కడప అర్బన్: జిల్లావ్యాప్తంగా ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగిందని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. కడప మినహా మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ త్వరగా పూర్తయిందని వెల్లడించారు. కడప కార్పొరేషన్ పరిధి పెద్దది కావడంతో ఓటర్ల సంఖ్య అధికంగా ఉందని, దీంతో పోలింగ్ ముగింపులో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. త్వరితగతిన ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపా రు. జిల్లావ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల పరిధిలోకి కొత్త వ్యక్తులను అనుమతించలేదని పేర్కొన్నారు. కడపలోని రిమ్స్ సమీపంలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో పోలింగ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను మంగళవారం రాత్రి ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ పరిశీలించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్ అఫ్రోజ్ పై, టీడీపీ వారు దాడి చేశారని, మీడియా బృందాన్ని పోలీసులు కించపరిచేలా వ్యవహరిస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎస్పీ దాడి సంఘటనపై విచారణ చేస్తున్నామని వెల్లడించారు.


