బద్వేలు అర్బన్: కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కడప జిల్లా బద్వేలుకు చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ నుంచి బద్వేలుకు వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొనడంతో ఈ విషాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పెరుమాళ్ళ పోలయ్య (56), కత్తి రామాంజనేయులు అలియాస్ నాని (19) మరణించారు. బద్వేలు ఆంజనేయనగర్‌కు చెందిన బియ్యం వ్యాపారి పోలయ్య పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలైన ఆయన్ను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ కన్నుమూశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, జ్యోతిబసు కాలనీకి చెందిన నాని ఆటో నడుపుతూ జీవించేవాడు. ప్రమాదానికి గురైన బస్సుకు ఇతని తండ్రి డ్రైవర్‌గా చేస్తుండటంతో, నాని కూడా కొద్దిరోజులుగా క్లీనర్‌గా వెళ్తున్నాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై నాని అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామమైన ప్రకాశం జిల్లా దర్శికి తరలించారు.


