● ‘మురసు’ ముసురుకోవడంతో
వరి రైతుల్లో ఆందోళన
● పలు చోట్ల ప్రారంభమైన వరి కోతలు
● ఇప్పటికే పంట కోసిన రైతుల్లో
కలవరింత
● జిల్లాలో అడపాదడపా కురుస్తున్న వర్షాలు
కడప అగ్రికల్చర్: మురసు తుపాన్ అన్నదాత గుండెల్లో గుబులు పెంచుతోంది. తుపాను ప్రభావంతో జిల్లా అంతా ముసురు పట్టగా.... అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరి రైతుల్లో ఆందోళన మొదలైంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కుగాను జిల్లావ్యాప్తంగా 33,078 హెక్టార్ల సాధారణ వరిసాగు లక్ష్యం కాగా 23,636 హెక్టార్లలో పంట సాగైంది. ఇందులో ముందుగా పెన్నా, కుందూ పరివాహక ప్రాంతాలైన చాపాడు, ప్రొద్దుటూరు, చెన్నూరు, కడప, సిద్దవటం, ఒంటిమిట్ట, మైలవరం మండలాల పరిధిలోని బోర్లు, పిల్టర్లు కింద రైతులు వరి సాగు చేసుకున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 5400 హెక్టార్ల వరకు కోతలు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఇంకా 18 వేల హెక్టార్లలో వివిధ దశల్లో ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రాంతాల్లో కోత దశకు చేరుకోగా మరికొన్ని ప్రాంతాల్లో చిరుపొట్ట దశ, వెన్న దశల్లో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో పాలు పోసుకునే దశలో పంట ఉంది. ప్రస్తుత తుపాన్ వర్షం వల్ల కంకిలోకి నీరు దిగి దిగుబడి తగ్గే అవకాశం ఉండటంతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతోపాటు వెన్నుదశలో ఉన్న వరి కంకి కూడా దెబ్బతినే అవకాశం ఉండటంతో వారిలో కూడా ఆందోళన మొదలైంది.
కంటిపై కునుకు లేకుండా...
ఇప్పటికే వరి కోతలను ప్రారంభించిన రైతన్నల్లో అలజడి మొదలైంది. కొంతమంది రైతులు కోసిన ధాన్యాన్ని నూర్పిడి చేసుకుని రోడ్లుపైన, మెట్టప్రాంతాల్లో ఆర బెట్టుకుంటున్నారు. కాకపోతే అప్పుడప్పుడు వర్షం పడటం మళ్లీ కొద్దిసేపు తెరప ఇస్తుండంతో రైతులు ఆందోళన పడుతున్నారు. పచ్చి ధాన్యం కావడంతో పట్టల కింద అలాగే రెండు మూడు రోజులు ఉంచితే ఉక్కతో దెబ్బతినే ప్రమాదం ఉంటుందని పలువురు రైతులు తెలిపారు. అలాగని పట్టలు తీసేద్దామంటే పెద్దవర్షం వస్తుందేమోనన్న భయం వెంటాడుతోంది. ఈ రెండింటి నడుమ రైతుల్లో కంటిమీద కునుకు కరువైంది.
అక్కడక్కడ నేలకొరుగుతున్న వరిపంట..
ప్రస్తుతం వీస్తున్న గాలులతోపాటు వర్షాలకు పూర్తిగా కోతకు సిద్దంగా ఉన్న వరిపంటతోపాటు ఏపుగా పెరిగిన వరిపంట పలు చోట్ల నేలకొరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చాపాడు, పొద్దుటూరు, మైదుకూరు, ఖాజీపేటలతోపాటు పలు మండలాల్లో అక్కడక్కడ వరికొతలను ప్రారంభించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతోపాటు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో చాలామంది రైతులు వరి కొతలను కొయకుండా వాయిదా వేసుకుంటున్నారు.


