దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్త
కడప అగ్రికల్చర్ : ఎల్నినో ప్రభావంతో వారం క్రితం వరకు వర్షాలు లేక పగలు, రాత్రి వేళల్లో ఉక్కపోతతో అల్లాడిన జనం.. ఒక్కసారిగా మారిన వాతావరణంతో ఇబ్బంది పడుతున్నారు. గత వారం రోజుల నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరగడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రాత్రి 9 గంటల నుంచి చలి మొదలై ఉదయం 7 గంటల వరకు ఉంటుంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. వృద్ధులు, చిన్నారులతోపాటు ఉదయం పూట పనుల మీద వెళ్లే రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వాతావరణ మార్పులతో చాలా మంది జలుబు, జ్వరాలతో అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రులు చుట్టూ తిరుగుతున్నారు. శీతల గాలులు వీస్తుండటంతో రోగాల బారిన పడుతున్నారు.
కమ్ముకుంటున్న పొగమంచు
ఒక పక్క చలి పెరగడంతోపాటు పొగమంచు కమ్మేస్తోంది. తెల్లవారుజాము నుంచే పొగమంచు దట్టంగా అలుముకోవడంతో జాతీయ రహదారుల వెంట వెళ్లే వాహన దారులు ఇబ్బంది పడుతున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనైతే ఉషోదయాన్నే మంచు దుప్పటి కప్పేస్తోంది. దీంతో చలిమంటలు వేసుకుంటూ శీతలాన్ని తగ్గించుకుంటున్నారు.
మరింత పెరిగే అవకాశం
ఈ చలి తీవ్రత డిసెంబర్తోపాటు జనవరి నెలలో మరింత పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా సంక్రాంతి సీజన్లో చలి అధికంగా ఉంటుంది. ఇప్పటికే పగటి పూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి, రాత్రి చలితీవ్రత పెరిగింది. దీంతో కడప నగరంలో ఫుత్పాత్ల మీద చలికి సంబంధించి స్పెట్టర్లు, మప్లర్లు, దుప్పట్ల అంగళ్లు వెలిశాయి.
పెంపుడు జంతువులకు దూరంగా..
ఈ సీజన్లో పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. వైరస్ల వ్యాప్తికి పెంపుడు జంతువులు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో వాటిని బెడ్రూమ్, వంటగదిలోనికి రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు పెంపుడు జంతువులను దగ్గరలో లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వేడి వస్తువులకు ప్రాధాన్యం
చల్లని వస్తువులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా కూల్డ్రింక్స్, ఐస్క్రీములకు మరింత దూరంగా ఉండాలి. ఈ చల్లని వస్తువులను తినడం, తాగడం ద్వారా ఉపిరితిత్తుల్లో నెమ్ము పెరిగి ఇబ్బందులను కలుగజేస్తాయి. కాబట్టి గోరు వెచ్చని నీరు తాగితే కాసింత ఉపశమనం లభిస్తుంది. తాజా ఆహారం తీసుకుంటే మంచిది. ముఖ్యంగా చంటి బిడ్డలను బయటికి తీసుకెళ్లకూడదు. వారికి కూడా పాలు, గుడ్లు, పండ్లు, కూరగాయలు ఇవ్వాలి.
జిల్లాలో వారం రోజుల ఉష్ణోగ్రతల వివరాలు
తేదీ కనిష్ట గరిష్ట గాలిలో
తేమశాతం
15 23.2 30.0 74
16 23.6 32.2 72
17 18.2 33.0 66
18 19.0 33.6 68
19 18.9 32.8 60
20 17.2 34.0 52
21 18.0 34.4 65
22 18.2 33.0 65
వారం నుంచి పెరిగిన తీవ్రత
పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
వాతావరణ మార్పుతో అనారోగ్య
సమస్యలు
జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు
ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఉహించని స్థాయిలో పడిపోతున్నాయి. దీంతో దీర్ఘకాలిక జబ్బులతో ఇబ్బందులు పడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చలి తీవ్రంగా ఉన్న సమయాల్లో బయటికి వెళ్లకూడదు. సాధారణ ప్రజలకు కూడా జలుబు, దగ్గు, సీజనల్ జ్వరాలు పచ్చే అవకాశం ఉంది. ఒక వేళ బయటికి రావాల్సిన అవసరం ఏర్పడితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
– డాక్టర్ యస్.మహబూబ్ అలీ,
ఎండీ, (పిజీషియన్) కడప.


