు పేరిట సిట్ ఎందుకు ఇంతగా నిబంధనలకు విరుద్ధంగా బరితెగిస్తోంది...!? అంటే వినిపించే ఏకైక సమాధానం.. అసలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అక్రమాలు జరగలేదు. ఎలాంటి అవినీతి లేదు కాబట్టే లేని ఆధారాలు సృష్టించేందుకు సిట్ ఇంతగా దిగజారుతోంది. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశపెట్టింది. దుకాణాల వేళలను కుదించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను దశలవారీగా 2,934 దుకాణాలకు తగ్గించింది. చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్లుగా లైసైన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన 43వేల బెల్ట్ దుకాణాలను తొలగించింది. రాష్ట్రంలోని 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు జారీ చేసింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు లైసెన్సులు మంజూరు చేశాయి. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్సులు మంజూరు చేయలేదు. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మరి మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలకు లాభాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ఇస్తాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. మరి కమీషన్లు ఎందుకు ఇస్తాయి..? ఇవ్వవనే ఇవ్వవు. ఎలాంటి అవినీతి లేని వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో సిట్ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోతోంది. అందుకే అప్పటి అధికారులు, ఇతర సాక్షులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయడమే పనిగా పెట్టుకుంది. వాటి ఆధారంగానే కేసును కొనసాగించడమే సిట్ ఏకైక విధానంగా మారింది. అసలు లేని కుంభకోణంపై అక్రమ కేసు నమోదు చేసి రాజ్ కసిరెడ్డి లక్ష్యంగా పావులు కదుపుతుండడం గమనార్హం. ఆయన కేవలం కొంత కాలం అదీ కోవిడ్ వ్యాప్తి ఉన్న రోజుల్లో పరిశ్రమల శాఖ సలహాదారుగా మాత్రమే వ్యవహరించారు. ఆయన పదవీ కాలాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెన్యువల్ కూడా చేయనే లేదు. రాజ్ కసిరెడ్డికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానానికి ఎలాంటి సంబంధమే లేదు. -
నిశ్చితార్థం వేళ.. చితి మంటల ఘోష!
తూర్పు గోదావరి(పిఠాపురం): తెల్లారితే కాబోయే ధర్మపత్నికి దండ వేసి, ఉంగరాలు మార్చుకోవాల్సిన ఆ యువకుడి బతుకు అంతలోనే తెల్లారిపోయింది. నిత్యం వేదం పలికే ఆ గొంతు మూగబోయింది. తాంబూలాలు అందుకోవాల్సిన తండ్రి తల కొరివి పెట్టాల్సి వచ్చింది. కొద్ది గంటల్లో ఓ యువతితో నిశ్చితార్థం చేసుకోవాల్సిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన కాకినాడ జిల్లా పిఠాపురంలో చోటు చేసుకుంది. బంధువుల కథనం ప్రకారం.. వింజమూరి వెంకటేష్ (30) పిఠాపురంలో పురోహితుడిగా జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం అతని వివాహ నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో శనివారం ఉదయమే కోనసీమ జిల్లాలోని వాడపల్లి వెళ్లి, వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని వచ్చాడు. నిశ్చితార్థంలో వధువుకు, తనకు కావాల్సిన ఉంగరాలను తమ వేలి ముద్రలు ఉండేలా ప్రత్యేకంగా ముంబయిలో ఆర్డరు ఇచ్చి మరీ తయారు చేయించుకున్నాడు. కొత్త దుస్తులు, ఇతర సామగ్రి సిద్ధం చేసుకున్నాడు. స్నేహితులకు, తోటి పురోహితులకు ఆహా్వనం పలికాడు. సంప్రదాయం ప్రకారం ఇంట్లో వారు నిశి్చతార్థానికి అన్ని ఏర్పాట్లూ చేశారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ.. ఊహించని విధంగా శనివారం అర్ధరాత్రి పిఠాపురం సమీపంలో వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని స్థానికులు గమనించి, రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. సామర్లకోట రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఆత్మహత్య చేసుకునేంత సమస్యలేవీ లేవని చెబుతూ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి శర్మ, తల్లి లక్ష్మి గుండెలవిసేలా రోదించారు. నిశి్చతార్థం కోసం తెచి్చన పూలను అంతిమ యాత్రకు వినియోగించాల్సి వచ్చింది. నిశ్చయ తాంబూలాలకు వచ్చిన పెద్దలు, బంధువులు బరువెక్కిన గుండెలతో అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఏదో బలమైన ఒత్తిడి... ఎవరో బెదిరించడం వల్లే వెంకటేష్ ఇలా అఘాయిత్యానికి పాల్పడినట్లు చర్చ జరుగుతోంది. -
తన కూతురిపై కన్నేశాడనే కడతేర్చింది
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఒక కానిస్టేబుల్ కనిపించడం లేదంటూ అతని భార్య, బంధువులు ఫిర్యాదు చేశారు. మంగళగిరిలో మిస్ అయిన కానిస్టేబుల్ నంద్యాల–కడప ఘాట్రోడ్లో శుక్రవారం శవమై కనిపించాడు. సేకరించిన వివరాల మేరకు నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ మండలం, తోటకందుకూరు గ్రామానికి చెందిన ఫారుక్ (30) ఏపీఎస్పీ రెండో బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కొంతకాలంగా మంగళగిరి ఆక్టోపస్ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. మంగళగిరి పట్టణంలోనే ఉంటున్నాడు. ఏప్రిల్ 8న ట్రైనింగ్ ఉందంటూ వెళ్లిన ఫారుక్ తిరిగి రాకపోవడం, ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో 12న భార్య బషీరున్ తన బంధువులతో కలిసి ఆక్టోపస్ కార్యాలయానికి వెళ్లింది. ఏప్రిల్ 9 నుంచి 12 వరకు ఫారుక్ సెలవు పెట్టాడని అక్కడి అధికారులు చెప్పడంతో మంగళగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో తన భర్త కనిపించడం లేదంటూ ఈనెల 14న ఫిర్యాదు చేశారు. మంగళగిరి పట్టణ పోలీసులు మిస్సింగ్‌గా కేసు నమోదు చేశారు. విచారణలో వెలుగు చూసిన నిజాలు ఫారుక్ ఫోన్ స్విచ్చాఫ్‌గా ఉండడంతో ఆక్టోపస్ అధికారుల ఆదేశాల మేరకు అతని కాల్ డేటాను పోలీసులు సేకరించారు. అందులో ఉన్న కాల్స్ ఆధారంగా విచారణ చేపట్టారు. ఫారుక్ ఫోన్ లొకేషన్ నంద్యాలలో ఉన్నట్లు తేలడంతో చివరగా ఫోన్ చేసిన వారిని నంద్యాల జిల్లా పోలీసులు విచారణ చేశారు. ఈ నేపథ్యంలో నంద్యాలకు చెందిన అనీషను కూడా విచారణ చేశారు. దీంతో అసలు నిజం బయటపడింది. ఫారుక్‌కు పెళ్లికాక ముందు నుంచి అనీషతో పరిచయముంది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో అనీష కుమార్తెతో కూడా ఫారుక్ సన్నిహితంగా ఉండడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఈ విషయమై ఫారుక్‌తో తరచూ గొడవ పడేది. ఫారుక్ నంద్యాలలోని తెలిసిన వ్యక్తి ద్వారా అనీషకు డబ్బులు పంపిస్తున్నాడు. ఆ వ్యక్తి సన్నిహితంగా ఉండడంతో అనీష కుమార్తెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో ఫారుక్‌ను అడ్డు తొలగిస్తేనే పెళ్లికి అంగీకరిస్తానని అనీష చెప్పింది. పథకం ప్రకారం.. ఫారుక్‌ను హతమార్చేందుకు ఇద్దరూ పథకం పన్నారు. అతనికి ఫోన్ చేసి కొన్ని రోజులు సెలవు పెట్టుకుని రావాలని అనీష కోరింది. ఫారుక్ మంగళగిరి నుంచి నంద్యాలకు ఏప్రిల్ 8న సాయంత్రం బయలు దేరాడు. 9న అక్కడకు చేరుకున్న ఫారుక్ తనకు పరిచయమున్న వ్యక్తిని కలిశాడు. అక్కడి నుంచి బయటకు వెళ్దామంటూ ఆ వ్యక్తి మరో ఇద్దరిని తీసుకుని ఫారుక్‌తో కారులో బయలుదేరారు. మద్యం సేవించిన అనంతరం నంద్యాలలో కారులో వెళుతుండగా ఎదురు సీట్లో కూర్చున్న ఫారుక్‌ను వెనుక ఉన్న వ్యక్తి ఓ వైర్‌తో మెడకు గట్టిగా బిగించాడు. దీంతో ఊపిరి ఆడక ఫారుక్ అక్కడికక్కడే మరణించారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం వీరు మృతదేహాన్ని ఒక కవర్లో చుట్టి నంద్యాల శివారు ప్రాంతంలో ఉన్న ఓ చెరువులో పడవేశారు. కొంత సమయం తరువాత వచ్చి చూడడంతో మృతదేహాన్ని కవర్‌తో చుట్టడం వల్ల చెరువులో తేలుతూ కనబడింది. మరుసటి రోజు ఎవరూ లేని సమయంలో వచ్చి ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్లి నంద్యాల – కడప ఘాట్రోడ్లో ఫారెస్ట్ ప్రాంతంలో పైనుంచి కిందకు పడవేశారు. నంద్యాల సీసీఎస్ పోలీసులు అనీషను, మరో ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకోగా, మరో యువకుడు పరారయ్యాడు. ఆ ముగ్గురిని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. నిందితులు తెలిపిన వివరాలతో ఫారుక్ మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఫారుక్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. -
అనుమానంతో బ్లేడుతో భార్య గొంతు కోసిన భర్త
క్రోసూరు(పల్నాడు): స్థానిక బోయ కాలనీలో భార్యపై అనుమానం పెంచుకుని భర్త బ్లేడుతో గొంతుకోసిన సంఘటన శుక్రవారం జరిగింది. స్టేషన్ రైటర్ దాసు వివరాల ప్రకారం.. బోయ కాలనీకి చెందిన చార్ల శ్రీను భార్య మల్లమ్మ. ఆమె ఎవరితోనో ఫోనులో మాట్లాడుతుండటంతో అనుమానపడి శ్రీను బ్లేడుతో దాడి చేసి గొంతు కోశాడు. చుట్టపక్కల వారు ఆమెను సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు 25 కుట్లు వేశారు. ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. శ్రీను, మల్లమ్మలకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కూడా అయింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు రైటర్ దాసు తెలిపారు. -
అమ్మా..ఊపిరాడలేదు!
తిరుమల : ‘అమ్మా.. ఊపిరాడలేదు..!’ అన్నట్టు కారులో చిక్కుకుపోయిన ఆ చిన్నారుల ఆర్తనాదాలు అక్కడి వారిని కదిలించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన గురువారం తిరుమలలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా, బద్వేలుకు చెందిన వెంకటసుబ్బారెడ్డి, సుమలత దంపతులకు భాను (7), నీల (4) ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వెంకటసుబ్బారెడ్డి విదేశాల్లో ఉన్నారు.సుమలత పిల్లలు, వెంకటసుబ్బారెడ్డి అన్న గంగయ్య అతని భార్య, అల్లుడితో కలిసి గురువారం తిరుమలకు బయలుదేరారు. తిరుపతి అలిపిరికి వచ్చిన అనంతరం సుమలత, గంగయ్య సతీమణి కాలినడకన తిరుమలకు బయలుదేరారు. కారులో గంగయ్య, ఇద్దరు పిల్లలు, అల్లుడు తిరుమలకు చేరుకుని కారును స్థానిక వరాహస్వామి అతిథిగృహం–1 పార్కింగ్ ఏరియాలో పార్క్ చేశారు. కారులో లాక్ అయ్యారు! ఆ సమయంలో గంగయ్య పిల్లలు ఇద్దరినీ కారులో ఉంచి కారు డోర్లు లాక్ చేసుకుని బయటకు వెళ్లిపోయాడు. కొంతసేపటికి కారులో ఉన్న పిల్లలకు ఊపిరాడక ఏడుస్తున్నట్లు సమీపంలోని ట్యాక్సీ డ్రైవర్లు గుర్తించి తిరుముల ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు సమీపంలోని ట్యాక్సీ డ్రైవర్ల సహాయంతో కారు అద్దాన్ని పగులకొట్టి తాళం ఓపెన్ చేసి కారులో ఉన్న ఇద్దరు చిన్నారులను బయటకు తీసి ప్రాణాలను కాపాడారు. అనంతరం ట్రాఫిక్ హోంగార్డు జయచంద్ర, పీఎసీజీ వెంకటేష్ ఆధ్వర్యంలో చిన్నారులను వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. చిన్నారుల పెదనాన్న గంగయ్యపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు పిల్లలను రక్షించిన పోలీసులకు తల్లి సుమలత ధన్యవాదాలు తెలిపారు. దీనిపై తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు స్పందించారు. పోలీసుల సమయస్ఫూర్తిని అభినందించారు. -
డ్రైవర్‌గా చేరి ప్రైవేటు వీడియోలతో బ్లాక్ మెయిల్
విశాఖపట్నం: ప్రైవేటు వీడియోలతో సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్న కారు డ్రైవర్ అప్పలరాజును ద్వారకా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేకూరి గిరీష్, భార్య పిల్లలతో కలిసి సీతమ్మధార ప్రాంతంలో నివాసముంటున్నారు. అతనికి అంగవైకల్యం కారణంగా పిల్లలను చూసుకోవడానికి, ఇంటి పనుల కోసం డ్రైవర్‌గా రామెళ్ల అప్పలరాజును పెట్టుకున్నాడు. అతడు నమ్మకంగా ఉండడంతో వారి మధ్య స్నేహం పెరిగింది. ఒక రోజు గిరీష్‌ను హోటల్‌కు తీసుకెళ్లి అమ్మాయిని పరిచయం చేశాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న దృశ్యాలను అప్పలరాజు మొబైల్లో చిత్రీకరించాడు. కొద్ది రోజుల తరువాత ఆ వీడియోలు సాయంతో గిరీష్‌ను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. తనకు రూ.లక్ష ఇవ్వాలని లేదంటే ఫొటోలు సోషల్ మీడియాలోను, కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించాడు. దీంతో పరువు పోతుందని భావించిన గిరీష్ తన బంధువు సిబ్బంది ద్వారా ఆ మొత్తాన్ని ఏర్పాటు చేసి ఆరు యూపీఐ లావాదేవీల ద్వారా డ్రైవర్‌కు బదిలీ చేశారు. చాలా కాలంగా గిరీష్‌తో పాటు అతని కుటుంబ సభ్యులను డ్రైవర్ అప్పలరాజు వేధిస్తూ వచ్చాడు. ఎప్పటికప్పుడు డబ్బులు తీసుకుంటున్నాడు. ఐఫోన్16 ప్లస్‌ను కూడా కొనుగోలు చేయించుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న గిరీష్‌ను అప్పలరాజు కత్తితో బెదిరించి అతని వద్ద ఉన్న రూ.5 వేలు బలవంతంగా తీసుకున్నాడు. అలాగే గిరీష్ తన భార్య పేరు మీద కొనుగోలు చేసిన ఫ్లాట్‌ను కూడా కాజేయడానికి ప్రయత్నించాడు. అంతటితో ఆగకుండా గిరీష్ వీడియోలు అతని భార్యకు పంపించి ఆమెను సైతం వేధింపులకు గురి చేశాడు. వీరి పార్కింగ్ స్థలాన్ని ఆక్రమించి అక్కడ పోలీస్ స్టిక్కర్ ఉన్న కారును పార్క్ చేసేవాడు. డ్రైవర్ అప్పలరాజు వేధింపులను భరించలేక గిరీష్ చివరకు ద్వారకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు అప్పలరాజును అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు పంపించారు. అతడి నుంచి నకిలీ పిస్టల్‌తో పాటు కొంత మొత్తంలో నగదు, కారు, ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు. -
బంధువే.. రాబందై
తాడేపల్లి రూరల్: మైనర్ బాలికపై వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా బాధితురాలి సోదరిపైన కూడా అత్యాచారం చేయబోయాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అంజిరెడ్డి కాలనీలో ఇటీవల జరగ్గా..ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల మేరకు..కాలనీలోని ఓ మహిళ తన భర్తను వదిలేసి..తండ్రి రెండో భార్య కుమారుడు కొండపాటి లంకబాబుతో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. ఆ మహిళకు నలుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు పదేళ్లు. రెండవ కుమార్తెకు తొమ్మిదేళ్లు. వీరి తల్లి మద్యానికి బానిస అయ్యింది. చిన్నారులకు మేనమామ వరుస అయ్యే లంకబాబు పదేళ్ల చిన్నారిపై తరచూ లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. బుధవారం తల్లి మద్యం తాగి ఉన్నప్పుడు ఆమె రెండో కుమార్తెతో లంకబాబు అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ చిన్నారి ఇంట్లో నుంచి పరుగులు తీసి బయటకు వచ్చి పక్క ఇంట్లో మహిళలకు చెప్పింది. దీంతో వారు లంకబాబును చితకబాది పోలీసులకు సమాచారమిచ్చారు. ఈలోగా లంకబాబు పరారయ్యాడు. లంకబాబు ఆ మహిళ పెద్ద కుమార్తెపై పలుమార్లు అత్యాచారం చేశాడని, ఆ చిన్నారి భయంతో బయటకు చెప్పలేక తీవ్ర ఇబ్బందులు పడిందని, పోలీసులు జోక్యం చేసుకుని వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలని స్థానిక మహిళలు డిమాండ్ చేశారు. మహిళలు ఇచ్చిన ఫిర్యాదుతో బాధిత చిన్నారులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి ఏం జరిగిందో తెలుసుకుని వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లంకబాబు కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అదుపులోకి తీసుకుని ఆయనపై పోక్సో కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
భారీగా ఈ-సిగిరెట్స్, మొబైల్‌ఫోన్స్ అక్రమ తరలింపు.. ఇద్దరి అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: భారీగా ఈ- సిగిరెట్స్, మొబైల్‌ఫోన్స్ అక్రమంగా తరలిస్తున్న ఇద్దర్ని వైజాగ్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. కౌలాలంపూర్ నుంచి నిషేధిత ఈ–సిగిరెట్స్ తరలిస్తుండగా.. వీరి వద్ద నుంచి రూ.66.90 లక్షల విలువైన ఈ–సిగరెట్స్, మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి ఏకే–83 విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టులో కొలిపర్తి జయ నరేంద్రకుమార్, ఏటుకూరి లక్ష్మీనారాయణ బుధవారం రాత్రి దిగారు.వీరి లగేజీలో అనుమానిత వస్తువులు ఉన్నట్లు భావించి.. ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏటుకూరి లక్ష్మీనారాయణ బ్యాగ్‌లో రూ.33,96,008 విలువైన 29 ఐఫోన్ 16 ప్రో, ప్రోమ్యాక్స్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రూ.3,30,750 విలువైన 21 ఈ-సిగరెట్ పెట్టెలు(105 ఈ–సిగరెట్స్) చొప్పున మొత్తం రూ.37,26,758 విలువైన వస్తువులు కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొలిపర్తి జయ నరేంద్ర కుమార్ బ్యాగ్‌లో రూ.27,43,351 విలువైన 22 ఐఫోన్ 16 ప్రో, ప్రోమ్యాక్స్ ఫోన్లు, రూ.2,20,500 విలువైన 14 ఈ సిగరెట్ పెట్టెలు(90 ఈ-సిగరెట్స్) చొప్పున మొత్తం రూ.29,63,851 విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. -
అర్ధరాత్రి నర్సింగ్ హాస్టల్లో దూరిన ప్రిన్సిపాల్.. నిర్భంధించిన విద్యార్థినులు
సాక్షి, తిరుపతి: తిరుపతిలో దారుణ ఘటన వెలుగు చూసింది. నర్సింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లోని ఓ గదిలోకి అర్ధరాత్రి ప్రిన్సిపాల్ దూరడంతో విద్యార్థినిలు అతడిని గదిలోనే బంధించారు. దీంతో, హస్టల్ వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది. అనంతరం, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.వివరాల ప్రకారం.. లీలామహల్ సర్కిల్లోని వర్మ కాలేజీ నర్సింగ్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రిన్సిపాల్ వర్మ.. బుధవారం అర్థరాత్రి విద్యార్థినులు గదిలో దూరారు. దీంతో, విద్యార్థినులు.. సదరు ప్రిన్సిపాల్ వర్మను గదిలోనే నిర్భంధించారు. అనంతరం, అలిపిరి పోలీసులకు నర్సింగ్ విద్యార్థినులు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ప్రిన్సిపాల్ వర్మను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వర్మను కఠినంగా శిక్షించాలని అలిపిరి పోలీస్ స్టేషన్ ఎదుట విద్యార్థినిలు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.అయితే, ఈ ఘటనపై కొందరు విద్యార్థినిలు స్పందిస్తూ.. పక్క భవనంలో దూకిన విద్యార్థిని నిలదీసిన ప్రిన్సిపాల్ వర్మపై కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. కేవలం రాత్రి సమయంలో వేరే చోటకు వెళ్తున్న వారిని నిలువరించేందుకు ప్రిన్సిపాల్ అక్కడికి వచ్చినట్టు చెబుతున్నారు. దీంతో, అలిపిరి పోలీసులు నిజానిజాలపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. -
చిత్తూరులో పరువు హత్య?
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో ఇటీవల వెలుగు చూసిన యువతి అనుమానాస్పద మృతి కేసు మలుపు తిరిగింది. మతాంతర వివాహం చేసుకుని తమ పరువు తీసిందనే కక్షతో కుటుంబ సభ్యులే యువతిని కడతేర్చినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరులోని బాలాజీ కాలనీకి చెందిన షౌకత్ అలీ చిత్తూరు మండలం తుమ్మిందలో ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అతడి మూడో కుమార్తె యాస్మిన్ భాను (26) బీటెక్ చదువుతుండగా పూతలపట్టు మండలం పోటుకనుమకు చెందిన దళిత యువకుడు సాయితేజను ప్రేమించింది. ప్రేమ విషయం పెద్దలకు చెబితే పట్టించుకోలేదు. పైగా ఈ ఏడాది ఫిబ్రవరి 9న యాస్మిన్ భానుకు మరో యువకుడితో పెళ్లి నిశ్చయించారు. దీంతో సాయితేజను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్న యాస్మిన్.. ఫిబ్రవరి 6న ఇంటినుంచి వెళ్లిపోయి సాయితేజను పెళ్లి చేసుకుంది. అనంతరం సాయితేజ, యాస్మిన్ పూతలపట్టులోని పోటు కనుమలో కాపురం పెట్టారు. ఇంటికి పిలిచి మరీ చంపేశారు ఆ తరువాత తల్లి ముంతాజ్, ఇద్దరు అక్కలు, కుటుంబ సభ్యులు తరచూ ఫోన్లు చేసి యాస్మిన్‌తో ఆప్యాయంగా మాట్లాడేవారు. ఓసారి షౌకత్ అలీ గడ్డంతో ఉండటాన్ని చూపించి ‘నీ తండ్రి బాగా డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఓసారి ఇంటికి రా’ అని కుటుంబ సభ్యులు యాస్మిన్‌ను కోరగా ఆమె అంగీకరించింది. దీంతో సాయితేజ ఈ నెల 13న యాస్మిన్‌ను ఆమె బంధువుల ద్వారా ఇంటికి పంపించాడు. ఆ తరువాత కుటుంబ సభ్యుల సాయంతో యాస్మిన్ పీకకు తాడు బిగించి తండ్రి షౌకత్ అలీ చంపేసి.. తండ్రి మందలించడంతో ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లితో పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇప్పించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, అనంతరం హత్యగా మార్చి దర్యాప్తు చేస్తున్నారు. ఓ కారును స్వాదీనం చేసుకుని, షౌకత్ అలీ, యాస్మిన్ అన్న లాలా, మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. కుల మతాలు వేరుకావడంతో పరువుపోయిందని భావించి యాస్మిన్‌ను ఆమె తండ్రి షౌకత్ అలీ తాడుతో పీక బిగించి హత్య చేశాడని ఆమె భర్త సాయితేజ ఆరోపిస్తున్నాడు. ఇదే విషయం ఆస్పత్రి వద్ద యాస్మిన్ తల్లి కూడా చెప్పిందన్నాడు. -
బామ్మర్ది మీ అక్క చనిపోయింది..!
శ్రీకాకుళం: మండలంలోని సంతవురిటి గ్రామానికి చెందిన బాలబోమ్మ భవానీ(21) అనే వివాహిత మంగళవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలఖండ్యాం గ్రామానికి చెందిన భవానీకి సంతవురిటి గ్రామానికి చెందిన దినేష్‌తో తొమ్మిది నెలల కిందట వివాహం జరిగింది. దినేష్ సచివాలయ లైన్‌మేన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్నాళ్లుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పాలఖండ్యాంలోని పుట్టింటికి వెళ్లిన భవానీ ఈ నెల 14న సంతవురిటి వచ్చింది. అదే రోజు రాత్రి మళ్లీ దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో మంగళవారం వేకువజామున 4 గంటల సమయంలో భవానీ సోదరుడు నాగరాజుకు దినేష్ ఫోన్ చేసి భవానీ మృతిచెందినట్లు సమాచారం అందించాడు. సోదరుడు వెళ్లి చూసేసరికి భవానీ విగతజీవిగా కనిపించింది. భవానీ మృతికి అల్లుడు దినేష్ , అత్తింటి వారే కారణమని బంధువులు ఆరోపించారు. భవానీ మెడపై గాయాలు ఉండటంతో దినేష్ హత్య చేశాడని ఆరోపిస్తూ మృతురాలి తండ్రి ధారబోయిన రాము పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జె.ఆర్.పురం సీఐ అవతారం, ఇన్చార్జి ఎస్ఐ లక్ష్మణరావు, క్లూస్‌టీం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పంచనామా పూర్తి చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త దినేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెల్లడించారు. -
అనూష గర్భంలో ఆడబిడ్డ
మధురవాడ: భర్త చేతిలో హత్యకు గురైన గర్భిణి అనూష మృతదేహానికి కేజీహెచ్‌లో వైద్యులు మంగళవారం పోస్టుమార్టం పూర్తి చేశారు. ఆమె నిండు గర్భిణి కావడంతో కడుపులోని శిశువు కూడా మరణించింది. గర్భం నుంచి ఆడ మృత శిశువును బయటకు తీశారు. ఇరువురినీ చూసి కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అమ్మ తోటే వెళ్లిపోతున్నావా తల్లీ అంటూ గుండెలవిసేలా రోదించారు. అనూష తండ్రి ఇది వరకే చనిపోగా.. తల్లి అంధురాలు కావడం మరింత ఆవేదనకు గురి చేసింది. ప్రత్యక్షంగా భార్యను, పరోక్షంగా తల్లి కడుపులో బిడ్డను హత్య చేసిన నిందితుడు గెద్దాడ జ్ఞానేశ్వర్‌ను కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అనూష అంత్యక్రియలను దువ్వాడలో పూర్తి చేశారు. కాగా.. దువ్వాడకు చెందిన జ్ఞానేశ్వర్ నర్సీపట్నం రోడ్డులోని అడ్డురోడ్డు తిమ్మాపురానికి చెందిన కేదారిశెట్టి అనూష (27)ని ప్రేమించాడు. 2023లో సింహాచలంలో పెళ్లి చేసుకున్నాడు. భార్యాభర్తలు ఏడాది నుంచి మధురవాడ మిథిలాపురి వుడాకాలనీ ఆర్టీసీ డిపో సమీపం లలితా విహార్ అపార్ట్మెంట్లోని 303వ నంబర్ ప్లాట్‌లో నివాసం ఉంటున్నారు. మనస్పర్థలు కారణంగా వారి మధ్య గొడవలు జరుగుతు న్నాయి. ఏడాది కాలంగా ఆమె అడ్డు తొలగించుకునేందుకు రకరకాలుగా ప్రయతి్నస్తున్నాడు. పిల్లలు పుడితే ఆమెను వదిలించుకోవడం మరింత కష్టమని భావించి.. హత్యకు పథకం వేశాడు. సోమవారం తెల్లవారుజామున ఆమె పీక నులిమి కిరాతకంగా చంపేశాడు. భార్యతో పాటు కడుపులో ఉన్న బిడ్డను కూడా హత్య చేసినందుకు పోలీసులు జ్ఞానేశ్వర్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. నిందితుడిని భీమిలి కోర్టులో హాజరు పరచగా.. మెజి్రస్టేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితుడిని సెంట్రల్ జైలుకు తరలించినట్టు సీఐ బాలకృష్ణ తెలిపారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఎగిరిపడిన స్కార్పియో టాప్
ఒంటిమిట్ట/నంద్యాల: వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని కడప–చెన్నై జాతీయ రహదారి సోమవారం నెత్తురోడింది. స్కార్పియో, బస్సు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. తిరుపతి నుంచి నంద్యాలకు వెళ్తున్న స్కార్పియో(ఏపీ31 cw 7479) వాహనం ఒంటిమిట్ట మండల పరిధిలోని నడింపల్లి వద్దనున్న కడప–చెన్నై జాతీయ రహదారిపైకి రాగానే తిరుపతికి వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు(ఏపీ 39 యుఎం 9771)ను వేగంగా ఢీకొంది.స్కార్పియో పల్టీకొట్టి ఎలక్ట్రిక్ బస్సు వెనుక వస్తున్న పెట్రోలింగ్ వాహనాన్ని కూడా ఢీ కొట్టింది. ప్రమాదంలో స్కార్పియోలోని నలుగురిలో తేజనాయుడు(19), ధర్మారెడ్డి(26), వినోద్(25)లు అక్కడికక్కడే మరణించారు. మహానంది పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సునిల్‌నాయుడుకి తీవ్రగాయాలు అయ్యాయి. ఇతనితో పాటు పెట్రోలింగ్ వాహనం నడుపుతున్న కానిస్టేబుల్ రఘురాంరెడ్డి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడు ధర్మారెడ్డిచేత మద్యం మాన్పించేందుకు తిరుపతికి నాటుమందు కోసమని వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సీఐ బాబు, ఎస్ఐ శివప్రసాద్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని 108లో కడప రిమ్స్‌కు తరలించారు. ప్రమాదం జరిగిన సమాచారాన్ని కడప డీఎస్పీ వెంకటేశ్వర్లకు చేరవేయడంతో ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పరిశీలించి, ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. ఘటనపై రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల వివరాలు ⇒ తేజనాయుడు స్వస్థలం నంద్యాలలోని హౌసింగ్ బోర్డు కాలనీ. తల్లిదండ్రులు భద్ర, రాజేశ్వరి. ఇతను పట్టణంలోని ఓ కళాశాలలో ఐటీఐ చదువుతున్నాడు. ⇒వినోద్ స్వస్థలం బండిఆత్మకూరు మండలంలోని సోమయాజులపల్లె. తల్లిదండ్రులు వెంకటలక్ష్మమ్మ, వెంకటరాముడు. టవర్ల వద్ద జనరేటర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ⇒ ధర్మారెడ్డి స్వస్థలం చాగలమర్రి మండలం డి.కొత్తపల్లె. తండ్రి శివశంకర్‌రెడ్డి వ్యవసాయం చేస్తుండగా, తల్లి అన్నమ్మ ఉన్నారు. నంద్యాలలోని జియో కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల అక్క జ్యోతి వివాహం కాగా, తమ్ముడు శ్రీనివాసరెడ్డి ట్రాన్స్ఫారం కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.స్కార్పియో మితిమీరిన వేగమే కారణం రోడ్డు ప్రమాద స్థలాన్ని కడప ఆర్టీసీ ఆర్ఎం పి.గోపాల్‌రెడ్డి పరిశీలించారు. అక్కడ ఉన్న పరిస్థితిని చూస్తే స్కార్పియో వాహనం నడిపిన వారిదే తప్పుగా తెలుస్తోందన్నారు. మితిమీరిన వేగంతో బస్సు మోటును ఢీకొట్టడంతో స్పీడ్ మీదు తిరుగుకుంటూ వెళ్లి బస్సు వెనుక వైపు వస్తున్న పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టి ఉంటారన్నారు. పూర్తిగా తెలుసుకునేందుకు ఎలక్ట్రిక్ బస్సుకు ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలిస్తామని తెలిపారు.