కడప సెవెన్‌రోడ్స్ : స్థానిక కలెక్టరేట్‌లోని సభా భవన్‌లో మహాకవి గురజాడ వెంకట అప్పారావు జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జునుడు జ్యోతి ప్రజ్వలన చేసి, గురజాడ వెంకట అప్పారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి గురజాడ అప్పారావు చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. గురజాడ సాహిత్యం.. సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ సుబ్రహ్మణ్యం, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి సురేష్ కుమార్, జిల్లా సహకార శాఖాధికారి వెంకట సుబ్బయ్య, స్టెప్ సీఈఓ బీవీ ప్రసాద్, జిల్లా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారి ప్రతాప్‌రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో..
కడప అర్బన్ : వైఎస్‌ఆర్ కడప జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో గురజాడ అప్పారావు చిత్రపటానికి అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కె.ప్రకాష్ బాబు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి ఎన్.సుధాకర్, ఆర్‌ఐలు సోమశేఖర్ నాయక్, పెద్దయ్య, టైటస్, ఆర్‌ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, పావని, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో ఎర్రచందనం స్మగ్లర్లు
సాక్షి టాస్క్‌ఫోర్స్ : వైఎస్‌ఆర్ కడప జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణలో భాగంగా.. పోలీసులు జరిపిన విస్తృత దాడుల్లో ప్రత్యేక బృందం దాదాపు 9 మంది పేరుమోసిన స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రత్యేకంగా ఓ ప్రదేశంలో వుంచి విచారణ చేస్తున్నారు. వీరందరినీ జడ్చర్ల ప్రాంతంలో విచారణ చేసినట్లు సమాచారం. వీరిలో ప్రధాన ఎర్రచందనం స్మగ్లర్, ఇటీవల కాలం వరకు పీడీయాక్ట్‌లో వుండిన జాకీర్‌దే కీలకపాత్ర అని పోలీసుల విచారణలో తేలింది. జాకీర్ దగ్గరి బంధువు నాగదస్తగిరిరెడ్డి కూడా గతంలో పిడియాక్ట్‌లో శిక్షను అనుభవించి వెళ్లారు. పోలీసుల అదుపులో వున్న 9 మందిలో ఇద్దరిని తప్పించేందుకు నాగదస్తగిరిరెడ్డి తమ వంతుగా ‘అన్ని విధాలు’గా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ప్రత్యేక ప్రదేశంలో వుంచి విచారణ చేస్తున్న వీరిని సోమవారం జిల్లా పోలీస్‌బాస్ స్వయంగా వచ్చి విచారించినట్లు సమాచారం. వీరి నుంచి ఇప్పటి వరకు దాదాపు టన్ను మేరకు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇంకా లోతుగా విచారణ చేసి త్వరలో వీరిని అరెస్ట్ చేసి, మీడియా ముందు హాజరుపర్చనున్నట్లు తెలిసింది.


