కడప కార్పొరేషన్: స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగితే వేంపల్లె జెడ్పీటీసీకి ప్రజలు ఇచ్చిన తీర్పే జిల్లా అంతటా వచ్చేదని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నాయకులను నామినేషన్లే వేయకుండా టీడీపీ అల్లరి మూకలు అడ్డుకున్నప్పటికీ, స్క్రూటినీలో నామినేషన్లు తిరస్కరించినప్పటికీ ఒకట్రెండు చోట్ల మాత్రమే ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేశారని, అక్కడ వైఎస్సార్‌సీపీ విజయదుందుభి మోగించిందన్నారు. వేంపల్లె మండలంలో 45వేల ఓట్లు ఉంటే 26వేల ఓట్లు పోల్ అయ్యాయన్నారు. ఇందులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి 19,192 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారన్నారు. ప్రతి చోటా ఇలాగే స్వేచ్ఛాయుతంగా పోలింగ్ జరిగితే ఇదే తరహా తీర్పు వస్తుందన్నారు. కూటమి అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారని, ఇది శాశ్వతం కాదని హెచ్చరించారు.మాజీ జెడ్పీ వైస్‌ఛైర్మెన్ బాలయ్య యాదవ్, మాజీ ఎంపీపీ సురేష్ యాదవ్ పాల్గొన్నారు.
కడప అగ్రికల్చర్: జిల్లాలోని 58 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బంది సిద్ధం కావాలని జిల్లా సహకార అధికారి (డీసీఓ) వెంకటసుబ్బయ్య పిలుపునిచ్చారు. శనివారం కడప కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో డివిజనల్ అధికారులతో (డీఎల్‌సీఓ) ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీఓ మాట్లాడుతూ, త్వరలోనే సహకార సంఘాల ఎన్నికలు జరగనున్నందున ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. గత ఎన్నికల ఉత్తర్వులు, నిబంధనలు, సవరణలను పరిశీలించి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు.
యువకుడికి గాయాలు
ముద్దనూరు: ముద్దనూరు–కడప రహదారిలో కొత్తపల్లె సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకునికి తీవ్రగాయాలయ్యాయి. నాయక్,వేణులు బైక్‌లో శనివారం ముద్దనూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రున్ని 108లో ప్రొద్దుటూరుకు, ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నాడు.
పరిమిత పెట్టుబడితో లాభాలు
కడప అగ్రికల్చర్: తక్కువ స్థలం, పరిమిత పెట్టుబడితో పుట్టగొడుగుల పెంపకం చేపట్టి గ్రామీణ యువత, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని ఊటకూరు కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) అధిపతి డాక్టర్ సునీల్‌కుమార్ సూచించారు. శనివారం కేవీకేలో రైతులకు, యువతకు పుట్టగొడుగుల సాగుపై రెండో రోజు ఆచరణాత్మక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కీటక శాస్త్రవేత్త డాక్టర్ వి. శిల్పకళ ముడిపదార్థాల ఎంపిక, వరి గడ్డితో బెడ్ల తయారీ, విత్తనాలు నింపడం, తేమ నియంత్రణ మరియు తెగుళ్ల నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. పాల్గొన్న వారితో స్వయంగా బెడ్లు తయారు చేయించి ప్రాయోగిక అనుభవం కల్పించారు. కేవీకే శాస్త్రవేత్తలు టి. మహేష్ బాబు, కె. సాయి మహేశ్వరి, డా. ఐ. సురేష్ కుమార్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.


