దంపతుల ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

దంపతుల ఆత్మహత్య

Sep 24 2026 1:48 AM | Updated on Sep 24 2026 1:48 AM

● భార్య ఉరేసుకోగా.. భర్త రైలు కింద పడి..

● చిలంకూరు ఐసీఎల్‌ కాలనీలో విషాదం

అనారోగ్య సమస్యలు, మానసిక ఆందోళన ఓ కుటుంబంలో కోలుకోలేని విషాదాన్ని నింపాయి. భార్యాభర్తలు ఒకే రోజు వేర్వేరు చోట్ల బలవన్మరణానికి పాల్పడ్డారు.

కుమారుడి భవిష్యత్తుపై ఆందోళనతో భర్త ఇంటి నుంచి వెళ్లిపోగా.. ఆ మనస్తాపంతో భార్య ఇంట్లోనే ఉరి వేసుకుంది. భర్త కడప రైల్వే స్టేషన్‌లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల మండల పరిధిలోని చిలంకూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. దంపతులు కల్లూరు మోహన్‌రెడ్డి, భారతి వేర్వేరు చోట్ల ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ముద్దనూరు మండల పరిధిలోని పెనికలపాడు గ్రామానికి చెందిన కల్లూరు మోహన్‌రెడ్డి చిలంకూరు ఐసీఎల్‌ ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా పని చేస్తూ, తన భార్య భారతితో కలిసి ఐసీఎల్‌ కాలనీలోనే క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరికి గౌతమి, హర్షవర్థన్‌రెడ్డి ఇద్దరు సంతానం. గౌతమికి వివాహం చేశారు. కల్లూరు మోహన్‌రెడ్డి, కల్లూరు భారతి కొంత కాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. తన కుమారుడు హర్షవర్షన్‌రెడ్డి ఉద్యోగంపై అతిగా ఆలోచించిన మోహన్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయంపై తెలిసిన వెంటనే ఆయన భార్య భారతి బంధువులు, తన భర్త స్నేహితుల ద్వారా విచారణ చేయగా ఆచూకీ తెలియరాలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. మృతురాలి కుమార్తె గౌతమి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు.

కడపలో..

కల్లూరు మోహన్‌రెడ్డి ఇంటిలో నుంచి ఎవరికీ చెప్పకుండా కడపకు వెళ్లి రైల్వే స్టేషన్‌లో రైలు కింద పడి చనిపోయినట్లు కడప రైల్వే పోలీసుల ద్వారా తెలిసింది. కుమారుడు హర్షవర్థన్‌రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement