కడప సెవెన్‌రోడ్స్: జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించిన రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, అంతటితో తమ బాధ్యత తీరిపోయినట్లుగా చేతులు దులుపుకుంది. కరువు ప్రకటన వెలువడి నెలన్నర రోజులు గడుస్తున్నా, అప్పుల ఊబిలో కూరుకుపోయిన అన్నదాతలను ఆదుకునే దిశగా ఇంతవరకు ఒక్క సహాయక చర్య కూడా చేపట్టలేదు. అర్థబలం, అధికార బలంతో అడ్డదారుల్లో స్థానిక సంస్థలను కై వసం చేసుకోవడంపై ఉన్న శ్రద్ధలో ఆవగింజంతైనా కరువు రైతులను ఆదుకోవడంలో కనిపించడం లేదు. ఎన్నికల హామీలను గాలికి వదిలేసిన సర్కార్ తీరుపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మలమలమాడిన పంటలు..
కాగితాలకే పరిమితమైన జీఓలు!
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు వికటించడంతో జిల్లా అంతటా తీవ్ర అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్ సీజన్‌లో సాధారణ సాగు కేవలం 63 శాతానికే పరిమితమైంది. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు జిల్లాలో ఏకంగా 45.6 శాతం వర్షపాత లోటు, సుదీర్ఘ డ్రై స్పెల్స్ సంభవించడంతో సాగు చేసిన వేరుశనగ, జొన్న, కంది, మొక్కజొన్న పంటలు కళ్లెదుటే మాడిపోయాయి. పెట్టిన పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరు కావడంతో రైతులు పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయారు. రైతుల నుంచి తీవ్ర డిమాండ్ రావడంతో జిల్లా యంత్రాంగం మ్యాన్‌డేటరీ, ఇంపాక్ట్ ఇండికేటర్స్, గ్రౌండ్ ట్రూతింగ్ నివేదికలను విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌కు పంపింది. దీంతో ప్రభుత్వం జిల్లాలోని 14 మండలాల్లో తీవ్ర కరువు, 23 మండలాల్లో మధ్యస్థ కరువు ఉన్నట్లు పేర్కొంటూ గత నెల 1వ తేదీన జీఓ ఎంఎస్ నెం. 4 విడుదల చేసింది. ఆ తర్వాత ఒంటిమిట్ట, సిద్ధవటం, నందలూరు మండలాలను కూడా కరువు జాబితాలో చేర్చింది. అయితే, ఈ ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి తప్ప క్షేత్రస్థాయిలో అందిన సాయం శూన్యం.
సహాయక చర్యలు శూన్యం..
కడపపై కేంద్ర బృందం వివక్ష!
కరువు ప్రకటన తర్వాత తక్షణమే పంట నష్ట అంచనాలు సిద్ధం చేసి కేంద్ర బృందాలకు నివేదించాలి. ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ చిన్మటి గాట్మేర్ నాయకత్వంలో 11 మంది సభ్యుల కరువు పరిశీలన బృందం రాష్ట్రానికి వచ్చింది. ఈ నెల 2వ తేదీన అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆ బృందం, కరువుతో అల్లాడుతున్న వైఎస్సార్ కడప జిల్లా వైపు కన్నెత్తి కూడా చూడకుండా అటునుంచి అటే వెళ్లిపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
బీమా రద్దుతో దెబ్బ:
గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే రైతుల తరపున ఉచిత పంటల బీమా ప్రీమియం చెల్లించేది. కూటమి ప్రభుత్వం వచ్చాక దానిని రద్దు చేయడంతో చిన్న, సన్నకారు రైతులు ప్రీమియం చెల్లించలేకపోయా రు. వీరికి బీమా అందదు కాబట్టి ప్రభుత్వమే నేరుగా పరిహారం చెల్లించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు.
పశుగ్రాసం, రుణాల రీషెడ్యూల్ ఊసేది?
రానున్న రోజుల్లో పశుగ్రాస సమస్య తీవ్రరూపం దా ల్చనుందని అధికారులే అంచనా వేసినా, ఉచితంగా గడ్డి విత్తనాలు ఇవ్వడం గానీ, క్యాటిల్ క్యాంప్స్ ఏ ర్పాటు చేయడం గానీ జరగలేదు. కరువు ప్రకటించా క ఖరీఫ్ రుణాలను రీషెడ్యూల్ చేయడం ఆనవాయి తీ అయినా, ఇప్పటివరకు దాని ఆచూకీ లేదు.
తేదీ / సమయం భూగర్భ
జలమట్టం
(లోతు)
గత ఏడాది నవంబర్ 16 6.98 మీటర్లు
ఈ ఏడాది మే నెల 1 0.88 మీటర్లు
ప్రస్తుతం (నవంబర్ 16) 13.40 మీటర్లు
వర్షాభావంతో గ్రామాల్లో చెరువులు, బావులు, బోర్లు ఎండిపోయి వందలాది గ్రామాల్లో ప్రజలు గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్నారు. రానున్న రోజుల్లో ఎద్దడి మరింత తీవ్రమవుతుందని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులే అంచనా వేశారు. గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలమట్టం ప్రమాదకర స్థాయికి పడిపోయింది:
ప్రస్తుతం జిల్లాలో కేవలం 2.97 టీఎంసీల భూగర్భ జలాలు మాత్రమే వినియోగానికి అందుబాటులో ఉన్నాయి. మరోవైపు జిల్లాలోని తెలుగుగంగ, గండికోట, సీబీఆర్, మైలవరం తదితర ప్రధాన రిజర్వాయర్ల పూర్తి సామర్థ్యం 82 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 34 టీఎంసీలు (42 శాతం) మాత్రమే నీరు ఉంది. వేసవిలో కనీవినీ ఎరుగని రీతిలో నీటి ఎద్దడి తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది.


