కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం(వైవీయూ)లో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ జర్నలిజం (ఎంఏ) కోర్సుకు సంబంధించిన ప్రవేశాలు మొదలైనట్లు కోర్స్ కో–ఆర్డినేటర్, జర్నలిజం శాఖ విభాగాధిపతి తమ్మినేని శ్యామ్ స్వరూప్ తెలిపారు. ఏపీ పీజీ సెట్‌లో జర్నలిజం కోర్స్‌కు నమోదు చేసుకుని ర్యాంకు సాధించిన వారు వైవీయూలో ఆప్షన్స్ ఇచ్చి కోర్సులో చేరవచ్చని తెలిపారు. ఏ డిగ్రీ అర్హత ఉన్నా జర్నలిజం కోర్సులో అడ్మిషన్ పొందవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 8008006630, 9640895256 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
వైఎస్సార్‌సీపీలో నూతన నియామకం
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన దిగువ పేర్కొన్న వారిని వివిధ హోదాలలో నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శిగా పి. జోగయ్య, రాష్ట్ర చేనేత విభాగం కార్యదర్శిగా పుల్లగూర ఉపేంద్ర(మైదుకూరు), జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడిగా డి.యు కిరణ్ కుమార్‌రెడ్డి(పులివెందుల), జిల్లా అంగన్‌వాడీ విభాగం అధ్యక్షురాలిగా రాచమల్లు రమాదేవి,జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా బీరం రాఘవేంద్రరెడ్డి, జిల్లా వైఎస్సార్‌టీయూసీ అధికార ప్రతినిధిగా వై. ప్రసన్న కుమార్ (ప్రొద్దుటూరు)లను నియమించారు.
జెడ్పీ ప్రత్యేకాధికారిగా
కలెక్టర్ బాధ్యతలు
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీకాలం ఇటీవల ముగిసిన నేపథ్యంలో జిల్లా పరిషత్ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు జిల్లా పరిషత్‌లకు ప్రత్యేకాధికారులను నియమించగా, కడప జెడ్పీ ప్రత్యేకాధికారిగా జిల్లా కలెక్టర్ బాధ్యతలు చేపట్టారు. జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకున్న కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరికి జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సుబ్రహ్మణ్యం, అధికారులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జెడ్పీ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్ చెరుకూరి జిల్లా పరిషత్ కు సంబంధించి పలు అంశాలపై జెడ్పీ సీఈఓ తో చర్చించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలను ప్రణాళిక ప్రకారం చేపట్టాలని, ప్రతి ఒక్కరూ ఎన్నికల విధులను పారదర్శకంగా నిర్వహించేందుకు బా ధ్యతగా పనిచేయాలని ఎన్నికల విధులకు కేటాయించిన డాక్టర్ శ్రీధర్ సూచించారు. అదే సమయంలో ఎంపీపీల పదవీకాలం కూడా ముగియడంతో వారి స్థానంలో అన్ని మండలాలకు ప్రత్యేక అధికారులను కూడా నియమించారు.


