కలెక్టరేట్‌లో బాధితురాలి ఆవేదన
కడప సిటీ : మా పాప సదరం సర్టిఫికెట్ పొందేందుకు అర్హతలున్నా వైద్యులు లెక్కచేయకుండా, ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని బాధితురాలి తల్లి, బద్వేలుకు చెందిన షేక్ రిజ్వాన ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఈ విషయంపై కలెక్టర్‌కు నివేదించేందుకు బాధితురాలు షేక్ ముబీనతో కలిసి ఆమె కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా శ్రీసాక్షిశ్రీతో మాట్లాడారు.తన కుమార్తె షేక్ ముబీన పుట్టుకతోనే మెదడు చిన్న సైజులో ఉందన్నారు. దీంతో ఎడమ చేయి, ఎడమ కాలుకు పక్షవాతం వచ్చిందన్నారు. వైద్య పరీక్షల్లో కూడా ఇది నిర్ధారణ అయిందన్నారు. మందులకు నెలకు రూ. 3500 అవుతోందని, ఒకవేళ వాడకపోతే రోజుకు 20 సార్లు ఫిట్స్ వస్తాయని, ఒకరు మాత్రం ఏ పనికి వెళ్లకుండా ఆమెను చూసుకోవాల్సిన అవసరం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భర్త పెయింటర్‌గా పనిచేస్తున్నాడని, బాడుగ ఇంటిలో నివాసం ఉంటున్నామని వివరించారు. ఒకరి సంపాదనతో ఇల్లు గడవక అప్పులపాలయ్యామని కంటి తడి పెట్టారు. సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నామని, కానీ సర్టిఫికెట్ మాత్రం రావడం లేదన్నారు. వైద్యులు మానసిక చికిత్సాలయానికి వెళ్లమంటున్నారు తప్ప సదరం సర్టిపికెట్ ఇవ్వడం లేదన్నారు. ఒక్కగానొక్క కుమార్తె ఇలా అనారోగ్యం పాలు కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, కలెక్టర్‌ను కలిస్తే న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామని వివరించారు.


