గోపవరం: మండలంలోని రాచాయపేట గ్రామంలో గురువారం సాయంత్రం 10 అడుగుల భారీ కొండచిలువ ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా గ్రామంలో కోళ్లు మాయమవుతుండటంతో గ్రామస్తులు నిఘా పెట్టారు. గురువారం ఈ కొండచిలువ ఒక్కసారిగా కంటపడటంతో, గ్రామస్తులు దానిని కొట్టి చంపేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
పిడుగుపాటుతో
మహిళ మృతి
బి.కోడూరు : మండలంలోని గుంతపల్లె గ్రామానికి చెందిన గవిరెడ్డిఅమరావతి (36) గురువారం సాయంత్రం కురిసిన గాలివానకు పిడుగు పడటంతో పిడుగుపాటుకు గురై పొలంలోనే మృతిచెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు తన పొలంలో మిరపకోతకు తోటి కూలీలను తీసుకెళ్లి పని చేస్తుండగా ఉన్నట్లుండి గాలివాన రావడంతో కూలీలంతా ఇంటి ముఖం పట్టారు. చివరగా అమరావతి వస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో పొలం వద్దనే కుప్పకూలింది. ఆమెకు భర్తతో పాటు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.
సబ్ రిజిస్ట్రార్ అధికారులపై కేసుల ఉపసంహరణ
కడప కోటిరెడ్డి సర్కిల్ : జమ్మలమడుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గతంలో పనిచేసిన అధికారులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నమోదైన కేసులను ప్రభుత్వం ఉపసంహరించినట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 2021 సెప్టెంబర్ 3న జమ్మలమడుగు సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేసి అవకతవకలు చోటు చేకున్నాయని అప్పటి అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించారు. అయితే ఈ వ్యవహారంలో సుధీర్గంగా సాగిన శాఖాపరమైన విచారణ నివేదికను రిజిస్ట్రేషన్ స్టాంప్స్ ఐజీ ప్రభుత్వానికి సమర్పించారు. అయితే అప్పటి సబ్ రిజిస్ట్రార్ రామలక్ష్మిదేవి అనంతపురం జిల్లాలో పనిచేసి పదవీవిరమణ పొందారు. సీనియర్ అసిస్టెంట్ సునీల్ కుమార్ ప్రస్తుతం అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లెలో ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నారు. మరో ఆఫీసు సబార్డినేట్ చరిత ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్నారు. అయితే వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించినా ఆరోపణలు నిరూపణ కాకపోవడంతో తదు పరి ఉత్తర్వులు పూర్తి విరమిస్తూ కేసును ముగిస్తున్నట్లుగా తాజాగా ఉత్తర్వులో పేర్కొన్నారు.


