ఐదు నెలల శిశువుకు అరుదైన శస్త్ర చికిత్స | - | Sakshi
Sakshi News home page

ఐదు నెలల శిశువుకు అరుదైన శస్త్ర చికిత్స

Sep 24 2026 1:48 AM | Updated on Sep 24 2026 1:48 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : కడప ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన, క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఐదు నెలల చిన్నారికి రిట్రోపెరిటోనియల్‌ టెరటోమా కణితిని శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా తొలగించారు. చిన్నారి కొంతకాలంగా తరచూ వాంతులతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు కడప ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి స్కానింగ్‌ చేయగా, చిన్నారి కడుపులో సుమారు 15–10 సెంటీమీటర్ల పరిమాణంలో కణితి ఉన్నట్లు గుర్తించారు. కణితి కడుపు, ప్యాంక్రియాస్‌తో పాటు ప్రధాన రక్తనాళాలకు అత్యంత సమీపంలో ఉండటంతో శస్త్రచికిత్స అత్యంత క్లిష్టంగా మారింది. అయినప్పటికీ వైద్య బృందం అత్యంత జాగ్రత్తతో ఈ నెల 17వ తేదీన శస్త్రచికిత్స నిర్వహించింది. ప్రధాన రక్తనాళాలు, కడుపు, ప్యాంక్రియాస్‌కు ఎలాంటి నష్టం కలగకుండా కణితిని వాటి నుంచి వేరు చేసి పూర్తిగా తొలగించారు.శస్త్రచికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యం సంతృప్తికరంగా ఉండటంతో వైద్యుల పర్యవేక్షణలో కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. వైద్యుల వివరాల ప్రకారం, రిట్రోపెరిటోనియల్‌ టెరటోమా చిన్నారుల్లో అత్యంత అరుదుగా కనిపించే కణితుల్లో ఒకటి. సుమారు రెండు లక్షల మంది శిశువుల్లో ఒకరికి ఈ తరహా కణితి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే కణితి పరిమాణం పెరిగి కడుపులోని ఇతర అవయవాలు, ప్రధాన రక్తనాళాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని, కొన్ని సందర్భాల్లో కణితి క్యాన్సర్‌గా మారే ప్రమాదం కూడా ఉంటుందని వైద్యులు వివరించారు. ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను పీడియాట్రిక్‌ సర్జరీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్‌ పి.వి. రమణ, డాక్టర్‌ సుకుమార్‌, డాక్టర్‌ సులక్షణ, మౌనికతో కూడిన బృందం నిర్వహించింది. అనస్థీషియా విభాగానికి చెందిన డాక్టర్‌ రాఘవేంద్ర, డాక్టర్‌ సోమశేఖర్‌ మరియు వారి బృందం శస్త్రచికిత్సకు సహకరించారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ వైద్య బృందాన్ని అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement