నారాక్షసానందం | - | Sakshi
Sakshi News home page

నారాక్షసానందం

Nov 4 2026 2:14 AM | Updated on Nov 4 2026 2:14 AM

నారాక్షసానందం

‘రెడ్‌ బుక్‌’ ముందు భారత రాజ్యాంగం చిన్నబోయింది.. ‘పుర’ పోరు వేదికగా.. బ్యాలెట్టు బాక్సుల సాక్షిగా ‘పచ్చ’దండు చేసిన దౌర్జన్యకాండ లోకానికి తెలిసింది. నామినేషన్లు మొదలు కౌంటింగ్‌ దాకా అడుగడుగునా ‘ఎన్నిక’ను హైజాక్‌ చేసిన తీరు చూసి ప్రజాస్వామ్యం ఓడిపోయింది. ‘గెలుపు’ సైతం సిగ్గుతో చచ్చిపోయింది. సత్యాన్ని వధిస్తూ.. ధర్మాన్ని చెరబడుతూ ‘నారా’క్షసానందం పొందుతుంటే సమాజం విస్తుపోయింది. మంగళవారం జరిగిన కౌంటింగ్‌ ప్రక్రియతో కూటమి పతనానికి కౌంటింగ్‌ మొదలైందనే మాట రాజకీయ విశ్లేషకుల నోట వినిపిస్తోంది.

సాక్షి ప్రతినిధి, కడప: నవ్విపోదురుగాక...మాకేటి సిగ్గు అన్నట్లుగా అధికారుల తీరు ఉంది. నామినేషన్లు మొదలు పోలింగ్‌ నిర్వహణ దాకా నిబంధనలు, చట్టాన్ని పాతిపెట్టినట్టే, కౌంటింగ్‌లో కూడా అదే ధోరణి కొనసాగింది. విపక్ష పార్టీకి చెందిన కౌంటింగ్‌ ఏజెంటుపై టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి దాడి చేశారు. కడపలోని 33, 46 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారని సుమారు 3 గంటలపాటు కౌంటింగ్‌నే నిలిపేశారు.

నామినేషన్లు.. ఆపై పోలింగ్‌లో అధికార పార్టీకి తొత్తులుగా మారిన అధికారులు చివరికి వాటి ఫలితాలు వెల్లడించడంలో కూడా ఏకపక్ష చర్యలకే మొగ్గు చూపారు. ఉదయం నుంచి రాత్రి 7గంటల వరకూ కడప మేయర్‌ అభ్యర్థుల తొలిరౌండ్‌ ఫలితాలు కూడా వెల్లడించలేదంటే అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తు కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ పర్యవేక్షిస్తున్నా.. మరోవైపు రిటర్నింగ్‌ అధికారితో సహా యంత్రాంగం తిష్టవేసి ఉన్నా ఎలాంటి ఫలితం లేదు. వైజాగ్‌ లాంటి గ్రేటర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఫలితాలు పూర్తి అయ్యాయి. పొరుగునున్న తిరుపతి, నెల్లూరు, అనంతపురం కార్పొరేషన్‌ ఫలితాలు కూడా వెల్లడించారు. కడప కార్పొరేషన్‌లో మాత్రం సాయంత్రం ఏడుగంటల దాకా తొలి రౌండ్‌ ఫలితాన్ని కూడా వెల్లడించకపోవడం అధికారుల వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనం.

33, 46డివిజన్లు కౌంటింగ్‌ నిలిపివేత

నగరంలోని 33వ డివిజన్‌, 46వ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థుల ఫలితాలను 3గంటల పాటు కౌంటింగ్‌ అధికారులు నిలిపేశారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య సతీమణి సంధ్యారాణి 33వ డివిజన్‌లో కార్పొరేటర్‌ అభ్యర్థిగా నిలిచారు. తొలిరౌండ్‌లో కూటమి అభ్యర్థిపై 162 ఓట్లు ఆధిక్యత సాధించింది. అలాగే 46వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జమీల్‌ 272 ఓట్లు ఆధిక్యత సాధించారు. ఆ తర్వాత ఆ రెండు డివిజన్ల ఫలితాలను వెల్లడించకుండా కౌంటింగ్‌ ప్రక్రియనే నిలిపేశారు. పైరవీలు, ప్రలోభాలకు అవకాశమిచ్చేందుకే కలెక్టర్‌ ఇలాంటి చర్యలను కొనసాగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు.

వైఎస్సార్‌సీపీ కౌంటింగ్‌ ఏజెంటుపై దాడి....

46వ డివిజన్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జమీల్‌ కౌంటింగ్‌ ఏజెంటు అప్రోజ్‌పై టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి హానీఫ్‌ మరో ముగ్గురు ఏకంగా కౌంటింగ్‌ కేంద్రం వద్దే దాడి చేశారు. ఆకలి తీర్చుకోవాలని బయటకు వచ్చిన ఏజెంటుపై ప్రాంగణంలో దాడికి పాల్పడ్డారంటే కౌంటింగ్‌ కేంద్రంలో భద్రత ఏస్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

● కడప కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నెల్లటూరి సువర్ణ 65,588 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ మేరకు అధికారులు ఆమెకు మంగళవారం అర్థరాత్రి డిక్లరేషన్‌ ఫారం అందించారు.

● జమ్మలమడుగు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి చదిపిరాళ్ల జ్యోతి, పులివెందులలో టీడీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి గీతా కుమారి గెలిచినట్లు అధికా రు లు ప్రకటించారు. రాజంపేట పురపాలక ఎన్నికల్లో నలుగురు, పులివెందులలో ముగ్గురు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

కూటమి పతనానికి ‘కౌంటింగ్‌’ షురూ!

కౌంటింగ్‌ కేంద్రంలో

వైఎస్సార్‌సీపీ ఏజెంటుపై దాడి

పోలీసుల భద్రతలో డొల్లతనం

33, 46 డివిజన్లు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఆధిక్యతతో కౌంటింగ్‌ నిలిపివేత

రాత్రి 7గంటల వరకూ

మేయర్‌ తొలి రౌండు ఫలితాలు కూడా వెల్లడించని వైనం

నామినేషన్లు, పోలింగ్‌ తరహాలోనే

కౌంటింగ్‌లో నిమ్మకునీరెత్తినట్లుగా

అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement