– ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్
సిద్దవటం: ప్రజలకు మెరుగైన సేవలు అందజేయాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. సిద్దవటం మండలం భాకరాపేట సమీపంలోని 11వ బెటాలియన్‌లో శిక్షణ పొందుతున్న 548 కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌కు సంబంధించి నిర్వహించిన రిహార్సల్‌ను బుధవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్ల పరేడ్ కవాతు, డ్రిల్, మార్చింగ్, కమాండ్లకు అనుగుణంగా స్పందించే విధానం, క్రమశిక్షణ, సమన్వయం తదితర అంశాలను ఎస్పీ నిశితంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాసింగ్ అవుట్ పరేడ్‌లో ప్రతి ఒక్కరూ పూర్తి క్రమశిక్షణ, సమయపాలన, ఆత్మవిశ్వాసంతో పాల్గొనాలని సూచించారు. పోలీసు విధుల్లో క్రమశిక్షణ, శారీరక దారుఢ్యంతో పాటు ప్రజల పట్ల బాధ్యత, నిబద్ధత, సేవాభావం అత్యంత కీలకమని పేర్కొన్నారు. శిక్షణలో పొందిన నైపుణ్యాలను భవిష్యత్తులో విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని, అప్పుడే మంచి పేరు వస్తుందని ఆయన సూచించారు. పాసింగ్ అవుట్ పరేడ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 11వ బెటాలియన్ కమాండెంట్ ఆనంద్ రెడ్డి, కడప డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం, బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ రాజశేఖర్, పోలీసు సిబ్బంది, శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.


