కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ఆధునిక రాచరిక పాలనను మరిపించిందని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆదివారం కడప నగరంలోని సీపీఎం కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బద్వేలు మున్సిపాలిటీ 21వ వార్డుకు, బ్రహ్మంగారిమఠం మండలం జెడ్పీటీసీకి, ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం ఎంపీటీసీకి, ప్రొద్దుటూరు రూరల్ కొత్తపల్లె, గోపవరం ఎంపీటీసీ స్థానాలకు సీపీఎం అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని తెలిపారు. ఎలాంటి కష్టాల్లోనైనా ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తున్న సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి నామినేషన్స్ వేయటానికి వెళ్లిన స్వతంత్ర, వామపక్షాలు, చిన్న పార్టీల, ప్రతిపక్షాల అభ్యర్థులను వేయనీయకుండా ఎన్‌డీఏ కూటమి శ్రేణులు అడ్డుకుంటూ, దాడులు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎ.రామ్మోహన్, జి.శివకుమార్, జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాసులు రెడ్డి, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.


