● ఇరు వర్గాలకు చెందిన ఏడుగురికి గాయాలు
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక మైదుకూరు రోడ్డులో గుజిరీ వ్యాపారుల మధ్య జరిగిన ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన ఏడుగురికి గాయాలయ్యాయి. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెన్నానగర్‌కు చెందిన షాషా గుజిరీ వ్యాపారం చేస్తున్నాడు. అతనికి పట్టణంలోని పలువురు గుజిరీ వ్యాపారులతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకుడు పీఎండీ నజీర్, ఆయన సోదరుడు మహబూబ్‌బాషా కూడా గుజిరీ సరుకు పంపించేవారు. అయితే కొద్ది రోజులుగా పీఎండీ నజీర్, మహబూబ్‌బాషాలు షాషాకు గుజిరీ సరుకు పంపించడం మానేశారు. మౌలానా ఆజాద్ వీధికి చెందిన సయ్యద్‌ఖాన్ అనే వ్యాపారికి సరుకు పంపిస్తున్నారు. దీంతో షాషా పలుమార్లు నజీర్, మహబూబ్‌బాషాకు ఫోన్లు చేసి గట్టిగా వాగ్వాదం చేస్తూ దూషించాడు. దీంతో షాషాకు నజీర్ ఫోన్ చేసి మాట్లాడుకుందాం రా అని చెప్పాడు. ఈ క్రమంలో ఆదివారం మైదుకూరు రోడ్డులోని రిలయన్స్ పెట్రోల్ బంకు వద్ద ఉన్న సయ్యద్‌ఖాన్ షాపు వద్దకు కొంత మంది వ్యక్తులను వెంట తీసుకొని షాషా వెళ్లాడు. అప్పటికే అక్కడ సయ్యద్‌ఖాన్‌తోపాటు నజీర్, మహబూబ్‌బాషా మరి కొంత మంది షాపు వద్ద ఉన్నారు. అక్కడ అందరూ మాట్లాడుకునే క్రమంలో వాగ్వాదం చోటు చేసుకొని చివరకు ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలోనే ఇరువర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. ఘర్షణలో సయ్యద్‌ఖాన్, నజీర్‌తోపాటు మరో ఇద్దరికి గాయాలు కాగా, అవతలి వర్గానికి చెందిన షాషాతోపాటు మరో ఇద్దరు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్‌ఐ రాజు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లారు. జరిగిన ఘటనపై స్థానికులతో మాట్లాడారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరస్పర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు.


