కడప ఎడ్యుకేషన్ : ‘తెలుగు సూర్యుడు’ సి.పి.బ్రౌన్ అనే మట్టిలోని మాణిక్యాన్ని వెలికితీసిన అపర భగీరథుడు డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు అన్నారు. సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలోని బ్రౌన్ శాస్త్రి సమావేశ మందిరంలో ఆదివారం డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి 101వ జయంతి, అలాగే 15వ గ్రంథాలయ, సాహిత్య సేవా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని జానమద్ది సాహితీ పీఠం వారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా జానమద్ది చిత్రపటానికి అతిథులు పూలమాలను సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం జానమద్ది సాహితీ పీఠం ఆధ్వర్యంలో లంకా సూర్యనారాయణ, డాక్టర్ శాంతి నారాయణకు గ్రంథాలయ, సాహిత్య సేవా పురస్కారాలు ప్రదానం చేశారు. జానమద్ది సాహితీ పీఠం కార్యదర్శి జానమద్ది యామిని కార్యదర్శి నివేదికను సమర్పించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ సి.పి.బ్రౌన్ వేమనను వెలుగులోకి తేగా.. జానమద్ది హనుమచ్ఛాస్త్రి బ్రౌన్‌ను విశ్వవ్యాప్తం చేశారన్నారు. తల్లిదండ్రులను అనాథ శరణాలయాలకు పంపిస్తున్న నేటి తరానికి విజయ భాస్కర్ లాంటి వాళ్లు స్ఫూర్తి ప్రదాతలన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ఆచార్య జి.ఎన్.రెడ్డి, బంగోరెల పరిశోధన ఫలితంగా గుర్తించిన బ్రౌన్ బంగళా శిథిలాలపై సి.పి.బ్రౌన్ స్మారక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిన హనుమచ్ఛాస్త్రి చిరస్మరణీయుడన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ మాట్లాడుతూ గ్రంథాలయాన్ని నిర్మించిన జానమద్ది ధన్యజీవి అని అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామగోపాల్ మాట్లాడుతూ ఒక ఉపాధ్యాయుడు సామాజిక స్పృహతో ఒక మంచి పని చేస్తే ఎలాంటి ఉన్నత ఫలితం లభిస్తుందో నిరూపించిన గొప్ప వ్యక్తి హనుమచ్ఛాస్త్రి అని అన్నారు. కొప్పరపు కవుల మనుమడు మాశర్మ ‘కొప్పరపు కవుల అవధాన వైభవం’ అనే అంశంపై మాట్లాడుతూ అవధానం తెలుగుజాతి సంతకమని, అలాంటి అవధానానికి వన్నెతెచ్చిన కవిపుంగవులు కొప్పరపు కవులని అన్నారు. పురస్కార గ్రహీత, అన్నమయ్య గ్రంథాలయ వ్యవస్థాపక నిర్వాహకులు లంకా సూర్యనారాయణ మాట్లాడుతూ రెండు దశాబ్దాల నాడు బ్రౌన్ గ్రంథాలయంలో జానమద్దిని కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. మరో పురస్కార గ్రహీత, ప్రముఖ కథారచయిత శాంతి నారాయణ తన స్పందన తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని జానమద్ది సాహితీపీఠం మేనేజింగ్ ట్రస్టీ జానమద్ది విజయభాస్కర్ సమన్వయం చేశారు. నిర్వాహకులు అతిథులను, అలానే పోతుల వెంకట్రామిరెడ్డి, గునిశెట్టి సాయికుమార్, యలమర్తి మధుసూదన్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జానమద్ది కుటుంబ సభ్యులు, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య గంజి పార్వతి, సిబ్బంది డా.చింతకుంట శివారెడ్డి , డా.భూతపురి గోపాల కృష్ణ శాస్త్రి, ఆచార్య సుబ్బారెడ్డి, షేక్ ఇంతియాజ్, డా.అంకే శ్రీనివాస్, అడవాల శేషగిరి రాయుడు, టి.సురేష్ బాబు, ఎల్.గోవిందరెడ్డి, డా.వెల్లాల వేంకటేశ్వరాచారి, కొండూరి జనార్దన రాజు, శ్యామసుందర్‌రెడ్డి, రాజారెడ్డి, కొత్తపల్లె రామాంజనేయులు, సూర్యనారాయణ రెడ్డి, గోపాల్, జానమద్ది అభిమానులు పాల్గొన్నారు.
హైకోర్టు న్యాయమూర్తి యడవల్లి లక్ష్మణరావు
గ్రంథాలయ, సాహిత్య సేవా పురస్కారాల ప్రదానం


