పులివెందుల రూరల్ : జిల్లాలో శనివారం రాత్రి వీచిన ఈదురు గాలులు, భారీ వర్షానికి పులివెందుల మండల పరిధిలోని నల్లపురెడ్డి పల్లె, కొత్తపల్లె, మల్లికార్జునపురం, నల్లగొండు వారి పల్లె, యర్రబల్లె తదితర గ్రామాల పరిధిలోని అరటి చెట్లు నేలకొరిగాయి. దీంతో లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో తీవ్రంగా నష్టపోయామని కన్నీటిపర్యంతమయ్యారు. సుమారు రూ.50లక్షల దాకా నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. ఈదురుగాలులకు పులివెందుల మండలం చంద్రగిరి గ్రామానికి వెళ్లే రహదారిలో ఉన్న శివ వైన్సుకు సంబంధించిన పైకప్పు లేచిపోవడంతోపాటు ప్రహారీ గోడలు కూడా కూలిపోయాయి.


