● కడప బాలికలు బెంగళూరులో లభ్యం
● సాంకేతిక పరిజ్ఞానంతో ఆచూకీ గుర్తింపు
కడప అర్బన్ : కడపలోని సాయిపేటలో అదృశ్యమైన అయిన ఇద్దరు బాలికలను పోలీసులు 24 గంటల్లోనే గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. కడప టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో శనివారం నమోదైన ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసులో పోలీసులు వెంటనే ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా బాలికలు కడప నుంచి తిరుపతికి, అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లినట్లు గుర్తించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ ఈ.బాలస్వామిరెడ్డి పర్యవేక్షణలో కడప టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ వి.శ్రీహరి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో ఎస్‌ఐ ఆర్.వి.కొండారెడ్డి, కానిస్టేబుళ్లు రామకృష్ణ, తులసి రామయ్య, ఉమెన్ కానిస్టేబుల్ సాబిరున్ ఉన్నారు. పోలీసు బృందం బాలికలు వెళ్లిన మార్గాన్ని గుర్తించేందుకు సీసీ కెమెరా ఫుటేజీలను విస్తృతంగా పరిశీలించడంతోపాటు, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించింది. సీసీ కెమెరా ఆధారాల ద్వారా బాలికల కదలికలను గుర్తించి, వారు తిరుపతి మీదుగా బెంగళూరుకు వెళ్లినట్లు నిర్ధారించారు. వెంటనే ప్రత్యేక పోలీసు బృందం బెంగళూరుకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టింది. అదృశ్యమైన 24 గంటల్లోపే ఇద్దరు బాలికలను సురక్షితంగా గుర్తించి, కడపకు తీసుకువచ్చారు. అనంతరం అవసరమైన పోలీసు ప్రక్రియను పూర్తి చేసి వారి తల్లిదండ్రులకు ఆదివారం సురక్షితంగా అప్పగించారు. ఈ సందర్భంగా కడప టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ వి. శ్రీహరి మాట్లాడుతూ మిస్సింగ్ వ్యక్తుల విషయంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.


