బద్వేలు అర్బన్ : మండల పరిధిలోని పుట్టాయపల్లె గ్రామంలో ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీకి చెందిన బీరంరాములమ్మకు తీవ్ర గాయాలు కాగా శివారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. అలాగే టీడీపీకి చెందిన నారాయణరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. వినాయకచవితి సందర్భంగా ఈ నెల 14న గ్రామంలో వినాయక ప్రతిమను ప్రతిష్టించారు. ఆ సమయంలో వైఎస్సార్‌సీపీకి చెందిన వారు గత వినాయక చవితికి సంబంధించిన జమాఖర్చులు తెలపాలని టీడీపీ వర్గీయులను అడిగారు. ఇంతలో పెద్దమనుషులు జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగింపజేసి 16వ తేదీన వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. అయితే టీడీపీ వర్గీయులను జమా ఖర్చుల గురించి ప్రశ్నించిన విషయాన్ని మనసులో పెట్టుకుని.. ఆదివారం జరుగుతున్న శ్రీరాముని గ్రామోత్సవం సందర్భంగా టీడీపీ వర్గీయులు వైఎస్సార్‌సీపీ వర్గీయులను దుర్భాషలాడారు. ఇదేమిటని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో బీరంరాములమ్మ తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె కుటుంబ సభ్యులు బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. తిరిగి పట్టణంలోని ఈద్గా వద్ద వైఎస్సార్‌సీపీ వర్గీయులపై దాడి చేశారు. ఆ సమయంలో పరస్పరం దాడులు చేసుకోవడంతో టీడీపీకి చెందిన నారాయణరెడ్డికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం రాములమ్మకు ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ క్రిష్ణయ్య, రూరల్ ఎస్‌ఐ చిరంజీవి గ్రామానికి చేరుకుని ఘర్షణ విషయమై ఆరా తీశారు. ప్రస్తుతానికి ఈ వ్యవహారంపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.


