జమ్మలమడుగు రూరల్: భార్య సీమంతం వేడుకల వేళ ఆ ఇంట్లో తీవ్ర విషాదం నిండింది. బంధువుల కోసం తాగునీరు తెచ్చేందుకు వెళ్లిన ఓ యువకుడిని ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ హృదయవిదారక ఘటన జమ్మలమడుగు మండల పరిధిలోని ధర్మాపురం గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడి అన్న శ్రీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం... ధర్మాపురం గ్రామానికి చెందిన శ్రీధర్ (22) భార్య సీమంతం వేడుకలు శనివారం ఇంట్లో జరుగుతున్నాయి. వేడుకకు వచ్చిన బంధువుల కోసం తాగునీరు తెచ్చేందుకు శ్రీధర్ బయటకు వెళ్లాడు. ఆ సమయంలో వెనుక వైపు నుంచి వేగంగా వచ్చిన ఓ ట్రాక్టర్ అతడిని బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో శ్రీధర్ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అతన్ని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కడపకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే శ్రీధర్ మృతి చెందాడు. డిగ్రీ వరకు చదివిన శ్రీధర్, ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటూ పొలం పనులు చేసుకుంటున్నాడని తెలిపారు. ఈ ఘటనపై మృతుడి అన్న పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కడప ఎడ్యుకేషన్: కడప జిల్లాలోని బియ్యం వ్యాపారుల దోపిడీపై చర్యలు తీసుకువాలని ఆర్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డి. యం.ఓబులేసు యాదవ్ డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం కలెక్టరేట్‌లో డీఆర్వో మల్లికార్జునుడును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఓబులేసు యాదవ్ మాట్లాడుతూ.. నెల రోజుల క్రితం రూ.1400 ఉన్న 25 కేజీల బియ్యం బస్తా ధరను ప్రస్తుతం రూ.2500 నుంచి రూ.3500 వరకు పెంచి సామాన్యులను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు ఇచ్చే చౌక బియ్యాన్ని కల్తీ చేసి అమ్ముతున్నా పౌరసరఫరాల శాఖ అధికారులు, స్థానిక తహసీల్దార్లు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ధరలను అరికట్టి, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో శనిత్రయోదశి పూజలు
కడప సిటీ : కడపలోని శ్రీ విజయదుర్గా దేవి అలయంలో శనివారం శనిత్రయోదశి పూజలను జరిపారు. శనేశ్వర స్వామికి తైలాభిషేకం నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు మల్లికార్జున రావు, నిర్వాహకులు దుర్గా ప్రసాద్‌లు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు.కడపలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తుల శనీశ్వరస్వామికి తైలాభిషేకం నిర్వహించారు.


