చింతకొమ్మదిన్నె : చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని జయరాజ్ గార్డెన్స్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో రెండు రోజుల పాటు(శని, ఆదివారాలు) ఇజ్తెమా(ఆధ్యాత్మిక సమ్మేళనం) భక్తి శ్రద్ధలతో జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ముస్లింలు తరలిరావడంతో ఇజ్తెమా ప్రాంగణం జనసంద్రమైంది. ఆధ్యాత్మిక సందేశాలు, పవిత్ర నమాజ్ ప్రార్థనలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మికను సంతరించుకుంది. ఈ సందర్బంగా బెంగళూరుకు చెందిన మత గురువులు, ప్రముఖులు మౌలనా అక్బర్ షరీఫ్ సాహెబ్, ముఫ్తీ తాహిర్ ఖురేషీ సాహెబ్, మౌలానా షబ్బీర్ సాహెబ్ తదితరులు మాట్లాడుతూ ఆత్మశుద్ధి, నైతికత, వ్యక్తులలో నైతిక విలువలను పెంపొందించడం, విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవడం, శాంతియుత జీవనాన్ని ప్రోత్సహించడమే ఇజ్తెమా ముఖ్య ఉద్దేశాలన్నారు. ప్రతి ఒక్కరూ అల్లాహ్ మార్గాన్ని అనుసరించాలని, మహా ప్రవక్త మహమ్మద్ (సొ.అ.వ) జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అప్పుడే మానవ జన్మకు సార్థకత చేకూరుతుందని వివరించారు. ఆదివారం రాత్రి జరిగిన ఇజ్తెమా ముగింపు దువాలో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొని తమలోని తప్పులను క్షమించాలని, స్వర్గలోక ప్రాప్తి కల్పించాలని, తమను సన్మార్గంలో నడిపించాలని, ప్రపంచంలో శాంతియుత వాతారవణం నెలకొనాలని ఏకేశ్వరుడైన అల్లాహ్‌ను ప్రార్థించారు.
మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా ప్రార్థనలు
ఇజ్తెమాలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషాతోపాటు పలువురు స్థానిక ముస్లిం ప్రముఖులు పాల్గొని గురువుల సందేశాన్ని ఆలకించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున జరిగిన కార్యక్రమానికి అన్ని వసతులు కల్పించిన నిర్వాహకులను ఆయన అభినందించారు.
శాంతియుత సమాజం కోసం ప్రార్థించిన గురువులు
జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన ముస్లింలు


