ప్రభుత్వ భూమి ఆక్రమణకు యత్నం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూమి ఆక్రమణకు యత్నం

Sep 22 2026 12:30 AM | Updated on Sep 22 2026 12:30 AM

● టీడీపీ నేతల అండతో

చెలరేగుతున్న వైనం

● అడ్డుకున్న ఓ వర్గం

● చోద్యం చూస్తున్న అధికారులు

బి.కోడూరు : మండలంలోని అంకనగొడుగునూరు గ్రామంలో టీడీపీ నాయకుల అండదండలతో ఓ వర్గం వారు సర్వే నంబర్‌ 138/2లో ఉన్న సుమారు 1.60 ఎకరాల ప్రభుత్వ భూమిని జేసీబీలతో కంప చెట్లను తొలగించి ఆక్రమించే ప్రయత్నం చేశారు. దీంతో అదే గ్రామానికి చెందిన మరో వర్గం వారు ఆ ప్రభుత్వ భూమిలో తమకూ హక్కుందని, సుమారు 30 సంవత్సరాల క్రితం డీ పట్టా ఇచ్చి ఉన్నారని, అంతేకాకుండా 2016లో జరిగిన స్థల వివాద విషయమై కోర్టులో దావా నడుస్తోందని వారు ఆరోపిస్తూ ఆక్రమణను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఈ విషయమై స్థానికులు మండల తహసీల్దారుకు ఫోన్‌లో విషయం తెలిపినా.. సకాలంలో స్పందించకపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆక్రమణ జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ అధికార పార్టీ వర్గానికి వత్తాసు పలికినట్లు ఓ వర్గం వారు ఆరోపిస్తున్నారు. 2016లో ఈ స్థలం విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి కేసులు కూడా నమోదయ్యాయి. అప్పట్లో గ్రామస్తుల ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని సర్వే చేసి ఆ సర్వే నంబరులో ఎవరికీ హక్కులు లేవని ప్రభుత్వానిదే అంటూ హెచ్చరిక బోర్డును సైతం ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం హెచ్చరిక బోర్డును సైతం లెక్క చేయకుండా ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మండలంలో రోజురోజుకు అధికార పార్టీ నాయకుల ఆగడాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రభుత్వ స్థలాలు, భూములను ఆక్రమించేసుకుంటూ పేదల కడుపు కొడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మండలంలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు బతికి బట్టకట్టలేరని, ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణపై తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై మండల డిప్యూటీ తహసీల్దారు మధునాయక్‌ను వివరణ కోరగా ఆక్రమణ విషయమై మండల తహసీల్దారుకు సమాచారం అందిన వెంటనే స్థానిక వీఆర్‌ఓ, వీఆర్‌ఏలను సంఘటన స్థలానికి పంపి పనులను నిలుపుదల చేశామని, మంగళవారం రెవెన్యూ సిబ్బందితో కలిసి స్థలాన్ని పరిశీలించి కొలతలు వేయించి స్థలంలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement