కడప సిటీ : ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా జిల్లాలో ఆహార నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి డాక్టర్ హరిత తెలిపారు. శుక్రవారం కడప నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాలు, ఆహార పదార్థాల పంపిణీ కేంద్రాలు, పన్నీర్, పాల ఉత్పత్తుల కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఓవీ రాముడుతో కలిసి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి డాక్టర్ హరిత విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయ ప్రక్రియలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా వంటశాలల పరిశుభ్రత, ఆహారం తయారు చేసే ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత, ఆహార పదార్థాలను నిల్వ చేసే విధానం, నిల్వ ఉష్ణోగ్రతలు, గడువు తేదీలు తదితర అంశాలను తనిఖీ చేశారు. అదే విధంగా హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగిస్తున్న వంట నూనెల నాణ్యత, కూరగాయలు, పాలు, పన్నీర్, ఇతర పాల ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించారు. ఆహార పదార్థాల్లో కల్తీకి అవకాశం ఉన్న ప్రాంతాలు, నాణ్యతా ప్రమాణాలు పాటించని విధానాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. నిబంధనల ప్రకారం ఆహార పదార్థాలను నిల్వ చేస్తున్నారా? పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తున్నారా? అనే అంశాలను కూడా పరిశీలించారు. తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న పన్నీర్, పాల ఉత్పత్తులు, ఇతర ఆహార పదార్థాల నుంచి నమూనాలను సేకరించినట్లు డాక్టర్ హరిత తెలిపారు. సేకరించిన నమూనాలను నాణ్యతా ప్రమాణాల పరిశీలన కోసం ఆహార పరిశోధన ప్రయోగశాలకు పంపినట్లు పేర్కొన్నారు. ప్రయోగశాల నుంచి వచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. ఆహార పదార్థాల నాణ్యతపై అనుమానాలు ఉన్నా, కల్తీ ఆహారం విక్రయిస్తున్నట్లు గుర్తించినా ప్రజలు సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఇందుకోసం 104 /1967 హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.


