వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకు ఓటు వేయండి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకు ఓటు వేయండి

Nov 18 2026 1:38 AM | Updated on Nov 18 2026 1:38 AM

● కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

● వేంపల్లె సర్పంచ్‌ అభ్యర్థిగా

షబ్బీర్‌ వలి పేరు ప్రకటన

వేంపల్లె : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి వేంపల్లె మండలంలో దాడులు ఎక్కువయ్యాయని, కాబట్టి అభివృద్ధితోపాటు శాంతి భద్రతలను కాపాడేందుకు పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను ప్రజలు గెలిపించాలని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వేంపల్లెలోని పులివెందుల రోడ్డులో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌ కుమార్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ చంద్ర ఓబుల్‌ రెడ్డి, జెడ్పీటీసీ వెంకట శివమ్మ, మాజీ జెడ్పీటీసీలు రవికుమార్‌ రెడ్డి, షబ్బీర్‌, మాజీ సర్పంచ్‌ రాచినేని శ్రీనివాసులు, సాదక్‌ వల్లిలతో పంచాయతీ ఎన్నికలపై చర్చించి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యాలు, రిగ్గింగ్‌కు పాల్పడిందన్నారు. పులివెందులలో 166 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరగా,.. అందులో సగం పోలింగ్‌ బూత్‌లను టీడీపీ గూండాలు స్వాధీనం చేసుకుని దౌర్జన్యాలకు పాల్పడిందన్నారు. సజావుగా ఎన్నికలు జరిగితే ఎటువంటి ఫలితాలు వస్తాయో వేంపల్లె జెడ్పీటీసీ ఎన్నికలే నిదర్శనమన్నారు. వేంపల్లె జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమికి పోలైన ఓట్లు కేవలం 3,500 మాత్రమేనని వ్యాఖ్యానించారు. సర్పంచ్‌ ఎన్నికలైనా ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఈసీ, పోలీసులు పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హయాంలో వేంపల్లె అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు. వేంపల్లెలో ఉర్దూ జూనియర్‌ కళాశాలత పాటు జెడ్పీ బాలుర, బాలికల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వైఎస్సార్‌ మెమోరియల్‌ పార్కులతోపాటు పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి వేంపల్లె గ్రామ పంచాయతీని చెత్త కుప్పలుగా మార్చి వేశారన్నారు. అలాగే ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. వేంపల్లెను ఆదర్శంగా తీర్చేందుకు ప్రధాన రహదారులు వెడల్పు చేసేందుకు రోడ్ల విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు రూ.50కోట్ల మేరకు నష్ట పరిహారం చెల్లించామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వేంపల్లె అభివృద్ధి, శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై దాడులు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. సర్పంచ్‌ ఎన్నికల వేళ సర్పంచ్‌ అభ్యర్థి షబ్బీర్‌కు చెందిన రైస్‌ మిల్లుపై అక్రమ దాడులు చేయించి సీజ్‌ చేయడం శోచనీయమన్నారు. వేంపల్లె అభివృద్ధి, శాంతిభద్రతల కోసం ప్రజలు ఓటుతో సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. వేంపల్లె మేజర్‌ పంచాయతీకి సర్పంచ్‌ అభ్యర్థిగా మాజీ జడ్పీటీసీ సభ్యుడైన షబ్బీర్‌ వలిని ఎంపిక చేశామన్నారు. కాబట్టి వేంపల్లె ప్రజలందరూ వేంపల్లె సర్పంచ్‌ అభ్యర్థి షబ్బీర్‌ వల్లితోపాటు 20 వార్డుల్లో నామినేషన్లు వేస్తున్న వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థులను గెలిపించాలన్నారు. అదేవిధంగా 17 గ్రామ పంచాయతీల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ మద్దతు సర్పంచ్‌, వార్డు అభ్యర్థులకు గెలిపించాలన్నారు.. అనంతరం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ వేంపల్లె ప్రజలు దౌర్జన్యాలను, అక్రమాలను సహించరని తెలిపారు. ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన కూటమి ప్రభుత్వ నాయకుల్లో కనిపించడం లేదని విమర్శించారు. కూటమి నేతలు వేంపల్లె సర్పంచ్‌ పదవిని రూ.3కోట్లకు బేరం పెట్టారని. వాటిని ప్రజలు సహించరన్నారు. జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి భారీ మెజార్టీ రావడంతో జరగబోయే సర్పంచ్‌ స్థానాలను కై వసం చేసుకునేందుకు టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సర్పంచ్‌ ఎన్నికల్లో అక్రమాలకు తావు లేకుండా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు సంబంధించిన వైఎస్సార్‌సీపీ మద్దతు దారులైన సర్పంచ్‌ అభ్యర్థుల జాబితాను ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ప్రకటించారు. ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షులు మునీర్‌ బాష, రవిశంకర్‌ గౌడ్‌, వైఎస్సార్‌సీపీ యువ నేత రోహన్‌ నాగిరెడ్డిలతోపాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement