ప్రొద్దుటూరు : టీడీపీ తరపున ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా నంద్యాల రాఘవరెడ్డి పేరును ఎట్టకేలకు ఆ పార్టీ నేతలు ఖరారు చేశారు. గత కొన్ని రోజులుగా అభ్యర్థి ఎంపిక కోసం విడతల వారిగా చర్చలు జరుగుతున్నాయి. చివరికి రాఘవరెడ్డి పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మున్సిపల్ ఓటర్ల జాబితాలో ఆయన పేరు లేకపోవడం చర్చాంశనీయంగా మారింది. ఇదే విషయంపై టీడీపీ నేతలు గురువారం కలెక్టరేట్‌కు వెళ్లి ప్రయత్నించినట్లు సమాచారం. అయితే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్ని ప్రయత్నాలు చేసినా వీరి ఓటు చెల్లే పరిస్థితి లేదని అధికార వర్గాలు తెలిపాయి. ప్రొద్దుటూరు మండలంలోని కామనూరు గ్రామ పంచాయతీ రాధానగర్‌లోని పోలింగ్స్టేషన్లో రాఘవరెడ్డికి ఓటు హక్కు ఉండేది. సర్ ప్రక్రియలో భాగంగా ఆయన ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని అనిబిసెంట్ హైస్కూల్ ప్రాంగణంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఫారం 8 ద్వారా తన ఓటు బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఈ ఏడాది జవవరిలో ప్రచురించిన ఓటర్ల జాబితాలో ఉన్న పేరు ఉంటేనే ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. సర్ ప్రక్రియలో దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం లేదు. పైగా ఈ నెలాఖరు వరకు సర్ ప్రక్రియను పొడిగించారు. ప్రక్రియ ముగిసిన అనంతరం కొత్త ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. కానీ ఈనెల 28న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రకారం ఈయనకు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. అలాగే రాజుపాళెంలోని పర్లపాడు గ్రామానికి చెందిన తోట మహేశ్వరరెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గోకుల్ నగర్లో నివాసం ఉంటున్నారు. ఆయన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పోలింగ్ బూత్‌లో ఇదే ప్రకారం ఓటు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈయనకు కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయి. రాఘవరెడ్డి అభ్యర్థిత్వాన్ని బుధవారం రాత్రి ఖరారు చేసిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి చివరిలో ఈ విషయాన్ని తెలుసుకున్నారు. గురువారం తమ సిబ్బందిని కలెక్టరేట్ కార్యాలయానికి పంపి ప్రయత్నించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకారం ఓటు మార్పు సాధ్యం కాదని తెలుస్తోంది. వరదరాజులరెడ్డి కుమార్తె మెట్టుపల్లి అనురాధ ఓటు గోపవరం పంచాయతీ పరిధిలోని హౌసింగ్ బోర్డులో ఉంది. ఈమె కూడా మున్సిపాలిటీలో పోటీ చేసేందుకు అవకాశం లేదు. ‘సర్’ ప్రక్రియలో భాగంగా మున్సిపాలిటీలో ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకున్నామని, అవకాశం కల్పించాలని రాఘవరెడ్డి మున్సిపల్ కమిషనర్‌కు లేఖ రాసినట్లు సమాచారం.కోర్డుకు వెళ్లే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలిసింది.
వరద పరిస్థితి అనుకున్నది ఒకటి..అయిందొకటి
ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పరిస్థితి అనుకున్నది ఒకటి.. అయింది మరొకటిలా ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఆయన గురువారం పార్టీ కౌన్సిలర్ల అభ్యర్థుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు రావాల్సిన ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఓసీలకు వచ్చేలా ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రయత్నించారన్నారు. చైర్మన్ అభ్యర్థిగా తన తమ్ముడు రాఘవరెడ్డిని పెట్టాలని ప్రయత్నించి విఫలమయ్యారన్నారు. ఆయన ఒకటి అనుకుంటే దేవుడు మరొకటి తలచారని రాచమల్లు తెలిపారు.
నంద్యాల రాఘవరెడ్డితో
పాటు ఆ నేతల ఓట్లు చెల్లవు!
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో
పటాపంచలైన ’కూటమి’ వ్యూహాలు


