ఎంపీ విశేష కృషి
● రూ.6 కోట్లతో 50 పడకల ఆధునిక భవన నిర్మాణానికి టెండర్లు పూర్తి
● మెరుగైన సౌకర్యాలతో
క్రూ సెంటర్‌కు కొత్త శోభ
● బ్రిటిషు కాలం నాటి రన్నింగ్ రూమ్‌కు
మంగళం
రాజంపేట: ఉమ్మడి కడప జిల్లాలో రైల్వేపరంగా ఎంతో ప్రసిద్ధి చెందిన నందలూరు రైల్వే కేంద్రంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన నవీన రన్నింగ్ రూమ్ నిర్మాణానికి రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది. శతాబ్దాల చరిత్ర కలిగిన బ్రిటీష్ కాలం నాటి పాత రన్నింగ్ రూమ్‌కు మంగళం పాడుతూ.. లోకో పైలట్లు, గార్డులు విశ్రాంతి కోసం సరికొత్త హంగులతో ఈ నూతన భవనాన్ని నిర్మించనున్నారు. 2024 రైల్వే బడ్జెట్‌లో ఈ పనులకు రూ.3.35 కోట్ల నిధులు కేటాయించగా, ఇప్పుడు గుంతకల్ డివిజన్ రైల్వే ఉన్నతాధికారులు నిర్మాణ కార్యాచరణను వేగవంతం చేశారు.
పాత పీడబ్ల్యూఐ స్థలం ఎంపిక
ఈ నవీన రన్నింగ్ రూమ్ నిర్మాణం కోసం రైల్వే ఉన్నతాధికారులు నాగిరెడ్డిపల్లె రైల్వే కాలనీలోని పాత రైల్వే హాస్పిటల్ స్థలంతో పాటు పలు ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే, నిరంతరం విధుల్లో ఉండి అలసిపోయే లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో తగిన విశ్రాంతి లభించేలా ఈ భవనం ఉండాలని అధికారులు భావించారు. ఆ దిశగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉండి, రైల్వే స్టేషన్‌కు అత్యంత సమీపంలో ఉన్న పాత పీడబ్ల్యూఐ స్థలాన్ని ఈ నవీన రన్నింగ్ రూమ్ నిర్మాణం కోసం తుది ఎంపిక చేశారు.
రూ.6 కోట్లతో నూతన భవనాలు
నందలూరు నవీన రన్నింగ్ రూమ్ నిర్మాణంతో పాటు రాజంపేట రైల్వేస్టేషన్‌లో ఆర్‌పీఎఫ్ అవుట్‌పోస్ట్ భవన నిర్మాణాన్ని కలిపి దాదాపు రూ.6 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి గుంతకల్ రైల్వే డివిజన్ ఉన్నతాధికారులు ఇప్పటికే అధికారికంగా టెండర్లను పిలిచారు. టెండర్ దక్కించుకోనున్న కాంట్రాక్ట్ సంస్థకు ఏడాది కాల పరిమితిని గడువుగా పెట్టినట్లు సమాచారం. గతంలో ఇండియన్ రైల్వేలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఏసీ రన్నింగ్ రూమ్ కోసం నిధులు మంజూరైనా.. ఆ ప్రతిపాదనను పక్కనపెట్టి, ఇప్పుడు ఈ సరికొత్త శాశ్వత భవన నిర్మాణానికి సిద్ధమయ్యారు. ప్రాథమికంగా 50 పడకలతో ప్రారంభమై, భవిష్యత్తు అవసరాలను బట్టి దీనిని వంద పడకల రన్నింగ్ రూమ్‌గా విస్తరించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
105 ఏళ్ల చారిత్రక రన్నింగ్ రూమ్ జ్ఞాపకాలు
నందలూరు రైల్వే రన్నింగ్ రూమ్‌కు 105 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది. 1920వ సంవత్సరంలో అప్పటి బ్రిటిషు రైల్వే పాలకులు ఇక్కడి స్టీమ్ లోకో ఇంజన్ల డ్రైవర్లు, ఫైర్‌మెన్ల విశ్రాంతి కోసం ఈ రన్నింగ్ రూమ్‌ను నిర్మించారు. అప్పట్లో ఇక్కడ 25 వరకు స్టీమ్ లోకో ఇంజన్లు అందుబాటులో ఉండేవి. ఆ కాలంలో నందలూరు రైల్వే కేంద్రం సదరన్ రైల్వే పరిధిలో ఉండటం వల్ల అరక్కోణం నుంచి నందలూరు వరకు రైల్వే క్రూ రాకపోకలు సాగించేవారు. అరక్కోణం నుంచి వచ్చే తమిళ రైల్వే సిబ్బంది ఇక్కడే స్థిరపడటం వల్లనే, నందలూరు స్టేషన్‌కు అత్యంత సమీపంలో ‘అరవపల్లె’ అనే చారిత్రక గ్రామం ఆవిర్భవించింది. నిత్యం లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు, గార్డులు మార్పిడి జరిగే ఈ క్రూ సెంటర్‌కు, నవీన రన్నింగ్ రూమ్ నిర్మాణంతో సరికొత్త శోభ చేకూరనుంది.
ఎర్రగంట్ల కష్టాలకు చెల్లు
ఒకానొక దశలో ఎర్రగుంట్లలో క్రూ సెంటర్ ఏర్పాటు చేసి, నందలూరు రన్నింగ్ క్రూ సెంటర్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ఓ రైల్వే ఉన్నతాధికారి తీవ్ర వ్యూహం రచించారు. అయితే ఎర్రగుంట్ల నుంచి పనిచేయడానికి లోకో పైలట్లు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. అక్కడ వాతావరణం సరిపడక కొంతమంది సిబ్బంది ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడి ఇతర డిపార్టుమెంట్లకు మారిపోయారు. అయితే ఇప్పుడు నందలూరులో నూతన విశ్రాంతి భవనం రానుండటంతో వారి కష్టాలకు చెల్లుచీటీ పాడినట్లయింది.
నందలూరు రైల్వే రన్నింగ్‌స్టాప్ క్రూ కుదింపు వ్యవహారంపై రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి గట్టిగా పోరాడారు. కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ను అనేకమార్లు కలిసి ఇక్కడి సమస్యలను వివరించారు. నందలూరు రైల్వే పూర్వవైభవం కోసం లోక్‌సభలో సైతం ఆయన గళమెత్తిన తర్వాత నుంచే రైల్వేశాఖ ఇక్కడ మెరుగైన వసతులు కల్పించే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.


