అక్కసు పట్టలేక అరాచకాలు | - | Sakshi
Sakshi News home page

అక్కసు పట్టలేక అరాచకాలు

Oct 26 2026 2:28 AM | Updated on Oct 26 2026 2:28 AM

అక్కసు పట్టలేక అరాచకాలు

కడప రూరల్‌ : జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆగడాలు మితిమీరిపోయాయి. యథేచ్ఛగా దాడులు, విచ్చలవిడిగా దౌర్జన్యాలు సాగుతున్నాయి. అందులోనూ కడప నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో అసమ్మతి, ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. మరోవైపు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి లభిస్తున్న మద్దతు చూడలేక పోతున్నారు. ఎలాగైనా ఆ పార్టీ నాయకులను అణచి వేయడానికి ఎంతటికై నా తెగిస్తున్నారు. మరోవైపు సొంత పార్టీలోనే తమ్ముళ్లు పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే మాధవీరెడ్డి అనుచర వర్గం తీవ్ర అసంతృప్తికి, ఆందోళనకు గురై అరాచకాలకు పాల్పడుతున్నారని అందరూ భావిస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రజాదరణ చూసి ఆందోళన

మొదటి నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అంటే ప్రజల్లో అమితమైన ఆదరణ లభిస్తోంది. ఇది గమనించిన కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి, వారి అనుచర వర్గానికి తమ భవితవ్యంపై ఆందోళన పట్టుకుంది. అందులో భాగంగా ప్రతిపక్ష పార్టీ కార్పొరేటర్‌ అభ్యర్థులను కనీసం నామినేషన్‌ కూడా వేయకుండా బహిరంగంగానే అడ్డుకున్నారు. కర్రలతో దాడులు చేశారు. అందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. నామినేషన్‌ తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్‌ అభ్యర్థులకు ఎన్నికల ప్రచారంలో స్థానికుల నుంచి కనీవినీ ఎరుగని రీతిలో మద్దతు లభిస్తోంది. ఇది చూసి ఎమ్మెల్యే మాధవీరెడ్డి అనుచరులు, టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులు సహించలేక పోతున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు బరిలో ఉంటే తమకు పుట్టగతులు ఉండవని ఎమ్మెల్యే మాధవీరెడ్డి అనుచరవర్గం భావిస్తోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అందుకు ఉదాహరణగా ఆదివారం కడప నగరంలోని 41వ డివిజన్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాజీ కార్పొరేటర్‌ షంషీర్‌తోపాటు షేక్‌ అలీ ఖలీద్‌పై టీడీపీ మూకలు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరచడం పెద్ద సంచలనంగా మారింది. గాయపడిన వారిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, సీఈసీ సభ్యుడు కె.సురేష్‌బాబు పరామర్శించారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. టీడీపీ నేతలు సాగిస్తున్న దమనకాండపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

‘సీనియర్ల’కు వెన్నుపోటు

కడప తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఎమ్మెల్యే మాధవీరెడ్డి, ఆ పార్టీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ శ్రీనివాసులురెడ్డి వర్గం ఒకవైపు, పార్టీలో సీనియర్‌ నాయకుల వర్గం మరొక వైపుగా సాగుతోంది. ఎమ్మెల్యే మాధవీరెడ్డి, శ్రీనివాసులురెడ్డి అనుసరిస్తున్న విధానాలపై.. ప్రతి విషయంలోనూ పార్టీలో మొదటి నుంచి ఉన్న సీనియర్‌ నేతలు బహిరంగంగానే దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో వారి మధ్య ‘పచ్చ’గడ్డి వేస్తే భగ్గుమనేలా వర్గ రాజకీయాలు సాగుతున్నాయి. సీనియర్లు కార్పొరేటర్‌ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని నెత్తినోరు కొట్టుకుని అభ్యర్థించినా వినే నాథుడే కరువయ్యాడని తమ్ముళ్లు వాపోతున్నారు. సీనియర్‌ నాయకులు ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి, హరిప్రసాద్‌, మైనార్టీ నాయకులు అమీర్‌బాబు తదితరులకు ఈ ఎన్నికల్లో మొండిచేయి లభించింది. అలాగే కడప మేయర్‌ అభ్యర్థిగా సువర్ణను ఏకపక్షంగా నిర్ణయించడం పట్ల పార్టీలోని అసంతృప్తి కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు. కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎమ్మెల్యే మాధవీరెడ్డి తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని అభ్యర్థులను ప్రకటించుకోవడం పట్ల.. ఆ పార్టీలో అసమ్మతి మంటను మరింతగా రాజేసినట్లయింది. ఈ నేపథ్యంలో మాధవీరెడ్డి అనుచరవర్గం తీవ్ర అసంతృప్తి చెందడంతోపాటు తమ రాజకీయ భవితవ్యంపై ఆందోళన చెంది దాడులకు తెగబడుతున్నారనే ప్రచారం ఆ పా ర్టీతోపాటు ప్రజల్లో కూడా జోరుగా కొనసాగుతోంది.

వైఎస్సార్‌ీసీపీకి లభిస్తున్న మద్దతు

ఓర్వలేక అసహనం

ఆ పార్టీ కార్యకర్తలపై కత్తిపోట్లు, దాడులు

టీడీపీలో సీనియర్లకు ‘పచ్చ’టోపీ

ఏకపక్షంగా మేయర్‌గా సువర్ణ అభ్యర్థిత్వంపై తమ్ముళ్ల ఆగ్రహం

కడప టీడీపీ నేతల్లో భవితవ్యంపై

ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement