రహదారులపై మృత్యుఘోష | - | Sakshi
Sakshi News home page

రహదారులపై మృత్యుఘోష

Nov 23 2026 5:42 AM | Updated on Nov 23 2026 5:42 AM

రహదారులపై మృత్యుఘోష

జమ్మలమడుగు నియోజకవర్గంలోని

రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కొండాపురంలో ప్రైవేట్‌ బస్సు ఢీకొని అన్నదమ్ములు మృతి చెందగా, మైలవరం మండలంలో బొలెరో వాహనాన్ని ఐషర్‌ లారీ ఢీకొట్టిన ఘటనలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం మధ్యాహ్నం, రాత్రి వేళల్లో జరిగిన ఈ వరుస ప్రమాదాలు స్థానికంగా తీవ్ర విషాదాన్ని

నింపాయి.

జమ్మలమడుగు రూరల్‌/కొండాపురం/మైలవరం : కొండాపురం మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వయానా అన్నదమ్ములిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొండాపురం పట్టణంలోని సీఎంఆర్‌ కాలనీలో నివాసం ఉంటున్న పెద్దుగాళ్ల బాబు (57), పెద్దుగాళ్ల ప్రతాప్‌ (55) అలియాస్‌ రొడ్డ ప్రతాప్‌ ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై నూతన జాతీయ రహదారి పక్కన ఉన్న కొత్త ఎస్సీ కాలనీకి వెళ్లారు. అక్కడ పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా, జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన ఓ ప్రైవేట్‌ బస్సు వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అన్నదమ్ములిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులలో బాబు ముద్దనూరు ప్రభుత్వ వసతిగృహంలో వంట మాస్టర్‌గా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ జి.నారాయణరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఒకేసారి మృతి చెందడంతో కొండాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

అయ్యప్ప పూజ ముగించుకుని వస్తుండగా..

మైలవరం మండలంలోని ఈడుగోని బావి వద్ద ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో జరిగిన మరో ఘోర ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కొలిమిగుండ్ల మండలం పెద్దవెంతుర్ల గ్రామంలో పవర్‌ గ్రిడ్‌ కంపెనీ తరఫున 32 కేవీ విద్యుత్‌ లైన్‌ పనులు ముగించుకున్న కార్మికులు, మార్గమధ్యంలోని పేరుసోమల గ్రామ శివాలయంలో అయ్యప్ప పూజలో పాల్గొన్నారు. పూజ అనంతరం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన అయ్యప్ప మాలధారి రిథం పోరే (21), తమిళనాడుకు చెందిన శివ (31)లతో పాటు శ్రీధర్‌, చింతమాను మల్లికార్జున్‌, షేక్‌ సద్దాం కలిసి బొలేరో వాహనంలో జమ్మలమడుగుకు బయలుదేరారు. ఈడుగోని బావి వద్దకు రాగానే వేగంగా వచ్చిన ఐషర్‌ లారీ వీరి వాహనం పక్క భాగాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి రిథం పోరే, శివ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన శ్రీధర్‌, మల్లికార్జున్‌, షేక్‌ సద్దాంలను స్థానికులు జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో షేక్‌ సద్దాం పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ప్రొద్దుటూరుకు తరలించారు.

వేర్వేరు ప్రమాదాల్లో

నలుగురు దుర్మరణం

మరో ముగ్గురికి తీవ్ర గాయాలు..

ఒకరి పరిస్థితి విషమం

కొండాపురంలో ప్రైవేట్‌ బస్సు ఢీకొని అన్నదమ్ములు మృతి

మైలవరం వద్ద బొలెరోను

ఢీకొన్న ఐషర్‌ లారీ

అయ్యప్ప మాలధారి సహా ఇద్దరు బలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement