కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఈ విద్యా సంవత్సరం నుంచి బిజినెస్ అనలిటిక్స్ కోర్సు ప్రారంభించామని ఎంబీఏ శాఖ విభాగాధిపతి, ప్రజా సంబంధాల విభాగం సంచాలకులు ఆచార్య పి.సరిత వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంబీఏ–హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్(హెచ్‌ఆర్‌ఎం) ఇది వరకే ఉందని.. ప్రస్తుత అవసరాలకు, ఉపాధి అవకాశాలకు మార్గంగా ఉపకులపతి ఆలోచనలతో బిజినెస్ అనలిటిక్స్ కోర్సును ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కోర్సు కలిగిన ఏకై క విశ్వవిద్యాలయం వైవీయూ అని తెలిపారు. 2017 నుంచి హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ సీనియర్ ప్రొఫెసర్‌గా బిజినెస్ ఎనలిటిక్స్ కోర్స్ అమలు చేసి సత్ఫలితాలు తెచ్చిన ప్రస్తుత వైవీయూ వీసీ అదే పంథాలో ఇక్కడ విద్యార్థులకు ప్రయోజనం కల్పించాలని వైవీయూలో రెగ్యులర్ ఉచిత కోర్స్ (ఐసెట్ రాసిన వారికి ప్రవేశం) ప్రారంభించారన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లర్నింగ్ (ఏఐఎంఎల్) కాలంలో ఉన్న మనం బిజినెస్ రంగంలో అప్లికేషన్స్ విధానాన్ని చేసేందుకు ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్ చదివిన వారు ఉపయోగపడతారన్నారు. సంస్థల్లో మేనేజర్ జాబ్ పొందవచ్చు అన్నారు. భవిష్యత్తు అంతా డేటా సైన్స్ దే కాబట్టి మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ గా ఎదిగేందుకు ఇది దోహదపడుతుందన్నారు. విశ్వవిద్యాల ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ ఈ కోర్సుకు రెగ్యులర్‌గా పాఠ్యాంశాలు బోధిస్తారన్నారు. అంతేకాకుండా ఎంబీఏ ఎక్స్‌ఫర్టెడ్ ఫ్యాకల్టీ, పరిశ్రమలతో అనుసంధానమై నిపుణులతో పాఠాలు బోధించేలా చూస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తుది విడత కౌన్సెలింగ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, వెబ్ ఆప్షన్లు నమోదు చేసే సమయంలో యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని తమ ప్రాధాన్యతలలో ఒకటిగా ఎంపిక చేసుకోవలసిందిగా కోరారు. ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అయినప్పటికీ ప్రభుత్వ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉంటుందన్నారు. ప్రవేశాలు సంబంధిత అర్హత నిబంధనలు, సీట్ల లభ్యతకు లోబడి ఉంటుందన్నారు. కోర్సుల లభ్యత, అర్హత, ఫీజు రాయితీలు, ప్రవేశ విధానానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు యోగి వేమన విశ్వవిద్యాలయం, బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగాధిపతిని సంప్రదించవచ్చన్నారు. ఎపీఐసెట్–2026లో అర్హత సాధించి ప్రవేశానికి అర్హులైన అభ్యర్థులు ఎంబీఏ కోర్సులో ప్రవేశం పొందదలచినట్లయితే ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే తుది విడత వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరు కావాలని కోరారు. కౌన్సెలింగ్ విధానం కోసం అధికారిక వైవీయూ వెబ్‌సైట్‌ను సందర్శించవలసిందిగా సూచించారు.
24వ తేదీ వరకు నిర్వహణ
వైవీయూలో నూతనంగా బిజినెస్
అనలిటిక్స్ కోర్సు


