చాపాడు : మండల కేంద్రమైన చాపాడులో స్థల సమస్య విషయంలో ఏర్పడిన వివాదం యువతి ఆత్మహత్యకు దారితీసిన కేసులో నిందితులు పూజారి రమణయ్య, కొండమ్మ, రాజోలి మహేశ్వర్‌రెడ్డి, రాజోలి మధుసూదన్‌రెడ్డిలకు ఏడేళ్లు జైలు శిక్షతోపాటు రూ.10వేలు చొప్పున జరిమానా విధిస్తూ ప్రొద్దుటూరు కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పూజారి కొండయ్య, పూజారి రాముడు కుంటుంబ సభ్యుల మధ్య గత 20 ఏళ్ల నుంచి ఇళ్ల వద్ద ఖాళీ స్థలం వివాదం జరుగుతోంది. ఈ క్రమంలో 2016 జనవరి 22న ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కొండయ్య భార్య లక్షుమ్మ, కూతుర్లు పవిత్ర, స్వప్నపై రమణయ్య, కొండమ్మలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రమణయ్య, కొండమ్మలకు మద్దతుగా మహేశ్వర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి కూడా వచ్చి దాడికి పాల్పడటంతోపాటు దుర్భాషలాడటంతో మనస్తాపం చెందిన కొండయ్య కూతురు పవిత్ర ఇంటిలోకి వెళ్లి కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. ఆమెను ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పవిత్ర తన చావుకు పూజారి రమణయ్య, కొండమ్మ, రాజోలి మహేశ్వర్‌రెడ్డి, రాజోలి మధుసూదన్‌రెడ్డి కారణమని వాంగ్మూలం ఇచ్చి మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నలుగురు నిందితులపై నేరం రుజువు కావడంతో ఏడేళ్లు జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా విధిస్తూ ప్రొద్దుటూరు అదనపు జిల్లా జడ్జి సత్యకుమారి తీర్పు ఇచ్చారు.


