● ప్రైవేటుకు ధీటుగా బీఎస్‌ఎన్‌ఎల్
నెట్‌వర్క్ సేవలు అందించాలి
● 21 గ్రామాల్లో బలహీనంగా సిగ్నల్
● ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో ప్రైవేటుకు ధీటుగా బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు అందించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. జిల్లాలోని 26 మండలాల పరిధిలోగల 21 గ్రామాల్లో అంతరాయం లేని మొబైల్ కనెక్టివిటీ అందించాలని, 79 గ్రామాల్లో నెట్‌వర్క్ సామర్థ్యాన్ని విస్తరించాలని కోరారు. బుధవారం కడపలో నిర్వహించిన టెలికాం అడ్వయిజరీ కమిటీ సమావేశంలో బీఎస్‌ఎన్‌ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ షేక్ ముజీబ్‌బాషాకు ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ యూఎస్‌ఓఎఫ్ స్కీమ్ ద్వారా కొత్త 4జీ టవర్ ఏర్పాటు చేసి నెట్‌వర్క్ లేని గ్రామాలకు కనెక్టివిటీ కల్పించాలంటూ గతంలో రెండు సార్లు, ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేది కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు విన్నవించానని పేర్కొన్నారు. జిల్లాలో 100 గ్రామాల కు కనెక్టివిటీ సౌకర్యం కల్పించాలని తాను కేంద్ర మంత్రికి విన్నవించినట్లు వివరించారు. దీంతో 21 గ్రామాలకు మొబైల్ కనెక్టివిటీ కల్పించారని పేర్కొన్నారు. ఈ గ్రామాల్లో నెట్‌వర్క్ సిగ్నల్ బలహీనంగా ఉందన్నారు. నిరంతరం సేవల్లో ఏర్పడుతున్న అంతరాయాలను తొలగించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. మొబైల్ సేవలు బలహీనంగా ఉన్న 21 గ్రామాలు, కనెక్టివిటీ లేని 79 గ్రామాల ప్రజలు ప్రభుత్వ పథకాలు, సేవలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. విద్యార్థులపై ఈ ప్రభావం తీవ్రంగా ఉందని తెలిపారు. మొబైల్ కనెక్టివిటీ కల్పించడం కోసం 4జీ టవర్లు ఏర్పాటు చేయాలని, నెట్‌వర్క్ సామర్థ్యాన్ని మరిన్ని గ్రామాలకు విస్తరించాలని విజ్ఞప్తి చేశారు.


