వైవీయూ ఆచార్యులకు పరిశోధన పురస్కారం | - | Sakshi
Sakshi News home page

వైవీయూ ఆచార్యులకు పరిశోధన పురస్కారం

Oct 26 2026 2:28 AM | Updated on Oct 26 2026 2:28 AM

వైవీయూ ఆచార్యులకు పరిశోధన పురస్కారం

కడప ఎడ్యుకేషన్‌ : యోగి వేమన విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం ఆచార్యులు డాక్టర్‌ పులి చంద్ర ఓబుల్‌రెడ్డి ప్రతిష్టాత్మక ‘ఏషియన్‌ పీజీపీఆర్‌ సొసైటీ అవార్డ్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ రీసెర్చ్‌’ పురస్కారాన్ని అందుకున్నారు. గోవా రాజధాని పనాజీలో అక్టోబర్‌ 23 నుంచి 25 వరకు జరిగిన 9వ ఏషియన్‌ పీజీపీఆర్‌ అంతర్జాతీయ సదస్సులో ఈ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు. నేలకు, మొక్కలకు మేలు చేసే బ్యాక్టీరియాపై పరిశోధన చేసే శాస్త్రవేత్తల సంస్థ ఏషియన్‌ పీజీపీఆర్‌ సొసైటీ.. వ్యవసాయంలో ఈ బ్యాక్టీరియా వినియోగంపై కూడా దృష్టి పెడుతుంది. ‘రెండో హరిత విప్లవానికి జీవ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు’ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది సదస్సు జరిగింది.

పరిశోధన ఏమిటంటే..

మొక్కల లోపల నివసిస్తూ వాటి ఎదుగుదలకు తోడ్పడే ‘మంచి బ్యాక్టీరియా’పై చంద్ర ఓబుల్‌రెడ్డి పరిశోధనలు చేస్తున్నారు. రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు రెండు: నీటి కొరత (కరువు), నేలలో పెరుగుతున్న ఉప్పు శాతం. వాతావరణ మార్పుల వల్ల ఈ రెండు సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఈ రెండు సమస్యలను తట్టుకునేలా పంటలకు సహాయ పడతాయని ఆయన పరిశోధనలు చెబుతున్నాయి. ఉప్పు నీటిలో సహజంగా పెరిగే మడ అడవుల(మ్యాంగ్రూవ్స్‌) నుంచి ఆయన బ్యాక్టీరియాను సేకరించారు. ఉప్పును తట్టుకునే ఈ బ్యాక్టీరియాను వేరుశనగ, వరి మొక్కలకు అందించగా, అవి ఉప్పు నేలల్లోనూ మెరుగ్గా పెరిగాయి. పలు రకాల బ్యాక్టీరియాలను కలిపి వాడినప్పుడు ఇంకా మంచి ఫలితాలు వచ్చాయి. ఈ పరిశోధన అంతర్జాతీయ జర్నల్‌ ‘ప్లాంట్స్‌‘లో ప్రచురణకు ఆమోదం పొందింది. వేరుశనగ, వరి వంటి పంటలు బాగా ఎదిగి కరువును తట్టుకునేందుకు తోడ్పడే బ్యాక్టీరియాను కూడా ఆయన గతంలో గుర్తించారు.

రైతులకు ప్రయోజనం...

భవిష్యత్తులో ఈ బ్యాక్టీరియాను సహజమైన, పర్యావరణహిత ఉత్పత్తులుగా రైతులకు అందించవచ్చు. ఇవి కరువును, ఉప్పు నేలలను తట్టుకునేలా వేరుశనగ, వరి వంటి పంటలకు సహాయపడతాయి. కరువు ప్రాంతమైన రాయలసీమకు, నేలలు ఉప్పుబారుతున్న తీర ప్రాంతాలకు ఈ పరిశోధన ఎంతో ముఖ్యమైనది. పురస్కారం అందుకున్న డా. చంద్రఓబుల్‌రెడ్డిని యోగి వేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్‌, రెక్టార్‌ ఆచార్య ఏ.జి.దాము, ప్రిన్సిపాల్‌ ఆచార్య టి.శ్రీనివాస్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య ఎన్‌.సి.గంగిరెడ్డి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement