ప్రమాదంలో గాయపడిన యువతి మృతి | - | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో గాయపడిన యువతి మృతి

Oct 16 2026 7:17 AM | Updated on Oct 16 2026 7:17 AM

మైదుకూరు : రోడ్డు ప్రమాదంలో గాయపిన కడప రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయగిరి వెంగమ్మ (23) అనే యువతి గురువారం ఉదయం మృతి చెందింది. మండలంలోని వనిపెంట బైపాస్‌ రోడ్డుపై తోటి కూలీల కోసం ఎదురుచూస్తున్న వెంగమ్మను ఆటో ఢీకొట్టగా తలకు, కాళ్లకు తీవ్ర రక్తగాయాలు అయిన విషయం తెలిసిందే. మైదుకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చిన ఆమెను మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. సంఘటనపై మృతురాలి తండ్రి నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైదుకూరు అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లారీ బోల్తా: ఒకరికి గాయాలు

ముద్దనూరు: ముద్దనూరు–కడప రహదారిలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలో గురువారం ఐరన్‌ సాఫ్ట్‌ల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. చైన్నె నుంచి వస్తున్న ఈ లారీ రోడ్డు పక్కన పడిపోవడంతో లారీలో ఉన్న రాజేష్‌ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

కోడలు, మనవడి వేధింపులు

● ఆర్డీఓకు వృద్ధుల ఫిర్యాదు

జమ్మలమడుగు రూరల్‌: నలుగురు కొడుకులను పెంచి పెద్దేసి, వివాహాలు జరిపించిన ఆ వృద్ధ దంపతులకు ఆఖరి దశలో వేధింపులే మిగిలాయి. కన్నబిడ్డలు ఆదరించకపోగా, కోడలు, మనవడు పెడుతున్న హింసలు భరించలేక వారు న్యాయం కోసం జమ్మలమడుగు ఆర్డీఓ శిరీషను ఆశ్రయించారు. గురువారం కార్యాలయంలో ఆర్డీఓను కలిసిన చాపాడు మండలం వీరాజుపాలెం గ్రామానికి చెందిన చిన్న శేషారెడ్డి, జయమ్మ దంపతులు తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. బాధితుల కథనం మేరకు.. వృద్ధ దంపతులకు నలుగురు కుమారులు. గత కొంతకాలంగా వారు మూడో కుమారుడు చంద్రశేఖర్‌రెడ్డి వద్ద ఉంటున్నారు. తాము సంపాదించిన డబ్బునంతా ఇవ్వడంతో చంద్రశేఖర్‌రెడ్డి ఒక ఇల్లు నిర్మించుకున్నాడు. అయితే కొన్ని నెలల క్రితం అతను మృతి చెందాడు. కుమారుడి మరణం తర్వాత కోడలు, మనవడు కలిసి డబ్బుల కోసం తమను తీవ్రంగా వేధిస్తున్నారని వృద్ధ దంపతులు ఆర్డీఓ ఎదుట కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు స్థానిక పోలీసులను ఆశ్రయించినా తమకు న్యాయం జరగలేదని వారు వాపోయారు. స్పందించిన ఆర్డీఓ శిరీష బాధితుల సమస్యను సానుకూలంగా విన్నారు. తక్షణమే సంబంధిత మండల తహసీల్దార్‌, పోలీస్‌ అధికారులతో ఫోన్‌ లో మాట్లాడి, వృద్ధ దంపతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement