అరటి పొలాలను సందర్శించిన జర్మనీ బృందం | - | Sakshi
Sakshi News home page

అరటి పొలాలను సందర్శించిన జర్మనీ బృందం

Sep 24 2026 1:48 AM | Updated on Sep 24 2026 1:48 AM

లింగాల : మండలంలోని అక్కులగారిపల్లి గ్రామంలో బుధవారం అరటి పొలాలను జర్మనీ టీం, ఐజీగార్ల్‌ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు ప్రకృతి వ్యవసాయ రైతుల పొలం, రసాయనిక వ్యవసాయ రైతుల పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ప్రకృతి వ్యవసాయంలో పండించిన అరటిరైతు రాజశేఖర్‌ రెడ్డి తోటలో చెట్లు లావుగాను, ఏపుగాను, ఎక్కువ కాయలు దిగుబడి, నాణ్యత కలిగి ఉండడం గమనించారు. అలాగే చెట్లు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవడం, ఎల్‌నినో ప్రభావంలో తక్కువ నీటి ఎద్దడి ఉన్నప్పటికీ చెట్లు ఏపుగా పెరగడం, వేర్లు దృడంగా ఉండడం, మల్చింగ్‌ చేయడం వల్ల భూమిలో తేమ శాతం బాగా ఉండడం, భూమిలో వేడి తక్కువగా ఉండటం గమనించారు. రసాయన పద్ధతిలో సాగుచేసిన అరటి తోటలో దీనికి పూర్తి భిన్నంగా ఉండటం గమనించారు. అనంతరం మురారిచింతలలో ప్రకృతి వ్యవసాయ రైతు నారాయణ రెడ్డి పొలంను జర్మనీ శాస్త్రవేత్తలు సందర్శించారు. ప్రకృతి వ్యవసాయం చేయడానికి గల కారణాలు, ప్రకృతి వ్యవసాయంవల్ల కలిగిన లాభాలు, నీవు వాడిన ఉత్పత్తులను తెలియజేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆ రైతు వారికి వివరించారు. కార్యక్రమంలో జర్మనీ ఐఆర్‌ఐఎస్‌ఎస్‌ సంగీత అగర్వార్‌, రాష్ట్ర కమిటీ మెంబర్‌ మురళీధర్‌, రీసెర్చ్‌ డైరెక్టర్‌ వరప్రసాద్‌, ఐజీ గార్ల్‌ అధికారులు శివారెడ్డి, లలిత, గుల్జార్‌, జలాల్‌, అనిత, స్వాతి, పూజిత, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement