● నివాళులు అర్పించిన నేతలు
చక్రాయపేట : మండల పరిధి సురభి గ్రామ పంచాయతీలోని నాగలగుట్టపల్లెలో శనివారం రాత్రి దేవర దున్నపోతు పొడవడంతో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త బషీర్(45) మృతి చెందాడు. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బాల తిమ్మయ్యగారిపల్లెకు చెందిన దేవర దున్నపోతు నాగలగుట్టపల్లెకు వచ్చింది. దీంతో రాత్రి పూట ఇబ్బందులు ఎదురవుతూ ఉండటంతో.. ఎక్కడ తమ పశువులపై పడుతుందోనని భావించి దాన్ని తోలడానికి ప్రయత్నించాడు. అది తిరగబడి ఒక్క సారిగా బషీర్‌పై దాడికి దిగి పొడిచింది. తీవ్ర గాయాలు కావడంతో కుటుంబీకులు వెంటనే వేంపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా.. మార్గంమధ్యలోనే మృతి చెందా డు. అందరితో కలసి మెలసి ఉండే బషీర్ చనిపోయిన విషయం తెలియగానే నాగలగ్టుపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అనాథలను అక్కున చేర్చుకుని..
బషీర్ బంగారు దుకాణాల్లో కూలి పని చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అయితే ఎవరైనా బంధువుల ఇళ్లలో తల్లిదండ్రులు లేని అనాథలు అని తెలిస్తే.. అక్కున చేర్చుకునే వాడు. వారికి చదువులు చెప్పించి వివాహాలు కూడా చేశాడు. ప్రస్తుతం తండ్రి లేని ఓ బాలికను అక్కున చేర్చుకొని కంటికి రెప్పలా కాపాడుకుంటూ చదివిస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య గౌసియాతోపాటు అక్కున చేర్చుకున్న 13 ఏళ్ల బాలిక ఉన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ నేతల నివాళి
నాగలగుట్టపల్లెకు చెందిన బషీర్ మృతి చెందిన విషయం తెలుసుకొని మండల కన్వీనర్ బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మాదవీ బాలకృష్ణ, మండల ఉపాధ్యక్షుడు రాంబాబు, పార్టీ నేతలు శ్రీనివాసులు, ఊరిమిండి సుబ్బయ్య, నాగరాజు, రాజబాబు, రంగారెడ్డి, నాగార్జునరెడ్డి, తులసి, గొంది రమణారెడ్డితోపాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడికి చేరుకుని మృతదేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ బలోపేతానికి బషీర్ చేస్తున్న కృషిని గుర్తుకు తెచ్చుకొని ఉద్విగ్నతకు లోనయ్యారు. మృతుడి కటుంబ విషయాన్ని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆదుకునేలా చేస్తామని వారు తెలిపారు.


