జర్నలిస్టులపై దాడులు చేస్తే సహించేది లేదు | - | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులపై దాడులు చేస్తే సహించేది లేదు

Sep 19 2026 5:44 AM | Updated on Sep 19 2026 5:44 AM

కడప అర్బన్‌ : జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులను సహించేది లేదని వైఎస్సార్‌ జిల్లా ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌ స్పష్టం చేశారు. వేంపల్లి సాక్షి టీవీ విలేకరి దివాకర్‌రెడ్డిపై ఇసుక మాఫియా బెదిరింపుల అంశాన్ని ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ (ఏపీయూడబ్ల్యూజే) ఎస్పీ దృష్టికి తీసుకువచ్చింది. రైతులు ఇసుక దందాపై ఆందోళన చేసిన అంశాన్ని కవర్‌ చేసినందుకు దివాకర్‌రెడ్డికి బెదిరింపు కాల్స్‌, మెసేజ్‌లు వచ్చాయని.. ఇసుక మాఫియా ఆగడాలకు జర్నలిస్టులు భయాందోళనకు గురవుతున్నారని యూనియన్‌ నేతలు ఎస్పీకి తెలిపారు. బెదిరింపు కాల్స్‌కు సంబంధించిన ఆధారాలను సైతం ఎస్పీకి అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌ మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. తప్పనిసరిగా బెదిరింపులకు దిగిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన అనంతరం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మాజీ కార్యదర్శి పల్లేటి రామసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షులు మోపూరి బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతులు చేసిన ఆందోళనను కవర్‌ చేసినా చంపేస్తామంటూ బెదిరింపులకు దిగడం తగదన్నారు. ఇప్పటికే జిల్లాలో పలు సందర్భాల్లో జర్నలిస్టులపై దాడులకు దిగారని, భవిష్యత్తులో ఇలాంటి దాడులు, బెదిరింపులు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇసుక మాఫియా నుంచి సాక్షి టీవీ విలేకరి దివాకర్‌రెడ్డికి వచ్చిన బెదిరింపు కాల్స్‌ విషయంలో ఎస్పీకి ఫిర్యాదు చేశామని, ఆయన సానుకూలంగా స్పందించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారని వారు వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీలను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఎస్పీని కలిసిన వారిలో ఐజేయూ సభ్యులు రామాంజనేయరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు శివరాం, జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ సురేంద్ర, ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టుల అసోసియేషన్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్‌ వెన్ను, బిగ్‌ టీవీ స్టాఫ్‌ రిపోర్టర్‌ శివ, వివిధ పత్రికలు, చానళ్లకు చెందిన జర్నలిస్టులు, ఫొటో, వీడియో జర్నలిస్టులు ఉన్నారు.

జిల్లా ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌

సాక్షి టీవీ విలేకరికి బెదిరింపులపై

ఎస్పీ సీరియస్‌

ఇసుక మాఫియా నుంచి విలేకరులకు రక్షణ కల్పించాలన్న ఏపీయూడబ్ల్యూజే

బెదిరింపు కాల్స్‌, మెసేజ్‌లపై ఎస్పీకి ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement