కడప సిటీ : ఆ ప్రాంగణమంతా ఇసుకేస్తే రాలనంత జనం.. అంతటా ఆధ్యాత్మిక సుగంధం.. అందరి మనసుల నిండా భక్తిభావం.. జిల్లా కేంద్రమైన కడప పెద్ద దర్గా ఆవరణలో ఆదివారం కనిపించిన దృశ్యాలివి. ఉరుసు ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గంధోత్సవం ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. హజరత్ సూఫీ సర్ మస్తాని చిల్లాకష్ ఖ్వాజా సయ్యద్‌షా ఆరీఫుల్లా మహమ్మద్ మహమ్మదుల్ హుసేనీ చిష్టివుల్ ఖాద్రీ సాహెబ్ ఉరుసు ఉత్సవాల్లో భాగంగా దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ తన నివాసం నుంచి అలంకరించిన గంధం కలశంతో ఫకీర్ల మేళతాళాలు, సాహస విన్యాసాల మధ్య ఊరేగింపుగా దర్గాలోని గురువుల మజార్ వద్దకు తరలి వెళ్లారు. గంధం సమర్పించి ఫాతెహా నిర్వహించారు. సినీ దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ గంధోత్సవంలో పాల్గొన్నారు. అలాగే వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి శ్యామల దర్గాను సందర్శించారు.
దీక్షలో మలంగ్‌షా : ఈ సందర్బంగా మలంగ్‌షాను పీఠాధిపతి దీక్ష వహింపజేశారు. దర్గా నుంచికడప నగరంలోని పలు ముఖ్య కూడళ్ల మీదుగా వెళ్లిన మలంగ్‌షా, అనుచర బృందం నాగరాజుపేటలోని బాదుల్లాసాహెబ్ మకాన్‌కు చేరింది. మకాన్ నిర్వాహకులు, స్థానిక భక్తులు వారిని ఘనంగా స్వాగతించారు. సాయంత్రం ఆ బృందం ఊరేగింపుగా తిరిగి దర్గాకు చేరుకుంది. రాత్రి మలంగ్‌షా దర్గా ఆవరణంలోని పీర్లచావిడిలో దీక్ష వహించారు. దర్గా పీఠాధిపతి స్వయంగా వెళ్లి ఆయనకు సంప్రదాయబద్దంగా దీక్ష వహింపజేశారు.


