వేంపల్లె : స్థానిక గండి రోడ్డులో ఉన్న బృందావన కాలనీ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు బొలెరో వాహనానికి నిప్పు పెట్టిన ఘటన అందరికీ తెలిసిందే. ఇడుపులపాయ గ్రామానికి చెందిన పి.పి.చెండ్రాయుడు బొలెరో వాహనంలో వేంపల్లె నుండి తన ఇంటికి వెళుతుండగా గండిరోడ్డులో కొందరు అడ్డుకుని వాహనానికి నిప్పు పెట్టిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. చెండ్రాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు 11మంది వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపైన అక్రమ కేసులు నమోదు చేశారు. రాజకీయ కుట్రలో భాగంగా ఇడుపులపాయ, వీరన్న గట్టుపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపైనే కేసు నమోదు చేయడం గమనార్హం. టీడీపీ నాయకుడు చెండ్రాయుడు తమ వాహనానికి తానే నిప్పు పెట్టుకుని పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కేవలం టీడీపీ నాయకులు, పోలీసులు ఆడిన కుట్ర అని వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. రేపు జరగబోయే సర్పంచ్, వార్డు ఎన్నికలలో గెలవలేమని ఈ కుట్రకు తెరలేపారన్నారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను బుధవారం సర్పంచ్, వార్డు సభ్యులకు నామినేషన్ వేయనీయకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నాయకులు, పోలీసులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు నామినేషన్ వేసి తప్పకుండా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ప్రధానోపాధ్యాయుడికి షోకాజ్ నోటీసు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక గురవయ్యతోటలోని శ్రీవూటుకూరు వీరయ్య ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమరనాథ్‌రెడ్డికి ఉపవిద్యాశాఖాధికారి శివప్రసాద్ మంగళవారం షోకాజ్ నోటీసు ఇచ్చారు. పాఠశాలలో పనిచేస్తున్న గణిత ఉపాధ్యాయుడు అట్లా నరసింహారెడ్డి విద్యార్థినులతో లైంగిక వేధింపులకు పాల్పడుతున్న విషయాన్ని ఆలస్యంగా విద్యాశాఖాధికారులకు తెలపడం, సోమవారం బయటి వ్యక్తులు అనుమతి లేకుండా పాఠశాలకు రావడం, పాఠశాల గేటుకు తాళం వేయడంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారో వివరాలను షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. జరిగిన సంఘటనపై డీఈఓకు నివేదిక పంపామని, ఆయన చర్యలు తీసుకుంటారని తెలిపారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులే ప్రధానోపాధ్యాయులుగా పనిచేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్న అమరనాథ్‌రెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్ నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు. దీనిపై ఆర్జేడీకి ఫిర్యాదులు వెళ్లాయి, ఆయన ఆదేశాల మేరకు ఉపవిద్యాశాఖాధికారి ప్రధానోపాధ్యాయుడి పోస్టు కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఎన్.సైన్స్ ఉపాధ్యాయుడు సలీం ఆసక్తి చూపడంతో ఆయనకు పదోన్నతి కల్పిస్తూ అక్టోబర్ 9న ఆర్జేడీ ప్రధానోపాధ్యాయుడిగా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రస్తుత ప్రధానోపాధ్యాయుడు అమరనాథ్‌రెడ్డి ఇంత వరకు సలీంకు బాధ్యతలు అప్పగించకపోవడం గమనార్హం.
వీధి కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు
చక్రాయపేట : మండలంలోని సురభి గ్రామం నాగలగుట్టపల్లెలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న నందకిషోర్ (8)పై మంగళవారం వీధి కుక్కలు దాడి చేశాయి. కుప్పం గ్రామం చిన్నమోరయ్యగారిపల్లెకు చెందిన స్వాతి గంగిరెడ్డిల కుమారుడు నందకిషోర్ మరుగుదొడ్డికి వెళ్లిన సమయంలో వీధి కుక్కలు ఆచిన్నారిపై దాడి చేశాయి. తల్లిదండ్రులు వెంటనే వేంపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం కడపకు తరలించారు.


