ప్రజాస్వామ్యానికి పాతరేసిన కూటమి | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యానికి పాతరేసిన కూటమి

Oct 27 2026 2:02 AM | Updated on Oct 27 2026 2:02 AM

● చిన్న కారణాలు చూపి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరిస్తున్నారు

● ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ

జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి

కడప కార్పొరేషన్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి కుట్రలు పరాకాష్టకు చేరాయని, చిన్న చిన్న కారణాలు చూపి తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నాయకులు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు పచ్చపత్రికల్లో వార్తలు వస్తున్నాయని, ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదని, వాళ్లకై వాళ్లు వ్యవస్థలను భ్రష్టు పట్టించి చేసుకున్నవేనన్నారు. ఇది టీడీపీ సాధించిన విజయం కాదని...డీజీపీ హరిష్‌కుమార్‌ గుప్తా, డీఐజీ కోయ ప్రవీణ్‌ల విజయమని ఎద్దేవా చేశారు. ఏ–ఫారం, బీ– ఫారం లేకుండానే వైఎస్సార్‌సీపీ పేరుతో నకిలీ నామినేషన్లు వేయించి కోర్టులను, ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారన్నారు. ఆ నకిలీ నామినేషన్లు ఉపసంహరించుకొని టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవం అయినట్లు ప్రకటిస్తున్నారన్నారు. ప్రపోజర్స్‌ ఫోన్‌లో చెప్పారని నామినేషన్‌ తిరస్కరించడం అన్యాయమన్నారు. నో డ్యూస్‌ సర్టిఫికెట్‌ అసవరం లేదని ఎన్నికల కమిషన్‌ చెప్పినా...వీళ్లు కావాలంటున్నారన్నారు.ఎన్నికల ప్రచారంలో ఉన్న తమ పార్టీ నాయకులను కత్తితో పొడిస్తే వ్యక్తిగత కారణాలతో పొడిచారని పోలీసులు చెప్పడం దుర్మార్గమన్నారు. కలెక్టర్‌కూడా తమ జెడ్పీటీసీ నామినేషన్ల అప్పీళ్లను తిరస్కరిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. తమ పార్టీ నాయకులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

రౌడీయిజం చెయ్‌... పోలీసుల అండతో

ఏకగ్రీవం చేసుకో...: రమేష్‌ యాదవ్‌

స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘రౌడీయిజమ్‌ చెయ్‌...పోలీసుల అండతో ఏకగ్రీవం చేసుకో’ ఇదే టీడీపీ విధానమని ఎమ్మెల్సీ ఆర్‌. రమేష్‌ యాదవ్‌ విమర్శించారు. ఎన్నికల తంతు మొదలైనప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేయడానికి అనేక ఎత్తులు వేసిందన్నారు. అందులో భాగంగానే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ డమ్మీ జీవో ఇచ్చారన్నారు. ప్రజలను ఓటు అడిగే దమ్ము, ధైర్యం లేకనే కూటమి ప్రభుత్వం దొడ్డిదారి రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

ప్రజలు కూటమికి బుద్ధి చెబుతారు

ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి

స్థానిక సంస్థలు, మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి పాతరేసిందని ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి అన్నారు. అన్ని స్థానాలకు నామినేషన్లు వేయనీయకుండా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను కట్టడి చేశారని, వేసిన వాటిని కూడా అకారణంగా తిరస్కరిస్తున్నారన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తగిన సమయంలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మాజీ మేయర్‌ పాకా సురేష్‌ కుమార్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు పులి సునీల్‌ కుమార్‌, సీహెచ్‌ వినోద్‌ కుమార్‌, ఎన్‌. శివరామ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement