యువతకు ప్రోత్సాహమేది? | banks not giving loans to youth | Sakshi
Sakshi News home page

యువతకు ప్రోత్సాహమేది?

Jan 14 2018 6:49 AM | Updated on Jan 14 2018 6:49 AM

banks not giving loans to youth - Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం ప్రైమ్‌మినిస్టర్‌ ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రాంను ప్రవేశపెట్టింది. గ్రామీణ, పట్టణ ప్రాంత నిరుద్యోగులకు ఈ పథకం కింద ఉపాధి, కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహించి వారిని ఆర్థికంగా చేయూతనివ్వడమే ఈ పథక ముఖ్య ఉద్ధేశ్యం. ఆయా ఆర్థిక సంవత్సరంలో ముందస్తుగానే ప్రణాళికా లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశిస్తుంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌లో జిల్లాలో 86 మంది నిరుద్యోగ యువతకు జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేశారు. లబ్ధిదారుల ఎంపిక ముందు బ్యాంకర్లు ఆయా లబ్ధిదారులకు యూనిట్‌ మంజూరు కోసం సంబంధిత బ్యాంకర్లు కన్సల్ట్‌ ఇచ్చారు. తీరా వారు ఎంపికయ్యాక బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిప్పించుకుంటున్నారని అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలు ఎలా ముందుకుసాగుతాయనేది ప్రశ్నార్థకం.

ఇవీ నిబంధనలు..
అభ్యర్థులు స్వయం ఉపాధి, చిన్న, మధ్య తరగతి కుటీర పరిశ్రమలకు దరఖాస్తుకు చేసుకునే వారై ఉండాలి. యూనిట్‌ విలువ రూ. 10 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు రుణాలు అందించాల్సి ఉంటుంది. ఈ పథకానికి 18 సంవత్సరాలు పైబడి, ఎనిమిదో తరగతి చదివి ఉండాలి. స్వయం సహాయక బృందాలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్‌ కేటగిరీ వారు 10 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్‌సీ, ఎక్స్‌ సర్విస్‌ మెన్‌ 5 శాతం లబ్ధిదారుల వాటా చెల్లించాల్సి ఉటుంది. గ్రామీణ ప్రాంత జనరల్‌ కులాల వారికి 25 శాతం, మిగితా వారికి 35 శాతం సబ్సిడీ ప్రభుత్వం అందజేస్తుంది. పట్టణ ప్రాంతాల జనరల్‌ కేటగీరి వారికి 15 శాతం, మిగితా వారికి 25 శాతం సబ్సిడీ వర్తిస్తుంది.

బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు..
జిల్లాలో పీఎంఈజీపీ పథకం ద్వారా నిరుద్యోగులైన 86 మంది అర్హులను ఎంపిక చేశారు. 11 మందికి మంజూరు చేయగా కేవలం ఐదుగురికి మాత్రమే రుణాలు అందించారు. నిరుద్యోగ అభ్యర్థులు బ్యాంకు రుణం కోసం నానాకష్టాలు పడి ఆయా బ్యాంకుల్లో కన్సల్ట్‌ తెచ్చుకున్నారు. ఇంటర్వ్యూల్లో నెగ్గారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. లబ్ధిదారులను కమిటీ ఎంపికచేసి తొమ్మిది నెలలు గడుస్తున్నా రుణాలు మాత్రం అందని ద్రాక్షగానే మారాయి. రుణాల కోసం బ్యాంకులకు వెళ్తే డిపాజిట్‌ చేస్తే కానీ రుణాలివ్వడానికి ససేమిరా అంటున్నారు. కొన్ని బ్యాంకులు ఇంటి పత్రాలు, షూరిటీలు, అంటూ నిబంధనలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం బ్యాంకులో డిపాజిట్‌ చేసే అవసరం లేదు. రూ.10 లక్షల వరకు  షూరిటీలు ఇవ్వాలని నిబంధనలు లేవు. కానీ బ్యాంకు అధికారులు మాత్రం ఇష్టారీతిన వ్యవహరిస్తూ రుణం ఇవ్వకుండా చేతులెత్తేస్తున్నారు. ఒక వేళ లబ్ధిదారుడు నష్టపోతే సీజీటీఎస్‌ఎంఈ ద్వారా ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది. ఇదంతా బ్యాంకర్లకు తెలిసినా ఉద్దేశపూర్వకంగానే లబ్ధిదారులను ఇబ్బందులను గురిచేస్తున్నుట్లు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement