ప్రొద్దుటూరు : మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, పోలీసులు.. ప్రజలంతా అసహ్యించుకునేలా ప్రవర్తించారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. ఆయన గురువారం తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పును ప్రజాస్వామ్య వాదిగా, రాజకీయ నేతగా తాను స్వాగతిస్తున్నానని తెలిపారు. చివరికి నామినేషన్లు కూడా స్వేచ్ఛగా వేయనీయకుండా ప్రజాస్వామ్యాన్ని అవమానించారన్నారు. ఇప్పటికై నా పోలీసులు తీరు మార్చుకోవాలని సూచించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని, తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారన్నారు. నాటి కౌరవ సభలో ద్రౌపతి వస్త్రాపహరణ ఎలా జరిగిందో ప్రస్తుతం అదే రీతిలో ప్రజాస్వామ్యాన్ని నడిబజారులో నగ్నంగా నిలబెట్టారన్నారు. ఇందులో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కళ్లుండి చూడలేని ద్రుతరాష్ట్రుని పాత్రను పోషించారని, ఆయన కుమారుడు కొండారెడ్డి దుర్యోధునడని విమర్శించారు. గోవర్ధన్‌రెడ్డి, అమల్‌రెడ్డి, శంకరాపురం ప్రసాద్‌రెడ్డి, పర్లపాడు మహేశ్వర్‌రెడ్డి, నల్లబోతుల నాగరాజు, తాటి శ్రీను లాంటి వారంతా దుశాస్సుని పాత్రను పోషించారన్నారు. సైంధువుడి పాత్రను పోలీసులు పోషించారన్నారు. 2029లో జరిగే కురుక్షేత్ర సంగ్రామంలో వీరికి రాజకీయ ఓటమి తప్పదన్నారు. వ్యాపారస్తుడైన పోరెడ్డి నరసింహారెడ్డిపై దాడి చేయడం టీడీపీ నేతలకు సిగ్గు అనిపించలేదా అని ప్రశ్నించారు. నామినేషన్ పత్రాలను కార్యాలయానికి తీసుకొచ్చిన పిట్టా భద్రమ్మ, గరిశపాటి లక్ష్మీదేవి, పల్లా లక్ష్మీదేవి, లావణ్య, ఫాతిమా ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా నంద్యాల కుటుంబీకులు బాధపెట్టారన్నారు. బురఖాలో కూడా చేతులు పెట్టి పత్రాలు లాక్కున్నారని, ఇంతటి దయనీయమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా అన్నారు. ఎంత మంది పోలీసులు ఉన్నా నోరు మెదపలేదన్నారు. ఇంత నీచానికి ఒడిగట్టడం దారుణమైన విషయమన్నారు.
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి


