● అన్నమయ్య జిల్లాలో రెండో రోజూ
చెలరేగిన టీడీపీ గుండాలు
● నామినేషన్ వేసేందుకు వస్తున్న
అభ్యర్థిపై దాడి, బైక్ ధ్వంసం
● శ్రీకాంత్ రెడ్డి, రమేష్ రెడ్డి,
సుదర్శన్ రెడ్డి గృహ నిర్బంధం
● నామినేషన్ వేశారని పాలక్యాన్లకు నిప్పు
సాక్షి, మదనపల్లె: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇలాకా రాయచోటిలో రెండవ రోజు గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో టీడీపీ గూండాలు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. దాడులు, రాళ్ల దాడులతో బీభత్సం సృష్టించారు. వారితోపాటు నామినేషన్లు వేసేందుకు వస్తున్న గ్రామస్తులను పోలీసులే అడ్డుకోగా రోడ్డుపైనే నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ భయానక వాతావరణం సృష్టించి వైఎస్ఆర్సీపీ మద్దతు ఇచ్చే అభ్యర్థుల నామినేషన్లు దాఖలు కానివ్వకుండా అడ్డుకున్నారు. ఈ అరాచకాల ఫలితంగా సోమవారం వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు నామినేషన్లు దాఖలు చేయలేకపోయారు.
ఇంటివద్దే నేతల నిర్బంధం..
రాయచోటిలో వైఎస్ఆర్సీపీ నేతలను స్వేచ్ఛగా తిరగనివ్వకుండా పోలీసులు నిర్బంధం చేశారు. మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిని రామాపురం మండలంలోని స్వగ్రామంలోని ఇంటిలోనే పోలీసులు నిర్బంధించి బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. లక్కిరెడ్డిపల్లి లో మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డిని కూడా గృహ నిర్బంధం చేసిన పోలీసులు బయటకు రానివ్వలేదు. గాలివీడు మండలానికి చెందిన వైఎస్ఆర్సీపీ న్యాయ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు జిల్లా సుదర్శన్ రెడ్డి నూలివీడులో ఉండగా పోలీసులు ఆయనను బలవంతంగా స్వగ్రామం నక్కలవాండ్లపల్లెలోని ఇంటికి తరలించి నిర్బంధించారు. వెలుపల భారీగా పోలీసులు మోహరించారు. గాలివీడు మండలం నూలివీడులో నామినేషన్లు వేసేందుకు తమ అభ్యర్థులతో కలిసి బీజేపీ మండల అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి వచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా వీరిపై దాడి చేశారు. కరల్రు, సీసాలతో విరుచుకుపడ్డారు.
పోలీసులే అడ్డగింత ..
గాలివీడు మండలం అరవీడులో నామినేషన్లు వేసేందుకు వస్తున్న గ్రామస్తులను పోలీసులు సమీపంలోనే రోడ్డుపై అడ్డుకున్నారు. తమను నామినేషన్ వేసేందుకు వెళ్ళనివ్వాలని పోలీసులను కోరారు. పోలీ సులు తిరస్కరించి వారిని చుట్టుముట్టి అడ్డుకున్నారు.
పాల క్యాన్లకు నిప్పు ..
సంబేపల్లిలో ఆదివారం పంచాయతీ ఎన్నికల్లో పోటీకి నామినేషన్లు వేశారన్న అక్కసుతో వైఎస్ఆర్సీపీ మద్దతుదారు కొప్పల చంద్రయ్య ఇంటి వద్ద దుండగులు పాలకేన్లకు నిప్పు పెట్టారు.


