‘వ్యక్తిగతంగా ఆరోపణలు చేయలేదు’ | - | Sakshi
Sakshi News home page

‘వ్యక్తిగతంగా ఆరోపణలు చేయలేదు’

Sep 22 2026 12:30 AM | Updated on Sep 22 2026 12:30 AM

కడప కార్పొరేషన్‌ : పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌పై తాను వ్యక్తిగతంగా ఎవరిపై నిందారోపణలు చేయలేదని వైఎస్సార్‌సీపీ కడప జిల్లా అధికార ప్రతినిధి పి.జయచంద్రారెడ్డి తెలిపారు. ఈ నెల 14వ తేదీ ఆయన పెట్టిన ప్రెస్‌మీట్‌పై పోలీసులు ఆధారాలు చూపాలని నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఆయన వాటికి రాతమూలకంగా సమాధానం ఇచ్చారు. ప్రసార మాధ్యమాల్లో వచ్చిన సమాచారం మేరకు తాను ప్రెస్‌మీట్‌ పెట్టానని, అందులో అభ్యర్థుల అనుమానాలు నివృత్తి చేయమని కోరానే తప్ప ఎవరిపైనా ఆరోపణలు చేయలేదన్నారు. తాను మాట్లాడిన మాటలన్నీ అభ్యర్థులు అడిగిన ప్రశ్నలుగానే భావించాలని, ప్రభుత్వం వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరముందని తెలిపారు.

యువకుడి అదృశ్యం

పులివెందుల రూరల్‌ : మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన నారాయణస్వామి, అంజనమ్మ కుమారుడు దినేష్‌ ఈనెల 19వ తేదీ నుంచి కనిపించడం లేదని తల్లిదండ్రులు సోమవారం పులివెందుల అర్బన్‌ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దినేష్‌ ఇంటర్‌ పూర్తి చేసి బీటెక్‌ వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిపోయాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పట్టపగలే చోరీ

కొండాపురం : గుర్తుతెలియని వ్యక్తులు పట్టపగలు ఇంట్లోకి చొరపడి రూ. 4 లక్షల విలువ గల బంగారం వస్తువులు చోరీ చేసిన ఘటన కొండాపురం మండల పరిధిలోని ఎస్‌.తిమ్మాపురం గ్రామంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఆ ఇంటికి కొండాపురం సీఐ రాజా, ఇన్‌చార్జి ఎస్‌ఐ మంజునాథ, ఏఎస్‌ఐ హాజి బాషా చేరుకుని పరిశీలించారు. ఏఎస్‌ఐ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్‌.తిమ్మాపురం గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన పెద్దన్న ఇంటిలో ఎవరూ లేని సమయంలో పట్టపగలే దొంగతనం జరిగింది. సోమవారం ఉదయం పెద్దన్న కుటుంబ సభ్యులతో కలిసి తోటకు వెళ్లారు. తాళం చెవ్వు ఇంటి బయట మంచంలో ఉన్న పరుపు కింద పెట్టి వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటికి వచ్చారు. ఇంటిలోని బీరువా తెరిచి ఉండటంతో దొంగతనం జరిగిన సంఘటనను పోలీసులకు తెలిపారు. బీరువాలోని హారం, చైన్‌, కమ్మలు కలిపి ఆరు తులాల బంగారంతోపాటు నగదు రూ. 25 వేలు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

వీఆర్‌కు హెడ్‌కానిస్టేబుల్‌

ఖాజీపేట : ఖాజీపేటలో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రామగోవిందును వీఆర్‌కు పంపినట్లు సీఐ వంశీధర్‌ తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం, అలాగే డ్యూటీ సక్రమంగా చేయక పోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వీఆర్‌కు పంపినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement