పాపం పండింది.. మృగాడికి శిక్ష పడింది | - | Sakshi
Sakshi News home page

పాపం పండింది.. మృగాడికి శిక్ష పడింది

Sep 19 2026 5:44 AM | Updated on Sep 19 2026 5:44 AM

పాపం పండింది.. మృగాడికి శిక్ష పడింది

‘సమాజం తలదించుకునేలా ఒక మైనర్‌ బాలికపై అమానుషంగా అత్యాచారం చేసి, ఆపై సజీవ దహనం చేసిన కిరాతకుడి పాపం పండింది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ దారుణ హత్య కేసులో ఎట్టకేలకు న్యాయం గెలిచింది. ఆ మృగాడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష (జీవిత ఖైదు) విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.’

గోపవరం : మైనర్‌ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి, అనంతరం సజీవ దహనం చేసి హత్య చేసిన కేసులో నేరం రుజువు కావడంతో కడప పోక్సో కోర్టు నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.8 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. బాధితురాలి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన వివరాలను బద్వేలు రూరల్‌ సీఐ ఎన్‌.క్రిష్ణయ్య విలేకరులకు వెల్లడించారు. వైఎస్సార్‌ జిల్లా బద్వేలు రూరల్‌ పోలీసుస్టేషన్‌ క్రైం నంబర్‌ 231/2024 – బి.ఎన్‌.ఎస్‌–2023 సెక్షన్‌ 64, 103, 303(2), 238 పోక్సో చట్టం 2012 సెక్షన్‌ 3/4 కింద నమోదైన కేసులో అధికారులు సమర్థవంతమైన దర్యాప్తు, సాంకేతిక ఆధారాల సేకరణ, ప్రాసిక్యూషన్‌ ఫలితంగా నిందితుడిపై నేరం రుజువైంది. కడప పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎం.ఏ.సోమశేఖర్‌ నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.8 వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

కేసు పూర్వాపరాలు

జక్కల విఘ్నేష్‌ అలియాస్‌ సాయి(19) ప్రేమ పేరుతో మైనర్‌ బాలికను నమ్మించి గోపవరం మండలం పి.పి.కుంట అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి.. అత్యాచారానికి పాల్పడి అనంతరం పెట్రోలు పోసి సజీవ దహనం చేసి హత్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. కేసు దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన అప్పటి బద్వేలు రూరల్‌ సీఐ ఎం.నాగభూషణం సాంకేతిక ఆధారాలు సేకరించి కేసు దర్యాప్తును సమర్థవంతంగా పూర్తి చేయడంతో.. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి చార్జిషీట్‌ దాఖలు చేయడం జరిగింది.

నిందితుడి వివరాలు

జక్కల విఘ్నేష్‌ అలియాస్‌ సాయి బద్వేలు టౌన్‌ రామాంజనేయనగర్‌లో నివాసం ఉంటూ కడపలో ఓ హోటల్‌లో కుక్‌గా పని చేసే వాడు.

దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌ బృందానికి

అభినందనలు

కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి చార్జిషీటు దాఖలు చేసిన మునుపటి బద్వేలు రూరల్‌ సీఐ నాగభూషణం సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరుపరచడంతో పాటు సాక్షాలను సమర్థవంతంగా ప్రవేశపెట్టడంలో కీలకపాత్ర పోషించారు. అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె.వేణుగోపాల్‌, బద్వేలు రూరల్‌ ప్రస్తుత సీఐ ఎన్‌.క్రిష్ణయ్య, కోర్టు మానిటరింగ్‌ ఏఎస్‌ఐ నాగేంద్ర, పీసీ శ్రీనివాసులును జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ ప్రత్యేకంగా అభినందించారు. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులపై పోలీసుశాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని, నేరం రుజువైతే చట్టప్రకారం కఠిన శిక్షలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

పోక్సో కోర్టు సంచలన తీర్పు

బాలికపై అత్యాచారం, హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష

బాధితురాలి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement