పులివెందుల టౌన్ : పులివెందులలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు తనిఖీ నిర్వహించారు. 2018లో కార్యాలయంలో జరిగిన ఏసీబీ దాడులకు సంబంధించిన కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణకు రావడంతో, అందులో నమోదైన అభియోగాలపై అధికారులు వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. 2018లో పులివెందుల సబ్ రిజిస్ట్రార్‌గా బాలాజీ, సీనియర్ అసిస్టెంట్‌గా దస్తగిరి పనిచేస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు కార్యాలయంలో దాడులు నిర్వహించారు. అప్పట్లో కార్యాలయంలోని అధికారులు, డాక్యుమెంట్ రైటర్ల నుంచి సుమారు రూ.1.17 లక్షల నగదును స్వాధీనం చేసుకుని పలువురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టు విచారణ దశకు రావడంతో కేసులో ఉన్న సంబంధిత అధికారులు, డాక్యుమెంట్ రైటర్లను ఏసీబీ అధికారులు పిలిపించి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. అనంతరం 2018లో రిజిస్ట్రేషన్‌న్ చేసిన పత్రాలను పరిశీలించారు. తనిఖీల సమయంలో అప్పట్లో పనిచేసిన బాలాజి, దస్తగిరి కూడా అక్కడ ఉన్నట్లు తెలిసింది.


