వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా బండి దీప్తిరెడ్డి నగరంలో కలియతిరుగుతూ ప్రజల మద్దతు కోరుతున్నారు. నగరంలో ఎక్కడికెళ్లినా అపూర్వ ఆదరణ లభిస్తోంది. పైగా రాజకీయ అనుభవం, విద్యాధికురాలు కావడం కలిసొచ్చే అంశంగా మారిందని విశ్లేషకులు వివరిస్తున్నారు. అపారమైన పరిణితి ఉన్న నేతగా తక్కువ కాలంలోనే గుర్తింపు పొందారు. ఈవిషయాన్ని అధికార పార్టీకి చెందిన నేతలు సైతం గుర్తించారు. క్షేత్రస్థాయిలో వైఎస్సార్‌సీపీకి ఉన్న మద్దతును లెక్కగట్టారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి దంపతుల ఏకపక్ష నిర్ణయాలతో వ్యతిరేకతను పసిగట్టారు. ఈ పరిస్థితుల్లో డాక్టర్ మధు ఇటీవల టీడీపీకి చెందిన ఓ నాయకుడితో ఏకాంత చర్చలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ‘కడపలో అసలు ఏం జరుగుతోంది, నాకేమి అర్థం కావడం లేదం’టూ వాపోయినట్లు సమాచారం. ‘తిలాపాపం తలా పడికెడు’ అన్నట్లుగా మేయర్ ఎన్నికల్లో చేదు ఫలితాలే వచ్చేలా ఉందనే భావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదివరకు పోలీసులే నామినేషన్లు నుంచి కార్పొరేటర్లను గట్టెక్కించినట్లుగా పోలింగ్‌లోనూ తమను నెగ్గిస్తారనే ఆశల్లో ఆ పార్టీ నేతలు ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు.


