ప్రొద్దుటూరు క్రైం : విద్యుత్ వైరు, ట్రాన్స్‌ఫార్మర్‌లోని విలువైన కాపర్ వైరును రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠా వ్యవహారాన్ని ప్రొద్దుటూరు పోలీసులు వెలుగులోకి తెచ్చారు. ఏడాది కాలంగా ప్రొద్దుటూరు, రాజుపాళెం మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో వరుసగా విద్యుత్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని కాపర్ వైర్‌ను చోరీ చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు పట్టుకున్నారు. వీరితో పాటు 15 ఏళ్ల బాలుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ వివరాలను ఏఎస్పీ విభూకృష్ణ బుధవారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించారు. ప్రొద్దుటూరు మండలంలోని సోములవారిపల్లె జగనన్న కాలనీలో విద్యుత్‌వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్ కాపర్‌వైరు చోరీకి గురైనట్లు ఫిర్యాదు రావడంతో ఇటీవల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. ఇందులో భాగంగా నిందితుల కదలికలపై రూరల్ సీఐ నాగభూషణ్, ఎస్‌ఐ రాజు, సిబ్బందితో కలిసి ప్రత్యేక నిఘా పెట్టి వారు సంచరిస్తున్న ప్రాంతానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రొద్దుటూరుకు చెందిన పొలిశెట్టి వెంకటేశ్వర్లు, మద్దికం కృష్ణయ్య, రామాపురం గ్రామానికి చెందిన ముక్కమల్ల మహేష్, చౌటపల్లెకు చెందిన మాలికి సాయికిరణ్, పొలంకి రంగనాయకులుతో పాటు 15 ఏళ్ల బాలుడిని అరెస్ట్ చేశారు. పోలీసులను చూసి నిందితులు పారిపోవడానికి ప్రయత్నించగా వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 5.40 లక్షల నగదు, 56 కిలోల అల్యూమినియం విద్యుత్ వైరు, 5 కిలోల ట్రాన్స్‌ఫార్మర్ కాపర్‌వైరుతో పాటు చోరీకి ఉపయోగించిన ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు ఏఎస్పీ తెలిపారు. కాగా ఘటనా స్థలంలో పారిపోయిన ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నామన్నారు. పట్టుబడిన నిందితులకు సంబంధించి నమోదైన కేసులు, గత నేరచరిత్ర గురించి విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. చోరీ చేసిన విద్యుత్‌వైర్, కాపర్ వైర్లను కొనుగోలు చేసిన గుజరీ వ్యాపారుల పాత్రపై కూడా విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఏడాదిగా చోరీలు చేసే ముఠా గుట్టురట్టు
ఐదుగురు నిందితులు అరెస్ట్
రూ. 5.40 లక్షలు నగదు, విద్యుత్, కాపర్ వైరుతో సహా వాహనాలు స్వాధీనం


