చరిత్ర కళ్లకు కట్టింది.. విజ్ఞానం వెల్లివిరిసింది | - | Sakshi
Sakshi News home page

చరిత్ర కళ్లకు కట్టింది.. విజ్ఞానం వెల్లివిరిసింది

Nov 17 2026 12:32 AM | Updated on Nov 17 2026 12:32 AM

● కడప జిల్లా గ్రంథాలయంలో ఆకట్టుకున్న పుస్తక, కరెన్సీ ప్రదర్శన

● ఒకే వేదికపై 120 దేశాల కరెన్సీ, రాజుల కాలం నాటి అరుదైన నాణేలు

కడప సెవెన్‌రోడ్స్‌: ఒకవైపు అక్షర జ్ఞానాన్ని పంచే అమూల్యమైన పుస్తకాలు.. మరోవైపు వందల ఏళ్ల నాటి చరిత్రను గుర్తుచేసే రాజుల కాలం నాటి నాణేలు, విదేశీ కరెన్సీ నోట్లు! జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా సోమవారం కడప నగరంలోని జిల్లా గ్రంథాలయ సంస్థలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శన సందర్శకులను, ముఖ్యంగా విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది.

అరుదైన నాణేల ఖజానా..

ఈ ప్రదర్శనలో రిటైర్డ్‌ లైబ్రేరియన్‌ ఎస్‌. రంగనాథ్‌ సేకరించిన అరుదైన నాణేలు, కరెన్సీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

120 దేశాల కరెన్సీ:

ప్రపంచంలోని 120 దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు, నాణేలను ఒకేచోట చూడటం విద్యార్థులకు సరికొత్త అనుభూతినిచ్చింది.

చారిత్రక నాణేలు:

టిప్పు సుల్తాన్‌, శ్రీకృష్ణదేవరాయలు, గ్వాలియర్‌ కుషాణ్‌ రాజుల కాలం నాటి నాణేలతో పాటు, బ్రిటిష్‌ (ఈస్ట్‌ ఇండియా) కాలం నాటి 300కు పైగా అరుదైన నాణేలు నాటి ఆర్థిక, చారిత్రక వైభవాన్ని కళ్లకు కట్టాయి.

పుస్తకాలే మంచి నేస్తాలు..

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సమాచార శాఖ ఆర్‌జేడీ వెంకటేశ్వరప్రసాద్‌ ప్రదర్శనను తిలకించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, పుస్తకాలు మనిషికి నిజమైన నేస్తాలని పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు గ్రంథాలయాల్లోని విలువైన పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి అమీరుద్దీన్‌, డిప్యూటీ లైబ్రేరియన్‌ పవన్‌కుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ పి. రాజ్‌కుమార్‌, గ్రంథాలయ అధికారులు జి. రాజకుమార్‌, సురేష్‌, సుబ్బమ్మ, శేఖర్‌, వెంకటరమణ, ఇబ్రహీం సాహెబ్‌తో పాటు పెద్ద సంఖ్యలో పాఠకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement